ధ్యాన సాధన

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నారు పెద్దలు. ఈ లోకంలో ఏ పనైనా సాధన వల్లనే ఒనగూడుతుంది. అది ప్రాపంచికమైనా, పారమార్థికమైనా! ముఖ్యంగా సాధన అనేది పారమార్థికంగానే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. భగవంతుణ్ని పొందాలంటే చేయాల్సింది ఒకే ఒక్కటి- సాధన. దానికి కావాల్సింది...విద్య, సంపాదన, సంపద, కీర్తి, ప్రతిష్ఠ, ఆరోగ్యం, వయసు, సౌందర్యం...ఏదీ కాదు. సాధన ఒక్కటే!
దృఢమైన సాధన చేయనిదే భగవంతుడు కరిగిరాడు. కదిలిరాడు. భక్తికి, ప్రేమకు పుస్తక పరిజ్ఞానం పెద్దగా అవసరం లేదు. కన్నప్ప, శబరి, రత్నాకరుడు (వాల్మీకి) ఏ పుస్తకాన్నీ చదవలేదు. ఏ యాత్రలూ చేయలేదు. పరమాత్మ మీద వారు గుండెల నిండా పరమ ప్రేమ నింపుకొన్నారు. పెద్దలు చెప్పిన అంశాన్ని సాధన చేశారు. గుండె అనే బండపై భక్తి అనే గంధపు చెక్కను అరగదీశారు. రాయే అరిగిందో, చెక్కే కరిగిందో వారికి తెలియదు. గంధం మాత్రం పడింది. అది ప్రేమ సుగంధం!
సాధన మీద మనకు శంకలు కలుగుతుంటాయి. సాకేత రాముడి ఉనికి మీద కూడా! మన అమాయక ప్రశ్నలకు నవ్వుకుంటూ విజ్ఞులు బదులు చెబుతారు. ‘విచికిత్స వద్దు. సాధన చేయండి... సహనంతో. అప్పుడు మీరు ప్రశ్నలే అడగని స్థాయికి వెళతారు. ప్రశ్నల అవసరమే లేని స్థాయికి...’ అని.
మనకు పని కంటే ఫలశ్రుతి మీద ఆసక్తి ఎక్కువ. ఫలశ్రుతిని బట్టి పనులు చేసే వైఖరికి స్వస్తి చెబితే తప్ప, నిజాయతీగా పనులు చేయలేం. ‘ఫలశ్రుతి’ ఆలోచన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కార్యసాధనలో నిజాయతీ లోపిస్తుంది. మనకు భగవంతుడు కావాలి. చాలు- ఇక సాధన మొదలుపెట్టాలి. అంతే. అసలు భగవంతుడున్నాడా, ఉంటే గింటే సాధన ఎలా చేయాలి, సగటున ఎన్ని రోజుల్లో ఫలిస్తుంది? అసలు ఫలిస్తుందా, భరోసా ఎవరు? విఫలమైతే మరో పనికి- మరే పనికి మనం అర్హులం కాగలం, అసలు కాగలమా? సాధనే ప్రారంభం కాలేదు. అసలు దేవుడున్నాడో లేడో నిర్ధారించుకోలేదు. అప్పుడే... విరమణ ఆలోచన! ఆ తరవాతి మన పరిస్థితి ఏమిటనే ఆలోచన! సాధన చేసేది ఇలాగా, భగవంతుణ్ని పొందే పద్ధతి ఇదా?
మన ఆలోచనా విధానం ఏదైనా; అనుమానాలు, అర్థం లేని అంచనాలు ఏవైనా మనమంటూ సాధనకు ఉద్యుక్తులం కావడం ప్రధానం. నీళ్లంటే ఎవరికైనా భయమే. అది నీళ్లలోకి దిగేవరకే! ఒకసారి ధైర్యం చేసి దిగితే- నీళ్లలోని ఆ సుఖం, సరదా అర్థమవుతాయి. భగవంతుడూ అంతే. ఆయనకోసం సాధన చేయడమూ అంతే. ఏదైనా ప్రారంభం కాకముందు, ఏ మాత్రం అనుభవం పొందక ముందు, ఆ అంశపు అసలు తత్వం ఎవరికీ అర్థం కాదు. భక్తిని, భగవంతుణ్ని అనుభవానికి తెచ్చుకుందాం. ఆ మకరందపు మాధుర్యాన్ని ఒకే ఒక్క బిందువైనా ఆస్వాదిద్దాం!
సాధన చేద్దాం. సత్‌ గ్రంథ పఠనం చేయవచ్చు. (స్వాధ్యాయమూ భక్తిమార్గాల్లో ఒకటి). అది ఎంతవరకు? మన సాధనకు ఉపయోగపడేంత వరకు. తీర్థయాత్రలు చేయవచ్చు. అదీ ఎంతవరకు? మన లోపలి అలజడులు అంతరించి, మనసు ఎంతో కొంత శాంతించేవరకు. ఇలాంటివి ఎన్నో. అవన్నీ సాధనలు కావనీ చెప్పలేం. గమ్యాన్ని చేరే సమయం తక్కువగా ఉన్నప్పుడు, వేగానికే మనం ప్రాధాన్యమివ్వాలి.
జీవితంలో మనం ఎన్నో పనులు చేశాం... మళ్లీ చేశాం. మళ్లీ మళ్లీ చేశాం. ఇంకెంత కాలం? ఇక చాలు. కొత్త పని చేద్దాం. చేయాల్సిన పని చేద్దాం. మానకూడని, చేసి తీరాల్సిన పని చేద్దాం. అదే... భగవత్‌ సాధన! ఆ సాధనలో ఆడంబరాలు వద్దు. అతి ప్రదర్శనలు వద్దు. హుందా అయిన, గంభీరమైన, మౌన ప్రధానమైన అసలు సిసలు సాధనే మన లక్ష్యం!
- చక్కిలం విజయలక్ష్మి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)