జ్ఞానానికి రూపం భారతీయం

భారత అనే పదానికి జ్ఞానంపై ఆసక్తి కలవారు అని ఒక ప్రముఖమైన అర్థం. భరతుడనే రాజు పాలించడం వల్ల భారత అనే పదం వచ్చిందని చరిత్రలో వింటాం. ‘భాఅంటే ప్రకాశం, జ్ఞానానికి సంకేతం. దీనియందు రతి, ఆసక్తి కలవాడు అని శాస్త్ర పరంపరలో అర్థం. భారతీయులు జ్ఞానంపై ఆసక్తి కలవారు. అందుకే జ్ఞానానికి సంకేతంగా సరస్వతి, గణేశుడు, హయగ్రీవుడు మొదలైన అనేక దేవతా రూపాల్ని భావించుకున్నాం. కానీ, ముఖ్యంగా జ్ఞానావతారం అని ప్రఖ్యాతి పొందిన రూపం దక్షిణామూర్తి రూపం.

దక్షిణామూర్తి మనకు గొప్పగా పరిచితుడు కాదు. శివాలయాలకు వెళ్లినప్పుడు శివుడి దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో దక్షిణ దిక్కుగా ఉన్న మూర్తిని దక్షిణామూర్తిగా గమనిస్తాం. కానీ వేదాంతశాస్త్రంలో కొంత పరిచయం ఉన్నవారికి దక్షిణామూర్తి చాలా ముఖ్యమైన ప్రతీక. దక్షిణామూర్తి స్తోత్రం అనే చిన్న స్తోత్రం ఉపనిషత్తుల అర్థాన్నంతా అందిస్తుంది.

శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి.

గతవారం దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. తెలుగు జిజ్ఞాసువులకు పరిచితులైన పూజ్య స్వామీజీ తత్వవిదానంద సరస్వతిగారు నూటాఎనిమిది పేర్లపై సంస్కృతంలో వ్యాఖ్యానం చేయగా దానిపై ఆంగ్ల అనువాదంతో పాటు ప్రచురితమైన చిన్న గ్రంథం. మన తత్వశాస్త్రంలోని అనేక విషయాల్ని ఇందులో పొందుపరిచారు (www.avgsatsang.org). 108 నామాలను శివాలయాల్లోనూ, దక్షిణామూర్తి ఆలయాల్లోనూ పారాయణం చేస్తుంటారు.

దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే అతడు ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడట. అతని శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడట. మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వృక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. చెట్టు మూలంలో ఉన్నవాడు దక్షిణామూర్తి. అంటే శుద్ధ చైతన్య స్వరూపుడని అర్థం.

ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చుని ఉంటారట. గురువు చేసేది మౌనవ్యాఖ్యానం. మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం. చిన్ముద్ర అనేది చేతివేళ్లతో చూపించే ఒకానొక ముద్ర. శాసీ్త్రయ నృత్యాల్లో అనేక ముద్రల్ని మనం గమనిస్తాం. నటుడు చెప్పదలుచుకున్న విషయాన్ని వేళ్ల భంగిమతో చూపించడాన్ని ముద్రలు అంటారు. ఇదొక body language లాంటిది. ముద్రలు ఆధ్యాత్మిక సాధనలో అనేకం. ప్రస్తుతం దక్షిణామూర్తి చెబుతున్నది చిన్ముద్ర. అరచేతిని తెరిచి ఉంచి అందులో చూపుడు వేలును బొటనవేలితో కలిపి గుండ్రంగా ఉంచి మిగతా మూడు వేళ్లనూ నిటారుగా ఉంచడమే చిన్ముద్ర. చిత అంటే చైతన్యం.

బొటనవేలు చైతన్యానికి అంటే పరమాత్మకు సంకేతం. చూపుడు వేలు అహానికి సంకేతం. అందుకే ఇతరుల్ని గద్దించడానికి చూపుడు వేలును చూపిస్తాం. అహం అనే భావాన్ని పోగొట్టుకుని దాన్ని చైతన్యంతో కలిపి మిగతా మూడు వేళ్లకూ అంటకుండా ఉంచడమే చిన్ముద్ర. మిగతా మూడు వేళ్లూ సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం. సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట.

దక్షిణామూర్తి నూటాఎనిమిది పేర్లు సాధారణ భక్తుడికీ, జ్ఞానమార్గంలో ఉన్న సాధకుడికీ ఇద్దరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. సామాన్య భక్తుడికి తన కోర్కెలు తీర్చే ఒకానొక భగవంతుడి రూపం అవసరం భక్తుల్ని రక్షించడం వరాలివ్వడం మొదలైన గుణాలు ఉండాలి. దీన్ని సుగుణ ఉపాసన అని ఇదివరకు వ్యాసాల్లో చూశాం. ఇలాంటి గుణాలేమీ లేని స్థాయి నిర్గుణం. అంటే శుద్ధ చైతన్యం. దక్షిణామూర్తి శివుని అవతారం కావున శివుడికి ఉన్న పేర్లు కొన్ని ఇతనికీ చెప్పారు. ఉదాహరణకు నాగుల్ని ఆభరణంగా కలిగినవాడు అని ఒక పేరు. నాగం అనేది ప్రాణాయామానికీ, యోగానికీ, శక్తికీ చిహ్నం. యోగపద్ధతి ద్వారా తెలుసుకోగల తత్వం అని అర్థం. రుషులు పరోక్ష ప్రియులు. అంటే చెప్పదలచిన విషయాన్ని నేరుగా చెప్పకుండా సంకేత భాషతో చెబుతారు. అర్థం చేసుకునే వాడి స్థాయిని బట్టి వాటిని ఆస్వాదించగలం.
దిగంబరుడు అన్నది మరొక పేరు. అంటే నగ్నంగా ఉన్నవాడు. దరిద్రంలో మగ్గినవాడు అని అర్థం కాదు. అనంతమైన వస్తువుకు అంచులంటూ ఉండవు. విశ్వమంతా వ్యాపించిన తత్వానికి దిక్కులు కూడా ఉండవు. అయినా మన దృష్టి కోణం నుంచి దిక్కులే వస్త్రాలుగా కలవాడు అంటున్నాం. విశ్వం ఎంత పెద్దగా ఉన్నా దాన్నంతటినీ వ్యాపించిన వాడు అని అర్థం. ఇలా ప్రతి పేరులోనూ ఒక విశిష్టమైన అర్థాన్ని చూడగలం
దేవుళ్లందరూ ఏదో ఒక రాక్షసుడ్ని చంపినట్లు పురాణాల్లో చూస్తుంటాం.

రాక్షసులందరూ తమోగుణానికి సంకేతాలే. దక్షిణామూర్తిచే చంపబడిన రాక్షసుడు అపస్మారుడు. అపస్మారం అంటే తెలిసినదానిని మర్చిపోవడం. జ్ఞానానికి దూరం కావడం. సాధన మార్గంలో ఇదొక గొప్ప అడ్డంకి. అందుకే సాధకులు దక్షిణామూర్తి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఇతనికి మేధా దక్షిణామూర్తి అని కూడా పేరు. మేధ అంటే ధారణశక్తి. ఎన్నో విషయాలను గుర్తుంచుకునే శక్తి. శక్తికి ప్రతీక దక్షిణామూర్తి.
పూజ్యులు శ్రీ తత్వవిదానంద సరస్వతి గారు రాసిన పై పుస్తకాన్ని సంస్కృతభారతి, హైదరాబాద్విభాగం వారు ప్రచురించారు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకమిది.

 - డాక్టర్కె. అరవిందరావు 
రిటైర్డు డీజీపీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!