శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!

భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మన అవగాహన ఎక్కువగా రూపానికి పరిమితమైంది కాబట్టి మన సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఈశివత్వానికి ఎన్నో అద్భుతమైన స్వరూపాలను సృష్టించుకున్నాం. నిగూఢమూ, అగోచరమూ అయిన ఈశ్వరునిగా, మంగళకరుడైన శంభునిగా, లౌక్యం తెలియని భోళా శంకరునిగాసకల వేదాలూ, శాస్త్రాలూ, తంత్రాలూ బోధించిన గొప్ప గురువు దక్షిణామూర్తిగా, ఎవరినైనా ఇట్టే క్షమించేసే అశుతోషునిగా, ఆసృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలుముకున్న కాలభైరవునిగా’, ప్రశాంతతకు ప్రతిరూపమైన అచలేశ్వరునిగాబ్రహ్మాండ నృత్యకారుడైన నటరాజుగా ఇలా జీవితానికి ఎన్నెన్ని పార్శ్వాలుండగలవో అవన్నీ కూడా ఆయనకి ఆపాదించబడ్డాయి. వీటిలో ప్రతీ ఒక్కటీ మనిషి అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. ఈ రూపాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం. 

మనం శివుడ్ని ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా చూస్తాము. అదే సమయంలో ఆయనను ప్రాపంచిక లౌక్యం తెలియని వానిగా కూడా అనుకుంటాము. అందుకే శివుడి రూపాల్లో ఒకదాన్ని భోళా శంకరుడు అంటారు. భోళా శంకరుడు అంటే అమాయకుడు అని అర్థం లేదా లౌక్యం తెలియని సీదాసాదా మనిషని అర్థం. ఎంతో మేధావులు కూడా ప్రాపంచిక విషయాల్లో తేలికగా మోసపోవటం చూస్తుంటాము. ఎందుకంటే వారు తమ తెలివితేటలను లౌకికమైన వాటికి ఉపయోగించరు. నీచ స్థాయి తెలివితేటలు, కుటిలమైన యుక్తి- ఇవి ఈ ప్రపంచంలోని మహా మేధావులను కూడా మోసగించగలవు. డబ్బు విషయంలోనో, సామాజిక విషయాల్లోనో అలాంటి తెలివి తేటలుండటం గొప్పవిషయంగా చలామణీ కావచ్చు. కానీ, జీవితానికి సంబంధించినంత మటుకు వాటికేవిలువా ఉండదు. ఇక్కడ మేధస్సు అని మనం అన్నప్పుడు మనం కేవలం యుక్తి గురించి మాట్లాడటం లేదు. మనం జీవితాన్ని పూర్తి స్థాయిలో వికసింపచేసే పార్శ్వాన్ని గురించి మాట్లాడుతున్నాము. శివుడు కూడా ఇలాంటివాడే. ఆయన తెలివిలేనివాడని కాదు. కానీ లౌకికమైన వాటికి ఆయన తన మేధస్సును ఉపయోగించాలనుకోడు. అంతే! 


నటరాజు
శివుడి రూపాల్లో నాట్యానికి అధిపతిగా ఉన్న ఈ రూపం కూడా ఎంతో ముఖ్యమైంది. స్విట్జర్లాండ్‌లోని CERNలో ప్రపంచంలోనే ఉత్తమమైన ఫిజిక్స్‌ లాబరేటరీ ఉంది. అక్కడ అణువుల విచ్ఛేదనం చేస్తారు. నేను CERNకి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రవేశ ద్వారం దగ్గర నటరాజు విగ్రహం పెట్టి ఉండటం చూశాను. అక్కడ తాము చేసే పనికీ, పరిశోధనకీ ప్రతీకగా మానవ సంస్కృతిలో మరేదీ అంత దగ్గరగా లేదన్న విషయం వారికి అర్థం అయ్యింది. నటరాజు రూపం అపార నిశ్చలత్వం నుండి పుట్టినది. చిదంబర ఆలయంలోని నటరాజు విగ్రహం దీనికి ప్రతీక. చిదంబరం అని మనం పిలిచేది ఈ పరిపూర్ణ నిశ్చలతత్వాన్నే. మనిషిలో కూడా ఈ నిశ్చలత్వాన్ని తీసుకురావటానికే సంప్రదాయ కళలు దోహదం చేస్తాయి. నిశ్చలత్వం లేకుండా నిజమైన కళ ఆవిర్భవించదు! 

అర్ధనారీశ్వరుడు
సాధారణంగా శివుడ్ని పరమోన్నత పురుషుడిగా సూచిస్తారు కానీ అర్ధనారీశ్వర రూపంలో ఆయనలోని సగభాగం పూర్తిగా అభివృద్ధి చెందిన ఒక స్త్రీ రూపం ఉంటుంది. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే అంతర్గత పార్శ్వంలో స్త్రీత్వం-పురుషత్వం కలిస్తే ఒక శాశ్వతమైన పరమానంద స్థితిలో ఉంటారని. దీన్నేఇదే మీరు బాహ్యంగా చేయాలని ప్రయత్నం చేసినపుడు ఆ ఆనందం శాశ్వతమైనదిగా ఉండదు.

ఈ ప్రయత్నం వల్ల వచ్చే కష్టాలే మనం రోజువారీ చూసే అంతులేని నాటకాలకి కారణం. స్త్రీ పురుష తత్వాలంటే ఆడవారు, మగవారు అని కాదు. ఇవి కొన్ని లక్షణాలు. ముఖ్యంగా ఇది ఇద్దరు వ్యక్తులు కలవడం మాత్రమే కాదు. ఇది రెండు జీవిత పార్శ్వాలు కలవాలని తపించడం- అంతర్గతంగా, బాహ్యంగా కూడాను. అంతర్గతంగా మీరు దీన్ని సాధించగలిగితే బాహ్యంగా నూరు శాతం మీరు కావాలనుకున్నట్లే జరుగుతాయి. లేకపోతే బాహ్య పరిస్థితులు భయంకరమైన నిర్బంధాలవుతాయి.

మీరీ పరమోన్నత స్థితికి చేరుకున్నపుడు మీలో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు ఉంటుందని సూచనప్రాయంగా చెప్పడం. దీని అర్థం మీరు నపుంసకుడు అని కాదు- పరిపూర్ణమైన స్త్రీ, పరిపూర్ణమైన పురుషుడని అర్థం. ఈ స్థితిలో మీరు సంపూర్ణంగా వికసించిన మనిషి కాగలుగుతారు. 
 
కాలభైరవుడు
కాలభైరవుడు శివుని రౌద్ర రూపం. కాలాన్ని నాశనం చేయడం కోసం ఆయన చేరుకున్న స్థితి. భౌతిక వాస్తవాలన్నీ కాలంలోనే ఉంటాయి. భైరవ యాతనను సృష్టించటానికి తగినట్లుగా తయారయ్యి శివుడు కాలభైరవుడిగా మారాడు. యాతనఅంటే భరించలేని వేదన అని అర్థం. అంతిమ క్షణం వచ్చినపుడు ఎన్నో జన్మలలో అనుభవించవలసిన నొప్పి, బాధ ఒక్క క్షణంలోనే ఒకేసారి ఎంతో తీవ్రంగా జరిగిపోతాయి. ఆ తర్వాత ఇక గతం అనేది ఏదీ మిగిలి ఉండదు. మీ కర్మను (అంటే సాఫ్ట్‌వేర్‌ను) తొలగించటం అనేది నొప్పితో కూడుకున్నది. కాని ఇది మీ అంతిమ క్షణంలో జరుగుతుంది. దీనిలో మీ ఇష్టాయిష్టాలు ఏవీ ఉండవు. ఆయన దాన్ని వీలైనంత తక్కువ సమయంలో జరిగేలా చూస్తాడు. బాధ త్వరగా ముగిసిపోవాలి. అది తక్కువ సమయంలో పూర్తి కావాలంటే బాధని ఎంతో తీవ్రతరం చేయాల్సి వస్తుంది. ఆ బాధ అంతగా తీవ్రంగా లేకపోతే ఈ యాతన ఎప్పటికీ పూర్తికాదు. 

ఆదియోగి
ఆదియోగి అంటే మొట్టమొదటి యోగి. ఆదిగురువు అంటే మొట్టమొదటి గురువు. ఈయన నుంచే యోగశాస్త్రం పుట్టింది. దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమిని గురుపూర్ణిమ అంటారు. ఆ రోజు ఆదియోగి తన మొదటి ఏడుగురు శిష్యులైన సప్తఋషులకు ఈ శాస్త్రాన్ని నేర్పించటం మొదలుపెట్టాడు.

ఇది మతాలు పుట్టక పూర్వమే జరిగింది. మానవత్వం మళ్ళీ అతుక్కోలేని విధంగా విడగొట్టడానికి మనుషులు వేర్వేరు మార్గాలను సృష్టించకముందే, మానవ చైతన్యాన్ని పెంచటానికి అవసరమైన, శక్తివంతమైన సాధనాలను అర్థం చేసుకుని, నేర్పించటం జరిగింది. ఇది నమ్మశక్యం కానంత అద్భుతం! అంటే ఆ కాలం మనుషుల్లో ఇంతటి నాగరికత ఉందా! అని మీరనుకోవచ్చు. కానీ ఇది ఒక నాగరికత నుంచో, ఆలోచనా విధానం నుంచో వచ్చింది కాదు. ఇది ఆత్మ సాక్షాత్కారం నుండి ఉద్భవించిన ఓ సమర్పణ. ఇది స్వయానా ఆయన అభివ్యక్తీకరణే. ఆయన చెప్పిన దాంట్లో నేటికి కూడా మనం ఏ ఒక్కటీ మార్చలేం. ఎందుకంటే ఆయన చెప్పగలిగిన (చెప్పదగ్గ) విషయాలన్నీ కూడా ఎంతో అందంగా, తెలివైన విధంగా చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ మీరో జీవితకాలం గడిపేయొచ్చు! 


త్రయంబకుడు
శివుడికి మూడో కన్ను ఉంది కాబట్టి ఆయనను త్రయంబకుడు అని కూడా అంటారు. మూడో కన్ను అంటే నుదురులో ఒక చీలిక ఉంటుందని కాదు. ఆయన అవగాహనా స్థాయి అత్యుత్తమ సంభావ్యతకు చేరుకుందని అర్థం. మూడో కన్నంటే అవగాహనా దృష్టి. మనకు ఉన్న రెండు కళ్ళు కేవలం ఇంద్రియాలు మాత్రమే. మనం చూసేదంతా నిజం కాదు కదా. పైపెచ్చు ఆ కళ్ళు మెదడుకు అన్ని రకాల చెత్తను చేరవేస్తాయి. అందుకే మరొక కన్ను. అంటే గాఢమైన ఆ లోతుకు చేరుకోగలిగిన మూడో కన్ను అవసరం. ఎందుకంటే ఎంత ఆలోచించినా, ఎంత సిద్ధాంతీకరించినా మీ మెదడుకు ఒక్కొక్కసారి స్పష్టత రాదు. మీ తర్కంతో సృష్టించుకున్న స్పష్టతను ఎవరైనా పటాపంచలు చేయొచ్చు కూడా. మీ దృష్టి తెరుచుకున్నప్పుడే, అంటే మీకు అంతర్ దృష్టి కలిగినప్పుడు మాత్రమే పరిపూర్ణమైన స్పష్టత వస్తుంది. మనం శివుడి మూడో కన్నుగా చెప్పుకునేది ఈ పరమోన్నత స్పష్టతకు మార్గాన్ని సూచించేదే. 

సంక్లిష్ట లక్షణాల సమాహారం
సాధారణంగా ప్రపంచంలో దైవత్వంగా ప్రజలు భావించే వాటినన్నిటినీ మంచివిషయాలుగా సూచిస్తారు. కానీ శివపురాణంచదివితే మీరు శివుణ్ణి మంచివాడనీ అనలేరు, చెడ్డవాడనీ అనలేరు. సర్వస్వమూ ఆయనే; ఆయనే కురూపి, ఆయనే అత్యంత సుందరమూర్తీ, ఆయనే తాగుబోతు కూడా. దేవతలు రాక్షసులు మొదలు సమస్త జీవరాశులు ఆయన్ని కొలుస్తాయి. నాగరికతగా పిలవబడే సంస్కారం శివుణ్ణి గురించి మనం జీర్ణించుకోలేని ఈ కథలనన్నిటినీ తుడిచిపారేసింది. కానీ శివతత్వమంతా అక్కడే ఉంది. జీవితంలో ఒకదానికొకటి విరుద్ధమైన పార్శ్వాలన్నీ శివుని వ్యక్తిత్వంలో నెలకొల్పబడ్డాయి. శివఅనబడే ఈ వ్యక్తిలో వాటన్నిటినీ ఎందుకు సమ్మిళితం చేశారంటే ఈ ఒక్క మనిషిని మీరు పూర్తిగా అంగీకరించగలిగితే, మీరు ఈ జీవితాన్ని దాటేసినట్టే! అసలు జీవితంలో అందరికీ ఎప్పుడూ ఎదురయ్యే పెద్ద సమస్య... ఏది మంచి, ఏది చెడు, ఏది సుందరం, ఏది కాదు... అన్నది నిర్ణయించుకోవలసి రావడం. జీవితం ఎంత సంక్లిష్టంగా ఉండగలదో, అంత సంక్లిష్ట లక్షణాల సమాహారమైన ఈ ఒక్క వ్యక్తిని గనక మీరు మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే ఇక మరెవరితోనూ మీకు ఎటువంటి సమస్యా ఎదురవదు.

శివపురాణంలోని కథల్ని గనక మీరు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అందులో మీకు సాపేక్ష సిద్ధాంతం, పరిమాణ యాంత్రిక శాస్త్రం (Quantum mechanics) మాత్రమే కాదు ఆధునిక భౌతిక శాస్త్రమంతా... కథల రూపంలో ఎంతో అందంగా చెప్పారని గ్రహిస్తారు. కాలక్రమంలో ఎక్కడో ఆ కథల్లోంచి శాస్త్రం విస్మరించబడి కథలు మాత్రమే కొనసాగించబడ్డాయి. ఆ కథలు కూడా ఒక తరం నుంచి మరొక తరానికి హాస్యాస్పదంగా కనిపించేలా, అతిశయోక్తులతో చిలవలు-పలవలుగా అల్లబడ్డాయి. ఈ కథల్లోకి విజ్ఞానాన్ని తిరిగి జొప్పించగలిగితే, శాస్త్రాన్ని మళ్ళీ ఎంతో అందంగా చెప్పవచ్చు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)