గీతామృతం: కర్మయోగి-మిథ్యాచారి

మనిషి తానే కర్మలను చేస్తున్నానని అనుకుంటాడు. అందుకే కర్మఫలాలకు తననే బాధ్యునిగా భావిస్తాడు. అయితే విషయం సరైనది కాదని భగవద్గీతలోని మూడో అధ్యాయం (కర్మయోగం) నిరూపిస్తోంది. గీతోపదేశాన్ని మొదలుపెట్టిన కృష్ణ భగవానుడు మొట్టమొదట ఆత్మతత్వాన్ని, ఆత్మస్థితిని వివరిస్తూ బోధ చేశాడు. దానిలో కొంత కర్మయోగం గురించి చెప్పినా చివరకు నిష్కామస్థితిని, అదే స్థితిలో మరణాంతం వరకు ఉండడాన్ని ఉపదేశించాడు. అది వినగానే అర్జునునికి సందేహం కలిగింది. అందుకే గీతాచార్యుడ్ని ప్రశ్నిస్తూ.. ‘కేశవా! బుద్ధియోగమే కామ్యకర్మ కంటే ప్రశస్తమైతే ఎందుకు నన్ను ఘోరమైన యుద్ధకర్మలో నిలపాలని ప్రయత్నిస్తున్నావు?’ (భగవద్గీత 3.1) అని అడిగాడు. ఆత్మస్థితిలో ఉండిపోవడమే అంతిమ లక్ష్యమైతే పలువురి మృత్యువుకు కారణమయ్యే యుద్ధంలో పాల్గొనడం ఎంతవరకు సమంజసమనేది అర్జునుడి ప్రశ్న. విధంగా అతని ప్రశ్నయే కర్మయోగ బోధకు నాంది పలికింది.

జగత్తు కర్మమయం. అందకే దీన్ని కర్మక్షేత్రం అన్నారు. ఇక్కడ కర్మలు చేయడం అనివార్యం. మానవులు కర్మలు చేస్తారు, జంతువులు కర్మలు చేస్తాయి. పశుపక్ష్యాదులు కూడా కర్మలు చేస్తాయి. కర్మకు తగ్గ ఫలం లభించే తీరుతుంది. కర్మఫలం మంచిదైతే జీవుడు సుఖాన్ని అనుభవిస్తాడు, చెడ్డదైతే దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇదే కర్మ తంత్రం. రహస్యాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తత్వవేత్తలు కర్మఫలం నుంచి తప్పించుకోవడానికి ఏకంగా కర్మలనే ఆపే ప్రయత్నం చేస్తారు. అయితే జగత్తు కర్మక్షేత్రం కాబట్టి పద్ధతిని శ్రీకృష్ణుడు ఆమోదించలేదు. విషయాన్ని సూటిగా చెబుతూకేవలం కర్మలను చేయకపోవడం ద్వారా ఎవ్వరూ కర్మఫలం నుంచి ముక్తిని పొందలేరు. అలాగే కేవలం సన్యాసం ద్వారా ఎవ్వరూ సంపూర్ణత్వాన్ని పొందలేరు’ (భగవద్గీత 3.4) అని భగవానుడు లోకానికి బోధ చేశాడు. జగత్తు కర్మజగత్తు కాబట్టి అప్రయత్నంగా కర్మలు జరిగిపోతుంటాయి. ‘నేనేమీ చేయకుండా కూర్చుంటానుఅని అనుకుంటే.. కూర్చోవడమూ కర్మనే అవుతుంది.
  

కర్మలు బంధకారణం కాబట్టి కొందరు కర్మేంద్రియాలను బలవంతంగా నిగ్రహిస్తారు. కానీ మనసులో వాళ్లు ఇంద్రియ భోగాలను తలపోస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తినే గీతాచార్యుడు మిథ్యాచారిగా వర్ణించాడు. ఆధ్యాత్మిక రంగంలో ఇటువంటి వాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. సమస్తం త్యజించిన యోగి అనుకుని జనాలు తండోపతండాలుగా అనుసరించే వ్యక్తి హఠాత్తుగా ఏవో కలాపాల ద్వారా భోగియైునట్లు బయటపడతాడు. దానితో జనులు అతడిని త్యజించడం మనకు కనబడుతూ ఉంటుంది. ‘కర్మేంద్రియాలను నిగ్రహించినా మనసు ఇంద్రియార్థాలపై అంటే ఇంద్రియభోగాలపై లగ్నమై ఉండేవాడు నిశ్చయంగా తనను తాను మోసం చేసుకుంటూ మిథ్యాచారి అనబడతాడు’ (భగవద్గీత 3.6). గీతాజ్ఞానం సరిగ్గా వ్యాపించనట్టి మానవ సమాజం వంచకులు, వంచితులతో నిండిపోయింది. ఎప్పుడైతే గీతాజ్ఞానం యథాతథంగా ప్రచారం జరుగుతుందో అపుడు జనులెవ్వరూ మోసం చేయలేరు. గీతాజ్ఞానం హృదయంలో నిండిన వ్యక్తి మిథ్యాచారిలాగా వర్తించడు. పైగా మనసు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి సంగత్వం లేకుండా కర్మయోగంలో నిలుస్తాడు. అతడే కర్మయోగి
గీతామృతం(భగవద్గీత యథాతథము అధారంగా)
డాక్టర్‌ వైష్ణవాంఘ్రి సేవక దాసు
అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము (ఇస్కాన్‌)
vaishnavanghri@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)