మట్టికుండ

మట్టికుండ
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు.
క్షేత్రచరిత్ర/స్థల పురాణం: మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని... అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు.

చరిత్ర విశేషాలు: తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.

అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.

ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు: కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం: ఇక్కడే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేశారట! నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు.

పాతూరు: రాఘవేంద్రస్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామివారే చెక్కారట!

 వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం: రాఘవేంద్రస్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్రస్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట. ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు.

 రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు. రూ. 20కి 4 ముక్కలు ఇస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం.

దర్శన వేళలు: రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.

భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.

మఠంలో ప్రధాన పూజలు
 1. సంపూర్ణ అన్నదాన సేవ: ఒకరోజు సంపూర్ణ అన్నదాన సేవకోసం రూ. 2లక్షలు చెల్లించాలి. ఈ సేవకు 10మందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒకరోజు వసతి కల్పిస్తారు. ఏడాదిలో ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.

2. సమర్పణ సేవ: ఒక రోజు సమర్పణ సేవకు రూ. లక్ష చొప్పున చెల్లించాలి. పదిమందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒక రోజు వసతిసౌకర్యం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రివరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.

3. వస్త్ర సమర్పణ సేవ: వస్త్ర సమర్పణ సేవకు రూ.50 వేలు రుసుం. అన్ని బృందావనాలతో పాటు పీఠాధిపతికి పట్టు వస్త్రాలు ఇస్తారు. పదిమందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. భక్తులు ఒకరోజు ముందే మఠానికి చేరుకోవాలి. పూజకు ముందురోజూ, సాయంత్రం పట్టువస్త్రాలను భక్తులతో వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. వసతి సౌకర్యం కల్పిస్తారు. ఒకరోజు ముందే ఈ పూజ కోసం నమోదు చేసుకోవాలి.

4. పట్టువస్త్ర సమర్పణ సేవ: ఇది రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, పీఠాధిపతికి మాత్రమే. ఇందులో పాల్గొనేందుకు రూ. 25వేలు చెల్లించాలి. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేస్తారు. ఒకరోజు ముందు శ్రీమఠానికి చేరుకోవాలి. ముందురోజు సాయంత్రం పట్టువస్త్రాలు వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. ఒకరోజు వసతి సౌకర్యం కల్పిస్తారు.

5.బంగారు పల్లకి సేవ: మఠంలో బంగారు పల్లకి సేవలో పాల్గొనేందుకు రూ. 8వేలు రుసుం చెల్లించాలి. రోజుకు 10 మందిని మాత్రమే అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 9.30 గంటలకు పూజ జరుగుతుంది. గంట ముందే శ్రీ మఠానికి చేరుకోవాలి.

6. బంగారు రథోత్సవ సేవ: బంగారు రథోత్సవ సేవకు రూ. 6వేలు చెల్లించాలి. రాత్రి 7.30 గంటలకు ఈ సేవ జరుగుతుంది. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. అదేరోజు సాయంత్రం గంట ముందు శ్రీమఠానికి చేరుకోవాలి.

7. కనక కవచ సమర్పణ సేవ: కనక కవచ సమర్పణ సేవకు రూ. 3,500 రుసుం. 8 మందిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.

8. రజత రథోత్సవ సేవ: ఈ రజత రథోత్సవ సేవలో పాల్గొనదల్చిన భక్తులు రూ. 2 వేలు రుసుంగా చెల్లించాలి. ఆరుగురిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రాలు ఇస్తారు. రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.

9. రథోత్సవ(చెక్క)సేవ: (చెక్క) రథోత్సవ సేవ కోసం భక్తులు రూ. 1000 చెల్లించాలి. రాత్రి 7.30కి ఈ సేవ నిర్వహిస్తారు. నలుగురికి అనుమతి ఉంటుంది. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, శాలువా ఇస్తారు. దీనికి ముందురోజే నమోదు చేసుకుని మఠానికి చేరుకోవాలి.

10. కనక మహాపూజ: ఈ పూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 750 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.

11.పూర్ణసేవ: పూర్ణసేవ రోజూ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 15 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.

12. మహాపూజ: మహాపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. దీనికోసం భక్తులు రూ. 350 చెల్లించాలి. ముగ్గురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు. గంట ముందు మఠంలో ఉండాలి.

13. సర్వసేవ: సర్వసేవ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 250 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం బహుమతిగా ఇస్తారు. సేవకు గంట ముందు మఠంలో ఉండాలి.

14. ఉత్సవరాయ పాదపూజ: ఉత్సవరాయ పాదపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికీ అనుమతి ఉంటుంది. వస్త్రం ఇస్తారు. పూజకు ముందుగానే హాజరవ్వాలి.

15 ఫల పంచామృతాభిషేకం: ఫల పంచామృతాభిషేకం ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 150 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. వస్త్రం ఇస్తారు.

16. పంచామృత సేవ: ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 75 చెల్లించాలి. ఇద్దరిని అనమతిస్తారు. వస్త్రం ఇస్తారు.

17. శ్రీవాయుస్తుతి పునశ్చరణ సేవ: బృందావనానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి ఈ సేవ చేస్తారు. ఇది ప్రతి శుక్రవాం మాత్రమే ఉదయం 7.30 ఉంటుంది. రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.

18. శ్రీవాయుస్తుతి పునశ్చరణ(శుద్ధోదక): ఆదివారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 7.30కు నిర్వహిస్తారు. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికి అనుమతి ఉంటుంది. నాలుగు పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.

19. శ్రీ సత్యనారాయణ స్వామిపూజ: ఉదయం 9 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. వస్త్రం ఇస్తారు.

20 సామూహిక సత్యనారాయణ స్వామిపూజ: పౌర్ణమిరోజు మాత్రమే చేస్తారు. రూ. 50 చెల్లించాలి. ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ పూజలో పాల్గొనేందుకు పౌర్ణమికి ముందు రోజు నమోదు చేసుకోవాలి.

21. గోదాన సేవ: ఉదయం 9 నంచి 12 వరకూ ఉంటుంది. రూ. 5 వేలు చెల్లించాలి. కుటుంబం మొత్తం అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి మఠం జ్ఞాపిక ఇస్తారు.
 ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి.. బుక్‌ చేసుకోవచ్చు.

మఠంలో వసతి.. ఇతర సౌకర్యాలు: ఇక్కడ భక్తుల కోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. రోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అన్న ప్రసాద వితరణ ఉంటుంది. రాత్రి భోజనంగా రూ. 2కు పెరుగన్నం.. చిత్రాన్నం ఇస్తారు. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి.

అదనపు సమాచారం:  రూ. 8 వేల నుంచి రూ. 2లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు.

 ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
 ద్వాదశి, ఆరాధనోత్సవాల సమయంలో పూజ వేళల్లో మార్పులుంటాయి. మిగతారోజుల్లో సాధారణమే
గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం... ఇలా అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు. ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు. ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి. అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు.
పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది.
అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు; పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు... ఇవన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం వల్ల, ఆయనను భగవంతుడిగా కొలుస్తామంటారు కొందరు. భగవంతుడే ఒక నిండైన మహా వ్యక్తిగా అవతరించి, లోకానికి ఆరాధ్యుడయ్యాడని ఇంకొందరు చెబుతారు. ఈ రెండో అంశమే వాల్మీకాది మహర్షుల హృదయం!
ఆదర్శమూర్తి అయిన రాముడు- నారాయణుడి అవతారంగా ఎందరికో ఆరాధ్యుడు. రావణాది రాక్షసుల వల్ల సడలిన ధర్మవ్యవస్థను చక్కదిద్దడానికి రుషులు, దేవతలు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మను ఉపాసించారు. జగతికి ఆనందం కలిగించడానికి ఆ పరమాత్మను మంత్రం, తపస్సు, సాధనలతో ఆరాధించారు. వాటి ఫలంగా భగవంతుడు రాముడిగా అవతరించాడు.
రామారాధన అంటే, అది సాక్షాత్తు పరబ్రహ్మోపాసన. దీనికి తార్కాణంగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భిన్న భాషల్లో భిన్న రీతుల్లో పలువురు భక్తులు, యోగులు సాక్షాత్కరిస్తారు. తులసీదాసు, రామదాసు, కబీరు, త్యాగయ్య... ఇలా ఎందరో!
రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని ‘దేవ రహస్యం’ అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా- జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు- దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.
ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదు కోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా- సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.
ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు (గట్టి నియమ పాలన గలవాడు) శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ.
భారతజాతి గుండె చప్పుడుగా రామనామం మోగుతూనే ఉంది. ఆస్తిక జన హృదయాల్లో ఆయన దివ్యమంగళ విగ్రహం కొలువై ఉంది. రామ కథా సుధ తరగని జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది!
శ్రీరామనవమి’ అనగానే, మనందరికీ సీతారామ కల్యాణం గుర్తుకొస్తుంది. నిజానికి చైత్ర శుక్ల (శుద్ధ) నవమి రాముడి పుట్టినరోజే తప్ప- సీతారాముల పెళ్లిరోజు కాదు. వారి కల్యాణం వైశాఖ శుక్ల దశమినాడు జరిగిందని ‘వాల్మీకి రామాయణం’ చెబుతోంది. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి రెండూ- వారి వారి జన్మతిథులు. పుట్టిన రోజునాడు శాంతి కల్యాణాలు జరిపించడం సంప్రదాయం. శ్రీరాముడి పుట్టినరోజు వేడుకలు- సీతమ్మతో కలిపి జరిపించే క్రమంలో, శాంతి కల్యాణం చైత్ర శుద్ధ నవమి నాడు నిర్వహిస్తారు.
రామాయణం రీత్యా, సీతమ్మది గౌతమ గోత్రం. రాముడిది వసిష్ఠ గోత్రం. భద్రాద్రిలో వెలసింది వైకుంఠుడన్న భావనతో శ్రీమహాలక్ష్మికి చెందిన సౌభాగ్య గోత్రాన్ని సీతమ్మకు, శ్రీమహావిష్ణువుదైన అచ్యుత గోత్రాన్ని శ్రీరాముడికి ఆపాదిస్తూ- కల్యాణ క్రతువులో ప్రవర చెబుతారు. భద్రాచలంలో మూలవిరాట్టుకు, ఆరుబయట ఉత్సవ మూర్తులకు ఒకేసారి కల్యాణం నిర్వహించడం ఒక విశేషం.
అనేక ఏళ్ల క్రితం రామాలయంపై దుండగులు దాడి చేసినప్పుడు, అర్చక స్వాములు ఆ ఉత్సవ మూర్తులను గోదావరి సమీపంలో దాచి పెట్టారు. ఆ తరవాత వాటిని వెలికి తీసేటప్పుడు, సీతమ్మ ప్రతిమ కనిపించలేదు. ఈలోగా శ్రీరామనవమి రావడంతో, మూల విరాట్టులకు కల్యాణం జరిపించారు. అమ్మవారి విగ్రహం కొన్నేళ్ల అనంతరం లభించడంతో, మళ్లీ ఉత్సవ మూర్తులకు కల్యాణాలు మొదలయ్యాయి. భద్రాచల సీతారాముల కల్యాణంలో ‘మూడు సూత్రాలు’ మరో విశేషం. జనకుడు, దశరథుడు, కంచర్ల గోపన్నల పక్షాన మొత్తం మూడు సూత్రాలను సీతమ్మ కంఠంలో అలంకరిస్తారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని అధికారిక కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. ప్రసిద్ధ రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిల్లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఒంటిమిట్టలో రాత్రిపూట పండువెన్నెల్లో నిర్వహిస్తారు. సూర్యోదయం అనంతరం పగలు పద్నాలుగు ఘడియలు- అంటే, అయిదు గంటలా ముప్ఫై ఆరు నిమి షాల తరవాత, సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో అభిజిల్లగ్నం 48 నిమిషాలపాటు ఉంటుంది. (వామనావతారం ఆ లగ్నంలోనిదే). ఆ లగ్నంలో భద్రాద్రిలో సీతారాముల కల్యా ణం జరుగుతుంది.
అలా కాకుండా, కల్యాణాన్ని ఒంటిమిట్టలో శుక్లపక్ష చతుర్దశి రాత్రి ఆరుబయట వెన్నెల్లో నిర్వహించడం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. సూర్యవంశపు రాముడు- రామ‘సూర్యుడు’ కాకుండా రామ‘చంద్రుడు’ కావడంలోని రహస్యమే... ఆ కథలోనూ అంతర్భాగం అయింది.
బాల్యంనుంచి రాముడికి చంద్రుడంటే ఇష్టం. చందమామ కావాలని తల్లివద్ద మారాం చేయడం, అద్దంలో చంద్రుణ్ని చూపిస్తే ఆనంద పడటం తెలిసిన కథే!
వాల్మీకి మహర్షి రామాయణ రచన ఆరంభంలో 16 సత్పురుష లక్షణాల గురించి నారద మహర్షిని అడిగాడు. వాటిని ‘పరమేశ్వర కళలు’గా వర్ణిస్తారు. అవన్నీ కలిగి ఉండటం పూర్ణ పురుష లక్షణం. ఆ లక్షణాలన్నీ కలిగిన రాముడు ‘షోడశ కళాప్రపూర్ణుడు’ అని రామాయణం చెబుతోంది. మరోవైపు- పుష్టి, ధృతి, తుష్టి వంటి 16 కళలతో పున్నమి చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తుంటాడు కాబట్టి, పురాణాలు చంద్రుణ్ని ‘షోడశ కళాప్రపూర్ణుడు’ అన్నాయి. వారిద్దరికీ అదే సాపత్యం! పగలు జరిగే రాముడి పెళ్లి తాను చూడలేనందుకు చంద్రుడు బాధపడతాడు. అందువల్ల రాముడు రాత్రిపూట కల్యాణానికి అంగీకరించాడని- ఒంటిమిట్ట కోదండ రాముడికి చెందిన కథ ప్రచారంలో ఉంది.
‘లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక’ అన్నట్లు, వీటి నిజానిజాల సంగతి ఎలా ఉన్నా- భద్రాద్రి రాముడి పెళ్లి పగలు, ఒంటిమిట్ట రాముడి పెళ్లి రాత్రిపూట జరగడం గమనించాల్సిన అంశాలు. సీతారాముల కల్యాణం జరిగింది ఎప్పుడైనా, అది లోక కల్యాణం అన్నదే భక్తుల నిశ్చిత అభిప్రాయం!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నారు పెద్దలు. ఈ లోకంలో ఏ పనైనా సాధన వల్లనే ఒనగూడుతుంది. అది ప్రాపంచికమైనా, పారమార్థికమైనా! ముఖ్యంగా సాధన అనేది పారమార్థికంగానే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. భగవంతుణ్ని పొందాలంటే చేయాల్సింది ఒకే ఒక్కటి- సాధన. దానికి కావాల్సింది...విద్య, సంపాదన, సంపద, కీర్తి, ప్రతిష్ఠ, ఆరోగ్యం, వయసు, సౌందర్యం...ఏదీ కాదు. సాధన ఒక్కటే!
దృఢమైన సాధన చేయనిదే భగవంతుడు కరిగిరాడు. కదిలిరాడు. భక్తికి, ప్రేమకు పుస్తక పరిజ్ఞానం పెద్దగా అవసరం లేదు. కన్నప్ప, శబరి, రత్నాకరుడు (వాల్మీకి) ఏ పుస్తకాన్నీ చదవలేదు. ఏ యాత్రలూ చేయలేదు. పరమాత్మ మీద వారు గుండెల నిండా పరమ ప్రేమ నింపుకొన్నారు. పెద్దలు చెప్పిన అంశాన్ని సాధన చేశారు. గుండె అనే బండపై భక్తి అనే గంధపు చెక్కను అరగదీశారు. రాయే అరిగిందో, చెక్కే కరిగిందో వారికి తెలియదు. గంధం మాత్రం పడింది. అది ప్రేమ సుగంధం!
సాధన మీద మనకు శంకలు కలుగుతుంటాయి. సాకేత రాముడి ఉనికి మీద కూడా! మన అమాయక ప్రశ్నలకు నవ్వుకుంటూ విజ్ఞులు బదులు చెబుతారు. ‘విచికిత్స వద్దు. సాధన చేయండి... సహనంతో. అప్పుడు మీరు ప్రశ్నలే అడగని స్థాయికి వెళతారు. ప్రశ్నల అవసరమే లేని స్థాయికి...’ అని.
మనకు పని కంటే ఫలశ్రుతి మీద ఆసక్తి ఎక్కువ. ఫలశ్రుతిని బట్టి పనులు చేసే వైఖరికి స్వస్తి చెబితే తప్ప, నిజాయతీగా పనులు చేయలేం. ‘ఫలశ్రుతి’ ఆలోచన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కార్యసాధనలో నిజాయతీ లోపిస్తుంది. మనకు భగవంతుడు కావాలి. చాలు- ఇక సాధన మొదలుపెట్టాలి. అంతే. అసలు భగవంతుడున్నాడా, ఉంటే గింటే సాధన ఎలా చేయాలి, సగటున ఎన్ని రోజుల్లో ఫలిస్తుంది? అసలు ఫలిస్తుందా, భరోసా ఎవరు? విఫలమైతే మరో పనికి- మరే పనికి మనం అర్హులం కాగలం, అసలు కాగలమా? సాధనే ప్రారంభం కాలేదు. అసలు దేవుడున్నాడో లేడో నిర్ధారించుకోలేదు. అప్పుడే... విరమణ ఆలోచన! ఆ తరవాతి మన పరిస్థితి ఏమిటనే ఆలోచన! సాధన చేసేది ఇలాగా, భగవంతుణ్ని పొందే పద్ధతి ఇదా?
మన ఆలోచనా విధానం ఏదైనా; అనుమానాలు, అర్థం లేని అంచనాలు ఏవైనా మనమంటూ సాధనకు ఉద్యుక్తులం కావడం ప్రధానం. నీళ్లంటే ఎవరికైనా భయమే. అది నీళ్లలోకి దిగేవరకే! ఒకసారి ధైర్యం చేసి దిగితే- నీళ్లలోని ఆ సుఖం, సరదా అర్థమవుతాయి. భగవంతుడూ అంతే. ఆయనకోసం సాధన చేయడమూ అంతే. ఏదైనా ప్రారంభం కాకముందు, ఏ మాత్రం అనుభవం పొందక ముందు, ఆ అంశపు అసలు తత్వం ఎవరికీ అర్థం కాదు. భక్తిని, భగవంతుణ్ని అనుభవానికి తెచ్చుకుందాం. ఆ మకరందపు మాధుర్యాన్ని ఒకే ఒక్క బిందువైనా ఆస్వాదిద్దాం!
సాధన చేద్దాం. సత్‌ గ్రంథ పఠనం చేయవచ్చు. (స్వాధ్యాయమూ భక్తిమార్గాల్లో ఒకటి). అది ఎంతవరకు? మన సాధనకు ఉపయోగపడేంత వరకు. తీర్థయాత్రలు చేయవచ్చు. అదీ ఎంతవరకు? మన లోపలి అలజడులు అంతరించి, మనసు ఎంతో కొంత శాంతించేవరకు. ఇలాంటివి ఎన్నో. అవన్నీ సాధనలు కావనీ చెప్పలేం. గమ్యాన్ని చేరే సమయం తక్కువగా ఉన్నప్పుడు, వేగానికే మనం ప్రాధాన్యమివ్వాలి.
జీవితంలో మనం ఎన్నో పనులు చేశాం... మళ్లీ చేశాం. మళ్లీ మళ్లీ చేశాం. ఇంకెంత కాలం? ఇక చాలు. కొత్త పని చేద్దాం. చేయాల్సిన పని చేద్దాం. మానకూడని, చేసి తీరాల్సిన పని చేద్దాం. అదే... భగవత్‌ సాధన! ఆ సాధనలో ఆడంబరాలు వద్దు. అతి ప్రదర్శనలు వద్దు. హుందా అయిన, గంభీరమైన, మౌన ప్రధానమైన అసలు సిసలు సాధనే మన లక్ష్యం!
- చక్కిలం విజయలక్ష్మి
‘ధన మూల మిదం జగత్‌’ అని నానుడి. డబ్బు అనే ఇరుసు మీదనే ప్రపంచం పరిభ్రమిస్తుంటుందని దాని అంతరార్థం. అందరికీ డబ్బుపై వ్యామోహం ఉంటుంది. దాన్ని ఎలా సంపాదించాలన్నదే కొండంత సమస్యగా కనిపిస్తుంది. అందుకు మన పెద్దలు కొన్ని నివారణోపాయాలు సూచించారు.

ప్రధాన ఉపాయాలు మూడు. ఇల్లు, ఇల్లాలు లక్ష్మీకి ప్రతిరూపాలుగా ఉండేలా చూసుకోవడం మొదటిది. మనలోనే ఉన్న లక్ష్మీ తత్వాన్ని గుర్తించి, అనుగ్రహం కోసం ప్రయత్నించడం రెండోది. ‘అలక్ష్మి’ని సాగనంపటం ఎలాగో తెలుసుకోవడం మూడో ఉపాయం.

‘దేహమే దేవాలయం’ అంటుంది హంస గీత. దేహానికి గృహమే ఆలయం. అలా ఇంటిని తీర్చిదిద్దుకోవడం వల్ల అక్కడ లక్ష్మీ కళ తాండవిస్తుంది. పర్ణశాల వంటి పూరింటినైనా పరిశుభ్రం చేస్తే, అది పవిత్రత సంతరించుకుంటుంది.

దేహాన్ని ఆలయంగా భావించిన మనిషి, అంతర్యామి నివాసానికి తగినట్లుగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి. దేవాలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే అంతా శుభ్రపరుస్తారు. స్వామి పూజకు సర్వం సిద్ధం చేస్తారు. అలాగే శరీరధారి అయిన మనిషి ఉదయాన్నే నిద్ర లేచి ‘బుద్ధి’ అనే సేవకుడి సాయంతో దేహాలయాన్ని సిద్ధం చేసుకోవాలి. దైవశక్తులు బ్రహ్మ ముహూర్తంలో జాగృతమవుతాయంటారు. అందువల్ల ఆ సమయంలోనే దైవకార్యాల్ని ప్రారంభిస్తారు.

గృహస్థుడికి అర్ధాంగి సాహచర్యం, సహకారం వరాల వంటివి. గృహాన్ని లక్ష్మీనివాసంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర గృహిణిదే. ముందుగా ఆమె లక్ష్మీ రూపిణిగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది. భారతీయ సంప్రదాయంలో మహిళలు వేకువజామునే నిద్ర లేచి, గృహాన్ని శుభ్రం చేసుకోవడంతో దినచర్య ప్రారంభిస్తారు. స్నానాదికాల అనంతరం పరిశుభ్రమైన వస్త్రధారణతో తులసికి పూజ చేస్తారు. ఆ క్షణంలోనే గృహిణిలో లక్ష్మీ కళ ప్రవేశిస్తుంది. గృహలక్ష్మిగా వెలుగొందుతుంది.

ఆత్మవిశ్వాసం, కృషి, లక్ష్యసాధన పట్ల పట్టుదల వంటి గుణాలన్నీ లక్ష్మీ తత్వాన్ని తెలియజేస్తాయి. తనలోనే, తనతోనే ఉన్న లక్ష్మీ తత్వాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్లు ఇతర పద్ధతుల కోసం వెతుకులాడుతుంటారు. మానసిక దౌర్బల్యంతో బాధపడుతుంటారు. అలాంటి దారిద్య్రాన్నే ‘అలక్ష్మి’ అంటారు.

మనిషి తనలోని అలక్ష్మి లక్షణాల్ని బయటకు నెట్టివేయాలి. అతి నిద్ర, నిర్లక్ష్యం, సోమరితనం, అనాచార ప్రవర్తన- అన్నీ అలక్ష్మి లక్షణాలే! అవన్నీ నిష్క్రమించగానే, లక్ష్మీదేవి అతడి గృహంలోకి ప్రవేశిస్తుందన్నది పెద్దల మాట.

విద్యార్థులు పట్టుదలగా కృషి చేస్తే, చూస్తుండగానే సాధారణ స్థాయి నుంచి ఉత్తమ స్థితికి వెళతారు. ఉద్యోగులు సంస్థను తమదిగానే భావించి అంకితభావంతో పనిచేస్తే, సంస్థతో పాటు వారూ ఎదుగుతారు. సాధకులు చంచలత్వానికి స్వస్తి పలికి ‘అంతర్యామి’ మీదనే దృష్టిపెట్టాలి. ఇల్లాలు తన ఇంటినే దేవాలయంగా భావించి విధులు నిర్వర్తించాలి. ఇవన్నీ ఆశించిన ఉత్తమ ఫలితాల్ని తప్పక ఇస్తాయి.

ఇంట్లో ఉన్నవారందరూ గృహాలయాన్ని తీర్చిదిద్దాలి. సమాన బాధ్యతతో వ్యవహరించాలి. అప్పుడే అక్కడ ఆలయ పవిత్రత నెలకొంటుంది. పరిశుభ్రతే మనసు లక్షణం కావాలి. అప్పుడు ఏ పని చేసినా పద్ధతిగా ఉంటుంది. ఎక్కడ ఏ మాత్రం తేడా కనిపించినా, తక్షణమే సరిదిద్దడం సాధ్యపడుతుంది. అప్పుడే... ఆ క్షణం నుంచే... ఆ ఇంట్లో గృహలక్ష్మి వెలుగులు వెన్నెల కాంతిరేఖల్లా అంతటా విస్తరిస్తాయి!
మార్కండేయుడు మృకండ మహర్షి, మరుద్వతి దంపతుల కుమారుడు. ఈశ్వర అనుగ్రహంతో కలిగిన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటారు వాళ్లు. అయితే బాలకుడు 16 ఏళ్లు మాత్రమే జీవించి ఉంటాడని చెబుతాడు పరమేశ్వరుడు. అతనికి పదహారేళ్లు వచ్చాక తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖిస్తారు. వారి చింతకు కారణం తెలుసుకున్న మార్కండేయుడు పరమేశ్వరుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి వచ్చిన యముడు సైతం ఆతడి తపోదీక్షకు నివ్వెరపోతాడు. బాలకుడిపై పాశం వేయగా.. పరమేశ్వరుడు కాలరూపుడుగా ప్రత్యక్షమవుతాడు. మార్కండేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు

ప్రతి మాసం కృష్ణ పక్షంలో చతుర్దశి పరివ్యాప్తమై ఉన్న రోజును శివరాత్రిగా భావిస్తారు. మాఘమాస కృష్ణ చతుర్దశినిమహాశివరాత్రిగా జరుపుకుంటారు. రోజునే మహాలింగం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. మాఘ మాసాన్ని సంవత్సర సారం అంటారు. అందుకే మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రిగా నిర్ణయించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాశివరాత్రి వ్రతం ఆచరిస్తే.. సంవత్సరంలోని అన్ని మాస శివరాత్రులూ వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు.

శివరాత్రి వ్రతం గురించి శివ పురాణం, స్కంద పురాణాల్లో విస్తృతంగా ప్రస్తావించారు. శివరాత్రి వ్రతం అంటే ముఖ్యంగా ఉపవాసం ఆచరించాలి. జాగరణ చేయాలి. వ్రతం చేయాలనుకునే వారు మహాశివరాత్రి నాడు నిద్ర లేవడంతోనే.. ఉపవాస దీక్ష చేపడుతున్నట్టుగా సంకల్పించుకోవాలి. ప్రాతఃకాలంలోనే చన్నీటితో తలస్నానం చేయాలి. వీలైతే నదీ స్నానం లేదా తటాక స్నానం ఆచరించాలి. లేనిపక్షంలో ఇంట్లో చేయాలి. స్నానం చేసే సమయంలో ‘‘శ్రీ శివాయ నమస్తుభ్యం మహాదేవాయతే నమః’’ అనే మంత్రాన్ని పఠించాలి. అనంతరం నిత్యపూజలు చేసుకుని, పరమేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించాలి. ప్రాతఃకాలం, మధ్యాహ్నం, ప్రదోష సమయం (సాయం సంధ్యా సమయం), లింగోద్భవ కాలం (అర్ధరాత్రి) మహాలింగానికి అభిషేకం నిర్వహించాలి.

ఉపవాసం అంటే ఆహారం తీసుకోకపోవడం. అయితే శారీరక స్థితులను అనుసరించి ఉపవాసం పట్టాలి. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు, రోగగ్రస్థులు ఉపవాస దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదు. శారీరక పటుత్వం ఉన్నవారు కఠిన ఉపవాసం చేయవచ్చు. అయితే అవసరానుగుణంగా పాలు సేవిస్తూ ఉపవాసం ఉండవచ్చునని శాస్త్రం చెబుతోంది. ఉపవాస దీక్షలోని భౌతికమైన అర్థం అన్నపానీయాలకు దూరంగా ఉండటం. ప్రదోష సమయంలో లింగార్చన తర్వాత ఉపవాస దీక్ష పరిసమాప్తం అవుతుంది. తర్వాత కూడా పళ్లు, పానీయాలు మాత్రమే స్వీకరిస్తారు తప్ప అన్నం జోలికి వెళ్లరు.

ఆధ్యాత్మికంగా చూస్తేఉపఅంటే దగ్గరగా.. ‘వాసంఅంటే ఉండటం అని అర్థం. దైవానికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం. మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో మనం వేటి గురించి ఆలోచిస్తామో.. అదంతా ఆహారమే. వీటిని వదిలిపెట్టి పరమాత్ముని గురించి ఆలోచించడమే నిజమైన ఉపవాసం. అప్పుడే దీక్ష పరిపూర్ణం అవుతుంది. ఆధ్యాత్మికంగా అంతర్ముఖత్వ సాధనకు ఉపవాసం ఒక మార్గం.శివరాత్రి నాడు ఉపవాసానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. జాగరణకు అంత విశిష్టత ఉంది. రాత్రి అనే శబ్దానికి యోగ భాషలో స్పృహ లేకుండా ఉండటం అని అర్థం ఉన్నది. భౌతిక విషయాలపై స్పృహ లేకుండా.. చిత్తం శివుడికి అర్పించి జాగృతంగా ఉండటమే జాగరణ. ధ్యానానికి శివరాత్రి అనుకూలమైన సమయం. అందుకే సిద్ధులు శివరాత్రి పర్వదినాన గంటల తరబడి తపోదీక్షలో ఉండిపోతారు.


ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఇది సాధ్యం కానప్పుడు సంకీర్తనం చేయవచ్చు. శివుడి లీలలు భజనగా, కీర్తనగా ఆలపిస్తూ జాగరణ కొనసాగించాలి. సంకీర్తనం వల్ల వాక్కు పరిశుద్ధమవుతుంది. ఇదీ సాధ్యం కాకపోతే స్మరణ చాలు. జంగమదేవుడి కథలు వినడం, కైలాసనాథుడి చరిత్రను నలుగురితో పంచుకోవడం, మహేశ్వర వైభవాన్ని చాటే పురాణాలు చదవడం వంటివి చేయాలి. సూర్యోదయం అయ్యే వరకు భగవంతుని సన్నిధిలో జాగారం చేయడం వల్ల శివరాత్రి వ్రతం పూర్తవుతుంది. అనంతరం స్నానాధికాలు పూర్తి చేసుకుని, నిత్య పూజ చేయాలి. తర్వాత స్వామివారికి అన్నం నైవేద్యంగా సమర్పించి భోజనాలు చేసుకోవాలి. శారీరక, మానసిక పరిశుభ్రతను పాటిస్తూ.. శివరాత్రి వ్రతాన్ని ఆచరించేవారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.


శ్రీకాళహస్తిలో శ్రీ అనగా సాలీడు, కాళము అనగా సర్పం, హస్తి అంటే ఏనుగు. మూడు అక్కడి వాయులింగేశ్వరుడ్ని నిష్టగా కొలుస్తుంటాయి. సాలీడు స్వామికి గూడు కట్టి తన భక్తిని చాటుకుంటుంది. ఏనుగు నిత్యం జలాలను తన తొండంతో తీసుకువచ్చి స్వామిని అభిషేకిస్తుంటుంది. సర్పం మణులతో స్వామిని పూజిస్తుంటుంది. అయితే వీటి మధ్య పరస్పర వైరం కలుగుతుంది. తన భక్తి గొప్పదంటే తన భక్తే గొప్పదని కలహించుకుని ప్రాణాలు విడుస్తాయి.