గృహ లక్ష్మి

‘ధన మూల మిదం జగత్‌’ అని నానుడి. డబ్బు అనే ఇరుసు మీదనే ప్రపంచం పరిభ్రమిస్తుంటుందని దాని అంతరార్థం. అందరికీ డబ్బుపై వ్యామోహం ఉంటుంది. దాన్ని ఎలా సంపాదించాలన్నదే కొండంత సమస్యగా కనిపిస్తుంది. అందుకు మన పెద్దలు కొన్ని నివారణోపాయాలు సూచించారు.

ప్రధాన ఉపాయాలు మూడు. ఇల్లు, ఇల్లాలు లక్ష్మీకి ప్రతిరూపాలుగా ఉండేలా చూసుకోవడం మొదటిది. మనలోనే ఉన్న లక్ష్మీ తత్వాన్ని గుర్తించి, అనుగ్రహం కోసం ప్రయత్నించడం రెండోది. ‘అలక్ష్మి’ని సాగనంపటం ఎలాగో తెలుసుకోవడం మూడో ఉపాయం.

‘దేహమే దేవాలయం’ అంటుంది హంస గీత. దేహానికి గృహమే ఆలయం. అలా ఇంటిని తీర్చిదిద్దుకోవడం వల్ల అక్కడ లక్ష్మీ కళ తాండవిస్తుంది. పర్ణశాల వంటి పూరింటినైనా పరిశుభ్రం చేస్తే, అది పవిత్రత సంతరించుకుంటుంది.

దేహాన్ని ఆలయంగా భావించిన మనిషి, అంతర్యామి నివాసానికి తగినట్లుగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి. దేవాలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే అంతా శుభ్రపరుస్తారు. స్వామి పూజకు సర్వం సిద్ధం చేస్తారు. అలాగే శరీరధారి అయిన మనిషి ఉదయాన్నే నిద్ర లేచి ‘బుద్ధి’ అనే సేవకుడి సాయంతో దేహాలయాన్ని సిద్ధం చేసుకోవాలి. దైవశక్తులు బ్రహ్మ ముహూర్తంలో జాగృతమవుతాయంటారు. అందువల్ల ఆ సమయంలోనే దైవకార్యాల్ని ప్రారంభిస్తారు.

గృహస్థుడికి అర్ధాంగి సాహచర్యం, సహకారం వరాల వంటివి. గృహాన్ని లక్ష్మీనివాసంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర గృహిణిదే. ముందుగా ఆమె లక్ష్మీ రూపిణిగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది. భారతీయ సంప్రదాయంలో మహిళలు వేకువజామునే నిద్ర లేచి, గృహాన్ని శుభ్రం చేసుకోవడంతో దినచర్య ప్రారంభిస్తారు. స్నానాదికాల అనంతరం పరిశుభ్రమైన వస్త్రధారణతో తులసికి పూజ చేస్తారు. ఆ క్షణంలోనే గృహిణిలో లక్ష్మీ కళ ప్రవేశిస్తుంది. గృహలక్ష్మిగా వెలుగొందుతుంది.

ఆత్మవిశ్వాసం, కృషి, లక్ష్యసాధన పట్ల పట్టుదల వంటి గుణాలన్నీ లక్ష్మీ తత్వాన్ని తెలియజేస్తాయి. తనలోనే, తనతోనే ఉన్న లక్ష్మీ తత్వాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్లు ఇతర పద్ధతుల కోసం వెతుకులాడుతుంటారు. మానసిక దౌర్బల్యంతో బాధపడుతుంటారు. అలాంటి దారిద్య్రాన్నే ‘అలక్ష్మి’ అంటారు.

మనిషి తనలోని అలక్ష్మి లక్షణాల్ని బయటకు నెట్టివేయాలి. అతి నిద్ర, నిర్లక్ష్యం, సోమరితనం, అనాచార ప్రవర్తన- అన్నీ అలక్ష్మి లక్షణాలే! అవన్నీ నిష్క్రమించగానే, లక్ష్మీదేవి అతడి గృహంలోకి ప్రవేశిస్తుందన్నది పెద్దల మాట.

విద్యార్థులు పట్టుదలగా కృషి చేస్తే, చూస్తుండగానే సాధారణ స్థాయి నుంచి ఉత్తమ స్థితికి వెళతారు. ఉద్యోగులు సంస్థను తమదిగానే భావించి అంకితభావంతో పనిచేస్తే, సంస్థతో పాటు వారూ ఎదుగుతారు. సాధకులు చంచలత్వానికి స్వస్తి పలికి ‘అంతర్యామి’ మీదనే దృష్టిపెట్టాలి. ఇల్లాలు తన ఇంటినే దేవాలయంగా భావించి విధులు నిర్వర్తించాలి. ఇవన్నీ ఆశించిన ఉత్తమ ఫలితాల్ని తప్పక ఇస్తాయి.

ఇంట్లో ఉన్నవారందరూ గృహాలయాన్ని తీర్చిదిద్దాలి. సమాన బాధ్యతతో వ్యవహరించాలి. అప్పుడే అక్కడ ఆలయ పవిత్రత నెలకొంటుంది. పరిశుభ్రతే మనసు లక్షణం కావాలి. అప్పుడు ఏ పని చేసినా పద్ధతిగా ఉంటుంది. ఎక్కడ ఏ మాత్రం తేడా కనిపించినా, తక్షణమే సరిదిద్దడం సాధ్యపడుతుంది. అప్పుడే... ఆ క్షణం నుంచే... ఆ ఇంట్లో గృహలక్ష్మి వెలుగులు వెన్నెల కాంతిరేఖల్లా అంతటా విస్తరిస్తాయి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)