శివ మహిమ

శివుడి గురించి ఎంత చెప్పినా తక్కువే! శివ మహిమ వర్ణించడం దేవతలకే సాధ్యం కాలేదంటే, ఇక మానవుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇదే విషయాన్ని అకుంఠిత శివభక్తుడు పుష్పదంతుడు ఎంతో అందంగా వర్ణించి చెప్పాడు- ‘ఓ ఈశ్వరా! సాక్షాత్తు విద్యాదేవత అయిన సరస్వతీ దేవి నీ మహిమ వర్ణించడానికి ప్రయత్నించింది. కల్పవృక్షపు కొమ్మను లేఖినిగా చేసుకొంది. సముద్రాన్ని సిరా పాత్రగా ఉంచింది. అందులో ఒక నల్లటి కాటుక కొండను నిలిపింది. భూమినే పెద్ద కాగితంగా మార్చుకొంది. సర్వకాలాల్లోనూ రాస్తూనే ఉన్నా, అంతటి సరస్వతికి సైతం నీ గుణగణాల అంతు చిక్కలేదు’ అనడంలో- శివమహిమ ఘనత తెలుస్తుంది. శివుడి తేజస్సు అన్ని వర్ణనలకూ అతీతం. అది ఎవరి మేధకూ అంతుచిక్కనంత అనంతం!
శివుడి ఒక్కొక్క నామం ఒక్కొక్క గుణాన్ని చెబుతుంది. ‘భవుడు’ అనే పేరు విశ్వసృష్టికి అవసరమైన రజోగుణాన్ని తెలుపుతోంది. సృష్టి జరగాలంటే ఆ గుణం అవసరం. ‘హరుడు’ అనే పేరు విశ్వప్రళయ కారణమైన తమోగుణాన్ని బోధిస్తోంది. విశ్వసౌఖ్యానికి సత్వ గుణం కావాలి. ‘మృడుడు’ అనే పేరులోనే శివుడి సాత్వికత నిండి ఉంది. ఏ విధమైన గుణం అధికంగా ఉంటుందో, ఆ విధమైన నామరూపాలే ఆయనలో కనపడుతుంటాయి. ఇదీ శివుడిలోని విశిష్టత!

పూర్వం త్రిపురాసురుడు మదగర్వంతో స్వర్గంపైకి దండెత్తాడు. దేవతల్ని నానా కష్టాలకు గురిచేశాడు. అప్పుడు వారంతా ఆ రాక్షసుణ్ని సంహరించాల్సిందిగా శివుణ్ని వేడుకొన్నారు. అందుకు తాను సిద్ధమేనని వారికి శివుడు అభయమిచ్చాడు.
అప్పుడు భూదేవి- తాను రథంగా ఉంటానని తెలిపింది. బ్రహ్మదేవుడు ఆ రథానికి సారథ్యం వహిస్తానన్నాడు. మేరు పర్వతం తాను ధనుస్సుగా మారతానంది. సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలుగా రూపొందుతామని ప్రకటించారు. విష్ణువు తాను బాణమవుతానన్నాడు. ఇలా యుద్ధానికి వ్యూహమంతా సిద్ధమైంది.
యుద్ధయాత్ర ప్రారంభ మయ్యే వేళలో, వారందరిలోనూ గర్వరేఖలు పొడచూపాయి. ‘శివుడి యుద్ధయాత్రలో రథంగా ఉన్న నా పాత్రే ఎంతో ప్రముఖమైంది. నేను లేకుంటే శివుడు ఎలా ప్రయాణిస్తాడు?’ అని భూదేవి అనుకొంది. ‘రథం ఉంటే సరిపోదు కదా, దాన్ని చక్కగా నడపగలిగే సారథి కావాలి. నేను లేకుంటే, శివుడు సమరాన్ని ఎలా చేయగలడు?’ అని బ్రహ్మదేవుడు భావించాడు. ‘రథం, సారథి ఉన్నంత మాత్రాన లాభమేమిటి? అసలైన పరికరం ధనుస్సే కదా! అది లేకుంటే శివుడు సంగ్రామంలో ఎలా విజయం సాధిస్తాడు?’ అని మేరు పర్వతం తలపోసింది.
‘చక్రాలు లేనిదే రథం ముందుకు ఎలా సాగుతుంది? అందువల్ల మేమే అత్యంత కీలక స్థానంలో ఉన్నాం’ అని సూర్యచంద్రులు అతిశయం చూపారు. ‘శత్రువును ఛేదించేది బాణమే కదా? కాబట్టి నేనే ప్రధానమైనవాణ్ని’ అనుకున్నాడు విష్ణువు. ఇలా ఎవరికివారే గర్వపర్వతంపై ఎక్కి కూర్చున్నారు.
ఇదంతా గ్రహించాడు శివుడు. వారి గర్వాన్ని అణచివేయాలని భావించాడు. మరుక్షణంలోనే తన మూడో కన్ను తెరిచి త్రిపురాసురుణ్ని, అతడి త్రిపురాల్ని కాల్చి బూడిద చేశాడు. అప్పటివరకు గర్వించిన వారంతా శివుణ్ని ఆశ్చర్యంగా చూశారు. వారి గర్వమంతా ఖర్వం (నాశనం) అయింది. శివుడికి అందరూ నమస్కారం చేశారు. ఇదీ శివ తేజో మహిమ!
దక్షప్రజాపతి సామాన్యుడు కాదు. అతడు తలపెట్టిన యాగమూ సామాన్యమైంది కాదు. ముల్లోకాల్లోని వారంతా వచ్చి, ఆ యాగంలో పాల్గొన్నారు. దక్షుడి వంటి క్రియాదక్షుడైనా, దైవ దూషణ చేస్తే అధోగతిపాలు కాక తప్పదని శివ తేజస్సు నిరూపించింది.
పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేయడం దక్షుడి వినాశానికే కారణమైంది. శివుడి క్రోధాగ్నికి దక్షయజ్ఞం విధ్వంసమైంది. అతడి శిరస్సు పతనమైంది. ఇలా శివతేజం దుష్టసంహారకమై నిలిచింది. శిష్టరక్షణాత్మకంగా విలసిల్లింది. సమస్త లోకం స్తుతించేలా, శివ తేజస్సు విరాజిల్లుతోంది!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)