అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

గణపతి ప్రార్ధన

శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
 
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మయే !!

అయ్యప్ప స్వామి వారి ప్రార్ధన
అఖిల భువన దీపం భక్త చిత్తాజ్జ సూర్యం
సుర గణ ముని సేవ్యం తత్త్వ మస్యాది లక్ష్యం !
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం

శబరి గిరి నివాసం భావయే భూత నాదమ్ !!

|| అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష ||
మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది. 

"జీవానాం నరజన్మ దుర్లభం" - సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు గనుక, ఋషి అంతటి వాడవ్వల్సిన మనిషి మసై, బూడిదై పోకూడదని, ఈ జన్మలోనే ముక్తిని పొంది "మానవుడు తన జన్మను చరితార్థం చేసుకోవాలనే" ఉద్దేశంతో 41 రోజులు దీక్షను ఆచరించి, ఆ దీక్షలో పొందిన ఆధ్యాత్మిక ఆనంద, అనుభవాలను మానవుడు తన జీవితకాలమంతా పొంది తద్వారా మోక్షాన్ని పొంది తరించాలన్నదే భగవంతుని ఆంతర్యం. 

ఈ దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యాన్ని, శీతలోదకస్నానం(చన్నీటి స్నానం), భూతలశయనం, ఏకభుక్తం, స్వయంపాకం వంటి పలు నియమాలు పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహం కోసం 41 రోజులు దీక్ష తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో మనిషిని శారీరకంగా, మానసికంగా, దృఢంగా, క్రమశిక్షణలో ఉండేందుకు ఈ అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలిక పరిచే ఆరోగ్య నిధానం అయ్యప్ప దీక్షా విధానం. 

భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు నియమనిష్ఠలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విబూది గంధం బొట్టు ధరిస్తారు. దినచర్యలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలను ఆచరిస్తారు.
 

కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ, సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను, భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత.

అయ్యప్ప నియమావళి
1. మాల ధరించుట
2. దీక్షలో పాటించవలసిన నియమాలు
3. పూజా విధానము
4. ఇరుముడి & శబరిమల యాత్ర
5. దీక్షా విరమణ

అయ్యప్ప దీక్ష తీసుకోదలచినవారు ముందుగా "గురుస్వాముల" ద్వారా ముద్రమాల ధారణ చేయించుకోవాలి. అలా సాధ్యం కాని పరిస్థితిలో, ఏ ఆలయ సన్నిధానంలోనైన తన తల్లి లేదా తండ్రి ద్వార మాలను ధరించాలి. మాల ధరించిన తరువాతనే దీక్ష మొదలుపెట్టాలి. దీక్షను 41 రోజుల పాటు ఆచరించిన తరువాతనే శబరిమల యాత్ర ప్రారంభించాలి.

మాల ధరించుటకు సామాగ్రి:
నల్లరంగు బట్టలు - లుంగీలు, చొక్కాలు & తువ్వాళ్లు, దుప్పటి రెండురెండు చొప్పున తీసుకోవాలి. దీక్షాకాలం 41 రోజులు ఈ వస్త్రాలనే వినియోగించాలి.

తులసిమాల, రుద్రాక్షమాల, గంధంమాల, తామరగింజలమాల, స్ఫటికముల మాల. వీటిలో మీకు నచ్చిన రెండు మాలలు మరియు అయ్యప్పస్వామి ముద్ర (డాలరు) తీసుకోవాలి.

ఒక కొబ్బరికాయ, 6 అరటిపండ్లు, 100గ్రాముల నువ్వులనూనె, అగరువత్తులు, ఒక గంధపు పొడి డబ్బా, వీభూతి పొడి, కుంకుమ, కొన్ని పువ్వులు, కొద్దిగా జీడిపప్పు, కిస్‌మిస్, పంచదార, కర్పూరం తీసుకొవాలి.

పైన చెప్పిన సామాన్లు తీసుకొని గురుస్వాముల వద్దకు వెళ్ళి "దీక్షామాల'' వేయవలసినదిగా ప్రార్ధించగా వారు తెల్లవారుజామున మీరు శిరస్నానం చేసిన తర్వాత, మీరు తెచ్చిన సామాగ్రితో అయ్యప్పస్వామికి పూజచేసి, ముద్రమాలను మీ మెడలో వేసి దీక్షను ప్రారంభిస్తారు.
మనసా, వాచ మరియు కర్మనా (మనసులో, మాటలో, పనిలో) స్వామి మీదే పూర్తి భక్తికలిగివుండాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువ కూడదు. నిత్యం భజన,పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతీరొజూ దేవాలయానికి వెళ్ళి అయ్యప్పను దర్శించుకోవాలి.

2. దీక్షలో పాటించవలసిన నియమాలు
చేయవలసిన పనులు:-
v ఇంటిలొ ఒక వేరు గదిలొ అయ్యప్ప పఠం పెట్టుకొవడం (ఉత్తమం).
v ప్రతీరోజు సూర్యోదయమునకు ముందుగామేల్కొని కాలకృత్యములు తీర్చుకుని, ఉదయ, మధ్యాహ్న, సంధ్యలలో చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు(శరణు ఘోష) పఠించి, కర్పూర హారతి, సాష్టాంగ నమస్కారాలు ఇచ్చిన తరువాతనే మంచి నీరైనను త్రాగాలి.
v ప్రతిరోజూ దీపం వెలిగించి మూడు పూటలూ శరణు ఘోష చేయవలెను. ఉదయం, సాయంత్రం ఏదొ ఒక దేవాలయమును దర్శించవలెను.
v అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.
v మెడలోధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోను తీయరాదు
v పగలు సాత్వికాహారము, రాత్రులందు అల్పాహారము సేవించవలెను.
v బ్రహ్మచర్యం - భక్తులు ఈ నియమాన్ని శబరిమలలో స్వామి దర్శనం మరియు అభిషేకం అయ్యి గృహం చేరేవరకూపాటించాలి.
v ఇతరులతో మట్లాడేటప్పుడు ముందుగా "స్వామియే శరణం" అని పలకరించాలి. ఇది ప్రధాన తారక మంత్రం.
v పురుషులను "స్వామి లేదా అయ్యప్ప" అని, బాలురులని "మణికంఠ" అని, స్త్రీలను "మాత" అని, బాలికలను "మాలికాపురం" అని పిలవాలి. ముఖ్యంగా ముస్లింలను "వావర్ స్వామి" అని పిలవాలి.
v అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగ ఉండాలి. ఇదే"పదునెట్టాంబడి".
v అసభ్యకర సంభాషణ, కోపం అసలు పనికిరావు. దీక్షా కాలంలో ఎప్పుడూ నిజం మాట్లాడాలి మరియు తక్కువగా మాట్లాడాలి. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు నిగ్రహులై "స్వామియే శరణం" అని పలకాలి.
v అయ్యప్పలు శవమును, బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చుసినయెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.
v మీ జీవనవిధానం ఏదైన కావచ్చు, ఏ పనైనా కావచ్చు, అయ్యప్పస్వామిని పూర్తి భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో సరైన పద్ధతిలో పూజించాలి.
v ఈ సకల చరాచర ప్రాణకోటి భగవంతుడి సృష్టియే కనుక జీవులన్నిటిని సమభావనతో చూడాలి.
v దీక్షా కాలంలో సాధ్యమైనంతవరకు పూజలలో మరియు భజనలలో పాల్గొనాలి. స్వామి శరణుఘోషప్రియుడు కాబట్టి ఎంత శరణుఘోషజరిపితే స్వామికి అంత ప్రీతి.
v మీకు సాధ్యమైనంతవరకు నిరుపేదలకు అన్నదానం చేయండి. అయ్యప్పలు ఎవరైన మిమ్మల్ని భిక్షకు(భోజనమునకు) పిలిస్తే తిరస్కరించకండి.
v అయ్యప్ప దీక్షలో ఇంకొ ముఖ్యమైన సూత్రం - అన్ని మతాలవారిని కులాలవారిని సమానంగా చూడాలి. స్త్రీలు స్వామి వారి పూజలలో మరియు భజనలలో పాల్గొనవచ్చు కాని 10 సంవత్సరాల లోపు రజస్వల కాని బాలికలు మరియు ఋతువిరతి చేరుకున్న స్త్రీలు మాత్రమే స్వామి దీక్షను ఆచరించి యాత్ర చేయవచ్చును.
v దీక్షా కాలంలో భక్తులు నలుపు లేద నీలం లేద కుంకుమ రంగు దుస్తులు ధరించాలి.
v దీక్షా కాలంలో భక్తులు నేలపైన తలగడ (దిండు) లేకుండా నిద్రించాలి. పాదరక్షలు (చెప్పులు) ధరించకూడదు. నేల మీద కొత్త చాప పరచుకొని పడుకోవటం ఉత్తమము.

చేయకూడని పనులు:-
v వెల్లుల్లి, నీరుల్లి, మద్యపానం, మాంసాహారం, తాంబూలం, పొగాకు, ధూమపానాలను స్వీకరించడం.
v బహిష్ఠులైన స్త్రీలను చూడడం, వారితో మాట్లాడడం చేయకూడదు. స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకొవటం.
v గడ్డము గీసుకొనుట, క్షవరంచేయించుకొనుట, గొళ్ళు కత్తిరించుట పనులు.
v దాంపత్యజీవితము, మనోవాక్కాయకర్మములను తలచటం.
v మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించుటం.
v దీక్షలేని ఇతరులకు పాదాభివందనము చేయటం.
v సినిమాలు చూడటం. టీవిలొ దీక్షను మళ్ళించు కార్యక్రమములు చూడటం.

3. పూజా విధానము
దీక్ష మొదటిరోజున అరటి ఆకుపై బియ్యం పోసి దాని మీద శ్రీ అయ్యప్ప పటమును ఉంచవలెను. 4 తమలపాకులు, రెండు వక్కలు, ఒక నిమ్మకాయ 41 రోజులు స్వామి పటము ముందు ఉంచవలెను. ప్రతి రోజు పూల మాల, దీపస్తంభములు, సాంబ్రాణి లేక అగరువత్తి, కలశపాత్ర, కుంకుమ, విబూది, గంధం, అక్షతలు, విడిపూలు, మంచినూనె, పంచపాత్ర, ఉద్ధరిణి, కొబ్బరికాయ తదితర సామాగ్రిని పూజకు సిద్ధముగా ఉంచుకొనవలెను. ముందుగా గణపతి ప్రార్థన చేసి, అటు పిమ్మట అయ్యప్ప ప్రార్థన, శ్లోకాలు, శరణు ఘోష చదువుకుని, నైవేద్యం పెట్టి, హారతినిచ్చి, ఆ హారతిని మెడలో ఉన్న మాలకు చూపి, మనం తెలిసీ తెలియక చేసిన తప్పులకు అయ్యప్పను క్షమాపణ కోరి సాష్టాంగ నమస్కారం చేయవలెను. రాత్రి పూట మాత్రమే "హరివరాసనం" పాడాలి. ఇలా 41 రోజులు చేయవలెను. 

4. ఇరుముడి మరియు శబరిమల యాత్ర
ఇరుముడి అంటే రెండు ముడులనియు, ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసలపప్పు, అటుకులు, బొరుగులు, నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు. రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలురైక (జాకెట్) ముక్కలు పెడతారు. 

- "భక్తి", "శ్రద్ధ" అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగ ఉపయోగించే ద్రవములను పెడతారు. భక్తి, శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయొ అక్కడే ఓంకారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని ఓంకారమనే త్రాటితో బిగించి కడతారు. ముద్ర సంచిలో గురుస్వామిగారు మూడుసార్లు బియ్యము వేయటంవలన యాత్రాసమయములో మూడు విధములైన విఘ్నములు అనగా, ఆధిదైవిక విఘ్నము (మెరుపులు, వర్షము, వడగండ్లు వంటివి),ఆధిభౌతిక విఘ్నము (భూకంపములు, అగ్ని ప్రమాదములు, వరదలు వంటివి), ఆధ్యాత్మిక విఘ్నము (జడత్వము, భక్తిశ్రద్ధలు సన్నగిల్లుట, కామక్రోధాది అరిషడ్వర్గములు చుట్టుముట్టుట) లను అతిక్రమించవచ్చునని భక్తుల నమ్మకము.
 

శబరిమల యాత్ర పూర్తయిన పిమ్మట తిరిగి ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. తరువాత ఒక మంచి రోజు చూసుకుని గుడికి వెళ్ళి గురుస్వామి చేతుల మీదుగ దీక్ష విరమణ చేయాలి. తీసివేసిన మాలను భధ్రంగా పదిల పరచుకోండి. మళ్ళీ అదే మాలను, మరళ దీక్షా కాలమందు ఉపయోగించవచ్చును.

!!! ఓం శ్రీ హరి హర సుతన్, ఆనందచిత్తన్, అయ్యన్, అయ్యప్పస్వామియే శరణమయ్యప్ప !!!


అయ్యప్ప భజనలను ఇక్కడ దిగుమతి చేసుకోండి 

Gearbest Tri-spinner ABS Hand Spinner Stress Relievers Toy  -  RED  RED
Gearbest LED Cute Elephant Night Lights  -  COLORFUL

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)