శ్రీకూర్మ జయంతి

లంలో నివసించే కూర్మం, తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదిలిస్తుంది. సంకల్పరహితంగా ఉన్నప్పుడు, నీట్లో స్తంభించి ఉంటుంది. అవసరం లేనప్పుడు ఇంద్రియాలను సుఖాల నుంచి మరల్చడమే స్థితప్రజ్ఞత. దానితో పాటు, బహిర్ముఖ ప్రవృత్తి నిలుపుచేసుకొని అంతర్ముఖ ప్రవృత్తిలోకి వెళ్లగలిగే చిత్తవృత్తికీ కూర్మమే ప్రతీక. అది తన దేహంతో జలమంతా క్రీడిస్తున్నట్లు- సర్వాధిష్ఠాన, చైతన్యాత్మ స్వరూప నారాయణుడు జీవకోటి అంతటా నిండి ఉన్నాడు. అందువల్ల కూర్మం భగవత్‌ స్వరూపమని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీ మహావిష్ణువు అవతారాలన్నింటికీ నిర్దిష్టమైన లక్ష్యం, ప్రయోజనం ఉన్నాయి. నేరుగా రాక్షస సంహారమే ధ్యేయంగా గోచరించకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని ఉద్దేశించినదే కూర్మావతారం!
ఒకనాడు దూర్వాస ముని స్వర్గలోకానికి వెళ్తున్నప్పుడు, వూర్వశి మందారమాలతో కనిపించింది. ఆయన ఆ దండను ఆమెను అడిగి పుచ్చుకొని, ఇంద్రుడికి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని ఐరావతమనే తన ఏనుగు పైకి విసిరాడు. అది ఆ మాలను చిందరవందర చేసింది. ఆగ్రహించిన ముని ‘ఐశ్వర్య గర్వంతో నన్ను అవమానించావు. నీ ఐశ్వర్యం సాగరంలో కలుస్తుంది’ అని ఇంద్రుణ్ని శపించాడు. ఆ శాపం వల్ల ఇంద్రుడి సర్వ సంపదలూ హరించుకుపోయాయి. మరోపక్క అసురుల వేధింపులకు తాళలేకపోయాడు. అప్పుడు శ్రీహరిని దేవతలందరూ ప్రార్థించారు. ఇంద్రుడి సంపదలతో పాటు అమృతాన్ని కూడా తిరిగి సాధించడానికి సముద్ర మథనం చేయాలని, అది ఒక్క దేవతల వల్ల కాదని, అమృతం ఆశ చూపి రాక్షసులనూ కలుపుకొని పోవాలని శ్రీహరి సలహా ఇచ్చాడు. ఇంద్రుడు కోరితే, దానవులు అందుకు అంగీకరించారు.
దేవ దానవులు మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చి, వాసుకిని తాడుగా చేసుకొని, పాలకడలిని మథించసాగారు. రాక్షసులు తలవైపున, దేవతలు తోకవైపున పట్టుకున్నారు. వాసుకి ఓ సర్పం. దానికి విషం తలభాగంలో ఉంటుంది. అది మృత్యుస్వరూపం. రాక్షసులు తామసులు. తమస్సు పాపభూయిష్ఠం. దాన్ని అణచివేస్తే తప్ప లోకంలోనైనా, మనసులోనైనా ప్రకాశం కలగదు. అందువల్ల శ్రీహరి ఆ రాక్షసుల్ని వాసుకి ముఖం వద్ద నిలిపాడు.
మథనవేళ పర్వతం బరువుగా ఉండి, దిగువన ఆధారం లేకపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు శ్రీహరి లీలనే ‘కూర్మావతారం’ గా చెబుతారు. బ్రహ్మాండాన్ని తలపించే పరిమాణంలో ఆయన మహాకూర్మ రూపంలో అవతరించాడని, మునిగిపోయిన పర్వతాన్ని పైకెత్తి నిలిపాడని ‘భాగవత’ పురాణ కథనం. క్షీరసాగర మథనంలో చివరగా లభించిన అమృత కలశాన్ని మోహిని రూపంలో ధరించాడు విష్ణువు. రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసి, దేవతలకు అమృతం ప్రసాదించాడు. అప్పటినుంచి ఆయన జంబూద్వీపంలో కూర్మరూపుడై ప్రకాశిస్తున్నాడని ‘బ్రహ్మపురాణం’ వర్ణిస్తోంది. కూర్మం కాలానికి ప్రతీక అని మరికొందరు భావిస్తారు.
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మక్షేత్రంలో కూర్మనాథుడు వెలశాడు. 11వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని తూర్పు గాంగరాజులు, ప్రాకారాన్ని మధ్వాచార్యులైన నరహరితీర్థులు నిర్మించారని చారిత్రక శాసనాలు వివరిస్తున్నాయి. స్వామికి సింహళదేశానికి చెందిన గాయనీమణి భాగలదేవి అమూల్య ఆభరణాలు సమర్పించారని, చైతన్య ప్రభువు క్రీస్తుశకం 1512లో ఆ ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. ‘పద్మపురాణం’, ‘పాంచరాత్రాగమ సంహిత’ గ్రంథాలు ఆ క్షేత్రమహిమను ప్రస్తావించాయి. అసోంలోని గువాహటిలోనూ కూర్మనాథాలయం ఉంది!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!