గోకులాష్టమి

శ్రీకృష్ణుడి వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను పరిశీలిస్తుంటే మనం ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం. ఒక పురాణ పురుషుడి సర్వ సమగ్ర వ్యక్తిత్వానికి అది గొప్ప ఉదాహరణగా తోస్తుంది. మనిషిగా దిగివచ్చినప్పుడు అవతారమూర్తి మామూలు వ్యక్తిలా ప్రవర్తిస్తూనే, మహిమాన్విత విద్యలు ప్రదర్శిస్తాడు. అలౌకిక ప్రజ్ఞా వికాసం కనబరుస్తాడు. అప్పుడే దాన్ని పరిపూర్ణ అవతారతత్వంగా చెబుతారు. పరిపూర్ణతత్వం లోకంలో సాధారణ మనిషిగా ప్రవర్తించేటప్పుడు- మానవ ఇతిహాస మహా సౌందర్యం ద్యోతకమవుతుంది. మహిమాన్వితంగా వ్యక్తమయ్యేటప్పుడు- తత్వంలోంచి అరుదైన బ్రహ్మకమలం లేదా సౌగంధిక కుసుమ సౌరభం ఆవిష్కారమవుతుంది. అది దివ్య విభూతి పరిమళం. అలా అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి విస్తరించిన జీవన ప్రస్థాన అంతరాన్ని అధ్యయనం చేయాలనుకున్నవారికి- కృష్ణకథ అద్భుత పాఠ్యగ్రంథమే. అంతటి సర్వ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రపంచంలోని మరే సాహిత్యం తిరిగి సృజించలేక పోయింది. విశ్వ వాంగ్మయానికి శ్రీకృష్ణుడు తరహా ఏకైక ప్రామాణిక నమూనా!

భారతీయ పురాణగాథలు మనకు ప్రధానంగా రెండు రకాల కృష్ణులను పరిచయం చేశాయి. వారిలో భాగవత కృష్ణుడు విశేష రసజ్ఞ మనోజ్ఞమూర్తి. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞానిధి. రెండు రకాల పాత్రల స్వభావాలు విభిన్నమైనవి, సర్వ సమగ్రమైనవి. భాగవత కృష్ణుడి బాల్య చేష్టలు ముగ్ధమోహనాలు. పసిబాలుడు భయంకర రాక్షస మూకలను మట్టుపెట్టినప్పుడు జనం నివ్వెరపోవడం సహజం. అవతార పురుషుడిగా అనుమానించడం సర్వసాధారణం. అలాంటివారిని తిరిగి మాయలో ముంచెత్తే సమ్మోహన వశీకరణ సామర్థ్యం బాలకృష్ణుడికి వెన్నతో పెట్టిన విద్య. అమ్మానాన్నలు, సావాసగాళ్లు, గోపికలు... అందరూ మాయలో మునిగినవారే!

చిలిపి చేష్టల ముసుగులో చిన్మయ తత్వాన్ని ఆవిష్కరిస్తుంటే లోక దృష్టికి సమ్మోహనకరంగా, లోచూపునకు సంక్లిష్టభరితంగా గోచరిస్తుంది. అలా జనాన్ని అయోమయానికి గురిచేయడంలో శ్రీకృష్ణుడంతటి ఘటికుడు మరొకడు కనిపించడు. గోప బాలురకు అనుంగు చెలికాడిగా, గోపికలకు వెన్నెల వేలుపుగా ఆటపాటలతో అలరించిన అపూర్వ ఘట్టాలను అనుశీలించేటప్పుడు మనమూ చటుక్కున వారిలా మారిపోవడాన్నే మనవాళ్లుకృష్ణమాయఅన్నారు. నీలి వెన్నెలలు, వేణుగానాలు, వన విహారాలు, దాగుడుమూతలు, రాసలీలలు... వాటి రమణీయ రసానుభూతులను మనకూ పంచిన ఆర్ద్ర మనోహర ఆప్త సఖుడు మరొకడు ఏడి?

భారత కృష్ణుడు ధీరోదాత్తుడు. రాజనీతిజ్ఞుడిగా, వ్యూహ చతురుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, అసామాన్య ప్రోత్సాహకారిగా, స్ఫూర్తిదాతగా, నేతగా... ఎన్నో కోణాలు భారత కృష్ణుడి వ్యక్తిత్వంలో ఆవిష్కృతమయ్యాయి.

గీతాచార్యుడిగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం శిఖరాయమానమైనది. ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్తగా ఆయననుభగవద్గీతమనకు పరిచయం చేసింది. అది లోకం అంతటికీ వర్తించే అపూర్వ ధీర వచనం. గీతాప్రవచనం భారతకృష్ణుణ్ని గొప్పజగద్గురువును చేసింది. దేశ పరిమితులను దాటించి కృష్ణుణ్నిశాశ్వత ధర్మ గోప్తగా నిరూపించింది. ‘గోప్తఅంటే నిర్దేశకుడు. భాగవత కృష్ణుణ్ని అధ్యయనం చేయడమంటే మనిషి తనలోని అంతరలోకాల్లోకి ప్రయాణించడం! భారత కృష్ణుణ్ని అనుశీలించడమంటే- విశ్వరూప సందర్శన భాగ్యాన్ని ఆపేక్షించడం! దేనివైపు మొగ్గు చూపుతామన్నది జన్మ సంస్కారానికి చెందిన ఒక అభిమతం.

రకంగానైనా నన్ను పొందండిఅని లోకానికి సూచించిన సంపూర్ణ అవతారమూర్తి పుట్టిన రోజును మనవాళ్లు- ‘గోకులాష్టమిగా, ‘కృష్ణ జయంతిగా రెండు రకాలా వ్యవహరించడంలోని రహస్యమది!
---------------------------------------------------------------------
కన్నయ్య చిట్టి పాదాలను కళ్ళారా చూద్దామా !
చిన్ని కృష్ణుడి లీలలను తలచుకుంటూ ఉంటే మహదానందం కలుగుతుంది. ఆయన రూపం ముగ్ధ మోహనంగా ఉంటుంది. చలాకీగా తిరుగుతూ అందరికీ ఆనందాన్ని పంచే బాలకృష్ణుడి ఆటపాటలు మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. బృందావనంలో మురళీ కృష్ణుడు నడయాడినట్లు చెప్పుకుంటున్న స్థలాలను, ఆయన పాదముద్రలను, స్నేహితులతో కలిసి భోజనం చేసిన స్థలాన్ని ఔత్సాహికుడు యూట్యూబ్‌‌లో పోస్ట్ చేశారు.

వీడియోలో ...
బృందావన్లోని రాధా దామోదర్ మందిరంలోని శ్రీ సింహాసనంలో చిన్న కృష్ణుడి పాద ముద్రలు ఉన్నాయని చూపించారు. సముద్ర మథనం సమయంలో గరుత్మంతుడు అమృత కలశాన్ని దాచినట్లు చెప్తున్న చెట్టును కూడా వీడియోలో చూడవచ్చు. చరణ్ పహాడీ అనే ప్రాంతంలో గోపీలోలుడైన కృష్ణుడు సంచరించినపుడు పడిన పాద ముద్రలను వీక్షించవచ్చు. చెట్టుపై రాధే కృష్ణ అని కనిపిస్తుండటాన్ని చూపించారు. చిన్ని కృష్ణుడు తన తోటి గోపాలురతో కలిసి భోజనం చేసినట్లు చెప్పుకుంటున్న స్థలాన్ని కూడా వీడియోలో చిత్రీకరించారు. బృందావనంలోని కలియా ఘాట్లో కూడా ముద్దులొలికే కృష్ణుడి పాద ముద్రలు ఉన్నాయని వీడియో వివరిస్తోంది. మీరూ ఆనందించండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!