రక్షాబంధనం

వర్షరుతువు రాకతో అంతటా హర్షం వర్ధిల్లే తరుణంలో శ్రావణ మాసం విచ్చేస్తుంది. పర్వదినాల సమాహారంగా విలసిల్లే మాసంలో, పౌర్ణమినాడు చేసుకొనే ఆత్మీయానురాగాల పండుగే- రాఖీ పౌర్ణమి. ఒకే చెట్టుకు విరబూసిన అనురాగ కుసుమాలు, ప్రేమభావనల పరిమళభరిత పుష్పాలు- సోదర సోదరీమణులు. మహోదాత్తమైన వారసత్వానికి చిహ్నమై నిలిచేరాఖీసకల శ్రేయస్సుల్నీ ఆకాంక్షించే పండుగ.

వేడుకను రక్షా మంగళం, రాఖీ పూనవ్‌, సలోని, రఖౌనీ అని ఉత్తర భారతాన పిలుస్తారు. తమిళనాట దీన్ని పునాల్పున్నమి అని, గుజరాతీయులు మాళవ్పున్నమి అని వ్యవహరిస్తారు.

రక్షాబంధనం అపురూపమైన సంబరమని పురాణాలు వర్ణించాయి. రాక్షసులు, దేవతల సంగ్రామంలో పరాజయం పాలవకుండా- ఇంద్రుడికి శచీదేవితో రక్షధారణను దేవగురువు బృహస్పతి చేయించాడంటారు. తమకు విజయం లభించేలా, కృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు తన సోదరులతో కలిసి రక్షాబంధన ఉత్సవం నిర్వహించాడనిమహాభారతంచెబుతుంది. దేవతల కోరిక మేరకు దానశీలుడు, మహా బలశాలి, రాక్షసరాజైన బలి చక్రవర్తిని విష్ణువు తన శక్తితో బంధించాడు. తరవాత విష్ణుశక్తిని రక్షాబంధనంలోకి ఆపాదించాడట. ‘నిన్ను బంధించే రక్ష నిన్ను సర్వదా రక్షిస్తుంది. రక్షాబంధనాన్ని ధరించినవారికి సర్వదా శుభ పరంపర కొనసాగుతుంది’- అని విష్ణువు శుభ దీవెన అనుగ్రహించాడని పురాణాలు వర్ణిస్తున్నాయి.

శ్రావణ పూర్ణిమనుసంతోషి పూర్ణిమగా, ‘సంతోషి మాత జన్మదినోత్సవంగా నిర్వహిస్తారు. వినాయకుడి పుత్రులైన లాభం, క్షేమం తమ తండ్రి దగ్గరకు వెళ్లి, తమకు సోదరి కావాలని కోరుకుంటారు. వారి ఆకాంక్ష విన్న గణపతి కళ్ల వెంట ఆనంద బాష్పాలు జాలువారి, హస్తంలోని పద్మంలో పడతాయి. అందులో నుంచి పద్మముఖి వంటి బాలిక ఆవిర్భవిస్తుంది. సంతోష సూచకంగా, బాలికకుసంతోషిఅని నారదుడు నామకరణం చేస్తాడు. అనంతరం తమ సోదరి సంతోషితో లాభ, క్షేమాలు రక్షాబంధన వేడుక జరుపుకొన్నారు.

చారిత్రకంగా రక్షాబంధనానికి అత్యంత ప్రాధాన్యముంది. అలెగ్జాండర్మన దేశంపై దండయాత్రకు వచ్చినప్పుడు, పురుషోత్తమ చక్రవర్తితో యుద్ధానికి దిగాడు. ఓటమి అంచుకు వెళ్లాడు. అలెగ్జాండర్ప్రేయసి రుక్సానా, పురుషోత్తముడికి రక్షాబంధనం కట్టి శరణువేడింది. దాంతో, అలెగ్జాండర్కు పురుషోత్తముడు ప్రాణభిక్ష పెట్టాడని చారిత్రకగాథ. ఉదయ్పూర్రాణి కర్ణావతి- బహదూర్షా నుంచి రక్షణ కల్పించాలని హుమాయూన్ను ఆశ్రయించింది. రక్ష కట్టి, అతడి నుంచి సోదర ప్రేమను అందుకుంది. అక్బర్కాలంలో రక్షాబంధన వేడుక సమగ్రతా ఉత్సవంగా విలసిల్లింది. ఛత్రపతి శివాజీ రక్ష ధరించి, ధర్మరక్షణకు కంకణం కట్టుకున్నాడు. భారత స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో తిలక్‌, పర్వాన్ని ఐకమత్య సాధనకు వినియోగించారు. జైనులు రక్ష దివస్‌, నర్లీ పౌర్ణమి అనే పేర్లతో ఉత్సవం నిర్వహిస్తారు.

సహోదరుల ప్రేమాస్పద భావనల సమ్మేళనమే రక్షాబంధనం. ‘నేను నా సోదరుడి కుడిచేతికి అలంకరించే రక్ష, అతడికి సర్వసౌఖ్యాల్ని కలిగించాలిఅనే శుభాకాంక్షను వ్యక్తపరచేదే రక్షాబంధన్అనిధర్మసింధువివరిస్తోంది.
శ్రావణ పూర్ణిమను- జంధ్యాల పూర్ణిమ అని వ్యవహరిస్తారు. నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. యజ్ఞోపవీతంలోని మూడు పోగులూ దేవ, పితృ, రుషి రుణాలకు సంకేతాలు. వాటికి వేసే ముడినిబ్రహ్మగ్రంథిగా పేర్కొంటారు. ఆయువు, బలం, తేజస్సు, ధీశక్తి- యజ్ఞోపవీత ధారణ వల్ల కలుగుతాయని, ఇది ధర్మాచరణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని నారదుడికి బ్రహ్మ వివరించాడంటారు. శ్రావణ పూర్ణిమనాడే హయగ్రీవ జయంతి, ఉపాకర్మలు నిర్వహిస్తారు. సంస్కృత భాషా దినోత్సవమూ శ్రావణ పూర్ణిమనాడే. ఇలా పలు విశేషాల సమాహారమే... శ్రావణ పూర్ణిమ పర్వదినం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!