శివ గాథాలహరి

శివ పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణంతో పాటు పలు ఇతిహాసాలు శివ మహాదేవుడి లీలాగాథల్ని చాటుతున్నాయి. అవి మానవాళికి మహోపదేశాలు అందిస్తున్నాయి. ఆదిదేవుడైన శివుడుఅల్ప సంతోషి, నిరాడంబరుడు, భక్తవశంకరుడు, శుభాలనిచ్చేవాడు, బోళా శంకరుడు, విభూతి ప్రియుడు, చితాభస్మధారి, శ్మశాన వాసి, జలాభిషేక ప్రియుడు, సదా ధ్యానప్రియుడు, భూతగణాధి సేవితుడు, కైలాస నివాసి, సహస్ర నామధేయుడు, సర్వాంతర్యామిఅని వేదోపనిషత్తులు స్తుతిస్తున్నాయి.

శివుడు లింగరూపుడు. పంచభూత సమన్వితుడు. సృష్టికి మూలం స్వరూపమే! అది విశ్వమంతటా వ్యాపించిన చైతన్య శక్తికి సంకేతం.

శివుడి వాహనం వృషభం. ఒకమారు ఆయన హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు, సమీపంలోని తల్లి ఆవు పొదుగు నుంచి లేగదూడ పాలు తాగుతుంటుంది. గాలి ధాటికి పాల నురగ ఆయనపై పడి, ధ్యానం భంగమవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన దృష్టి ఫలితంగా, ఆవులు నల్లగా మారి భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై- ఆవుపాలకు ఎంగిలి ఉండదని శివుణ్ని శాంతపరుస్తాడు. అలా నల్లగా మారిన ఆవులే కపిల గోవులుగా అనంతరం ఆయన వాత్సల్యాన్ని పొందాయని; అందువల్ల, బ్రహ్మ వృషభాన్ని శివుడికి వాహనంగా ఇచ్చినట్లు చెబుతారు.

ఒకప్పుడు శ్మశానంలో ఉండే భూత, పిశాచ గణాలు లోకాల్ని పీడించి భయభ్రాంతం చేస్తుండగా వాటిని అణచివేసిన శివుడు శ్మశాన వాసిగా, భూతగణ సేవితుడిగా స్తుతిపాత్రుడైనట్లు మరో గాథ తెలియజెబుతుంది.

దేవదానవులు క్షీరసాగరాన్ని మథిస్తుండగా, కాలకూట విషం పుడుతుంది. జ్వాలలు లోకాల్ని దహించివేయకుండా, విషాన్ని తన కంఠంలో నిలిపి నీలకంఠుడయ్యాడు శివుడు. లోకపాలకుల విహిత ధర్మాన్ని వివరించే ఘట్టమిది.

దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. ఆమె శివుణ్ని వివాహమాడుతుంది. శివుడికన్నా తానే అధికుడినన్న అహంకారంతో, ప్రజాపతి నిరీశ్వర యాగం నిర్వహిస్తాడు. పిలవకున్నా పుట్టింటికి వెళుతుంది సతీదేవి. అక్కడ అవమానాలపాలైన ఆమె యోగాగ్నిలో భస్మమవుతుంది. శివుడు కాలరుద్రుడవుతాడు. వీరభద్రుణ్ని పంపి దక్షయజ్ఞాన్ని ధ్వంసం గావిస్తాడు. సతీదేవి తిరిగి మేనక, హిమవంతులకు పార్వతిగా జన్మిస్తుంది. శివుణ్ని ఆరాధిస్తుంటుంది. ఒక సమయంలో, శివుడి కంటిమంటకు కాలి బూడిదవుతాడు మన్మథుడు. అనంతరం పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకుంటాడు.

త్రిపురాసురులను ఒక్క బాణంతో సంహరించి, శివుడు త్రిపురాంతకుడయ్యాడు. గజాసురుణ్ని వధించి, అతడి చర్మాన్ని ధరించి, ‘కృత్తివాసుడుఅని పేరు పొందాడు. భక్తుల పాలిట బోళాశంకరుడిగా స్తుతులు అందుకున్నాడు. రావణాసురుడి భక్తికి మెచ్చి ఆత్మలింగాన్నే ప్రసాదించాడు. కిరాతుడి రూపంలో అర్జునుడితో యుద్ధం చేసి, పాశుపతాస్త్రాన్ని అందజేశాడు. శివ మహిమను తెలియజెప్పే ఇలాంటి పురాణ గాథలు అనేకం.

భక్తజనుల్ని అనుగ్రహించేందుకు జ్యోతిర్లింగ రూపుడయ్యాడు శివుడు. అలా పన్నెండు చోట్ల వెలుగొందుతున్నాడు. రామేశ్వరం నుంచి కేదార్నాథ్వరకు అన్ని ప్రాంతాల్లో శివ పంచాక్షరి ధ్వనిస్తుంటుంది. సృష్టిలోని పంచభూతాలూ తానే అన్నట్లు ఉంటాడు శివుడు. కంచిలో ఏకాంబరేశ్వరుడు. జంబుకేశ్వర్లో జల, అరుణాచలంలో అగ్ని, కాళహస్తిలో వాయు, చిదంబరంలో ఆకాశలింగ రూపాల్లో ఆయన కొలువయ్యాడు.

అనంత సృష్టిలోని కాల స్వరూపమంతా శివ భగవానుడే! తెలుసుకునే మనసు భక్తులకు ఉంటే, చర్మచక్షువులు దివ్య చక్షువులవుతాయి. అప్పుడు అంతా శివమయంగా గోచరమవుతుంది. సాధకుడు తానే శివుడవుతాడు!
- దానం శివప్రసాదరావు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)