నామ స్మరణ

చవకబారు రుచులు మరిగిన నాలుకకు అమోఘమైన రామరస పాన మాధుర్యం తెలియదు. ఒక రుచిని చూసేందుకు నాలుకకు సైతం ఒక అర్హత ఉండాలి. మధుమేహ బాధితుడికి తీపి తినే అర్హత లేదు. కడుపులో వ్రణం ఉన్న రోగికి కారం తినే అవకాశం లేదు. రామనామాన్ని పానం చేయాలంటే నాలుకకు మనోజిహ్వ కావాలి. భక్తుడైన వాగ్గేయకారుడు రామరసాన్ని పానం చేయాలని జిహ్వకు చెప్పలేదు. మనసుకు చెప్పాడు. రామరస మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే, మామూలు నాలుక సరిపోదు. దానికి మనసుండాలి. మనసుకు పవిత్రమైన అభిరుచి ఉండాలి.

రామాఅంటే- జిహ్వకు ఉండేరుచి మొగ్గనుంచి అమృతం స్రవిస్తుంది. ఆనందం వరదలెత్తుతుంది. భక్తుణ్ని పులకాంకితుణ్ని చేస్తుంది. శివకేశవుల ఉమ్మడి నామ ఉచ్చారణ, ఎన్నో రెట్ల గణన వల్ల అతడు మహదానంద భరితుడవుతాడు. రామ రసపానంలో ఓలలాడతాడు.

రాముడు ప్రత్యక్షంగా కొందరిని తరింపజేశాడు. రామనామం యుగయుగాలుగా అగణిత భక్తగణాన్ని తరింపజేస్తోంది. వాల్మీకికి నారదుడు సాధనలూ ఉపదేశించలేదు. ‘రామఅనడమైనా రాని రత్నాకరుడికిమరాఅనే ఒక్క మాటనే అందించాడు. తిరగేసి చెప్పినందువల్ల, రామనామమే- రామావతార వైభవాన్ని శాశ్వతంగా లోకంలో నిలిపిన వాల్మీకి మహర్షిని ప్రసాదించింది. రామాయణం అనే పవిత్ర ఆదర్శ జీవన సంస్కృతిని ప్రతిష్ఠించింది.
రామనామానికి హనుమ స్పందనలు లోకానికి తెలియనివి కావు. రామనామం ఎక్కడ వినిపించినా ఆయన ముకుళిత హస్తుడవుతాడు. అరమోడ్పు కనులతో పారవశ్య స్థితిలో అలాగే ఉండిపోతాడు. ‘రామభక్తుల భక్తుల భక్తుల పాదదాసుణ్ని నేనుఅంటాడు హనుమ. గాలికి బదులుగా రామనామాన్నే శ్వాసగా మలచుకున్న రామనామ పిపాసులు ఎందరో ఉన్నారు. మరెందరో రామభక్తుల గుండెలులబ్డబ్‌’కు బదులురామ రామఅంటూ రామనామాన్నే శబ్దించేవి.

సమస్త లోకాల్లోనూ రామనామానికి మించిన రుచికరమైన శబ్దం మరొకటి లేదు. రుచిని అక్షరీకరించే శక్తి ఎవరికీ లేదు. త్యాగరాజంతటి వాగ్గేయకారుడుశ్రీరామ నీ నామమెంతో రుచిరాఅని శ్రవణానందకరమైన నామానికి రుచినీ జోడించాడు.

తినరాని పండు తీపులకు మెండుఅంటాం. పసిబిడ్డను గురించి- తీపులకే మెండు అయిన బిడ్డ అనే పండును తినడానికి లేదే, వీలు కాదే అని అసంతృప్తి చెందుతుంటాం. కానీ, రామరసాన్ని పానం చేసే సంపూర్ణ అవకాశం రామభక్తులకు మెండుగా ఉంది. రాముడు రస స్వరూపుడు. నామం, రూపం, గుణం... అన్నీ కలకండలా అన్నివైపులా మధురమే. మానవులు, మునులే కాదు- దానవులూ రాముణ్ని ప్రేమించారు. అన్ని ప్రాణులూ ప్రేమించాయి. రాముణ్ని స్మరిస్తే చాలు... మెండైన తీపికొండ కలకండ- తానుగా మన వైపు కరిగి వస్తుంది. మనోజిహ్వను రుచి మధురం చేస్తుంది. రామనామం, రామస్మరణ- సర్వాన్నీఆనంద ఆరామంచేస్తాయి. సాధనాంతం వరకు ఏదీ ఆగదు. ఆసాంతం వేచి చూడరా...అనే అక్షర ద్వయం మనో యవనిక మీదకు చేరుతుంది. ఆనందం అనే మకరంద వర్షంతో జన్మ యావత్తు తడిసిపోతుంది.

రాముడి గురించి ఎందరో కావ్యాలు రాశారు. వాల్మీకి, తులసీదాసు, కంబ, మొల్ల... ఎందరెందరో! అమృత భాండాన్ని ఎందరు పంచుకున్నా తరిగిపోలేదు. మాధుర్యాన్ని ఎందరు చవిచూసినా, రుచి మారలేదు. యుగాలు మారినా అది పాతబడలేదు. మూలన పడలేదు. ఎప్పటికప్పుడు పెరిగే రుచితో, భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉంది. రాముడి కథ పతాకగా, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)