అమ్మ మేనేజ్‌మెంట్‌

అమ్మ...ఓ సంస్థకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు అయితే - పాలన ఎలా ఉంటుంది, నిర్ణయాలు ఏ పద్ధతిలో జరుగుతాయి, నియామక విధానమేమిటి, విలువలకు ఇచ్చే విలువెంత - మొత్తంగా ‘అమ్మ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ ఎలా ఉంటుంది? మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలోని ఆది నాయకురాలికీ, అధినాయకురాలికీ...నమస్తే!
పేరు: అమ్మ 
హోదా: చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ 
గతానుభవం: ఓ ఇంటిని చక్కదిద్దింది. ఇంటిపెద్దకు అండగా నిలిచింది. పిల్లల్ని పెంచింది. ప్రయోజకుల్ని చేసింది. అత్తమామలకు అన్నీతానైంది. అందరికీ తల్లో నాలుకైంది.

అర్హత: ఐఐటీల్లో చదువుకోలేదు. ఐఐఎమ్‌లలో కాలుపెట్టలేదు. ఐఎస్‌బీ సెమినార్లకూ హాజరు కాలేదు. అయినాసరే, అమ్మతనమే ఆమె అతిగొప్ప అర్హత.
నైపుణ్యాలూ ప్రత్యేకతలూ: సముద్రమంత లోతైన ఆలోచన. ఆకాశమంత విశాల భావాలు. అనంతమైన ఆశావాదం. ధరిత్రిని మరిపించే క్షమాగుణం. సంక్షోభాల్లోనూ సడలని విశ్వాసం.
కుటుంబం... 
అమ్మ పాలనలోని అతిచిన్న రాజ్యం. ఆ నాయకత్వంలో ఇల్లు చల్లగా ఉంటుంది. నలుగురూ నిశ్చింతగా బతుకుతారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనే కొంగుబిగిస్తుంది. ఎక్కడ ఏ సవాలు ఎదురైనా తనే చెంగుదోపుకుంటుంది. ఆమె పరిధి ఓ కంపెనీ దాకా విస్తరిస్తే కనుక...సిబ్బంది కూడా కుటుంబ సభ్యులే. ఆమె హోదా ఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుకో సమానం. అంతకంటే ఎక్కువే కావచ్చు. ఇదంతా వూహ కాదు. కాల్పనిక సాహిత్యమూ కాదు. ఓ నాయకత్వ విధానం.

మెటర్నలిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌... 
‘అవును, మాది మాతృత్వ నాయకత్వ సంస్థే’ అని అనేక కంపెనీలు సగర్వంగా ప్రకటిస్తున్నాయి. సెల్‌ఫోన్ల తయారీదారు మోటరోలా, అంతర్జాతీయ బైకుల దిగ్గజం హార్లీ డేవిడ్సన్‌ అమ్మ తరహా పాలనకే ఓటేశాయి. ఆ ఆవరణల్లో ప్రతి వ్యూహం వెనుకా, ప్రతి నిర్ణయానికి ముందూ, మొత్తంగా ప్రతి విషయంలోనూ...అమ్మలానే ఆలోచిస్తారు.

అమ్మ - నాయకత్వం...వేరువేరు కాదు. 
అమ్మతనంలో సహజమైన నాయకత్వం ఉంది. నాయకత్వంలో అంతర్లీనంగా మాతృత్వం ఉంటుంది. నడిపించడమే నాయకత్వమైతే, తొలి అడుగులు వేయించే అమ్మే ఆది నాయకురాలూ అధినాయకురాలూ. ఆలోచనే ప్రాథమిక పాలన సూత్రమైతే...బిడ్డ పుట్టగానే, అమ్మ మనసులో ఆలోచనలు మొదలవుతాయి, ఓ పాతికేళ్ల ప్రణాళిక సిద్ధమైపోతుంది. పెద్దోడు లెక్కలు బాగా చేస్తాడు. కానీ ఆంగ్లంలో తడబడతాడు. చిన్నోడికి ఆంగ్లం కొట్టినపిండి. అయితే, సైన్సులో తికమకపడతాడు. అమ్మకు బిడ్డల బలహీనతలు తెలుసు, బలాలూ తెలుసు. వాటిని యథాతథంగా స్వీకరిస్తుంది. నాయకుడి ప్రధాన అర్హత కూడా ఇదే. సరైన వ్యక్తికి సరైన బాధ్యత - ఆ లోతైన అవగాహనతోనే సాధ్యం. అమ్మ మార్పును అర్థం చేసుకుంటుంది, తనకు
అన్వయించుకుంటుంది. బిడ్డ పెరుగుదలతో పాటే అమ్మ వికాసమూ. కాన్వెంట్‌ చదువుల పిల్లలతో మాట్లాడటానికి ఇంగ్లిష్‌ సాధన చేస్తుంది. లెక్కల్లో వెనకబడిన బిడ్డకు బోధించడానికి ఆల్జీబ్రా నేర్చుకుంటుంది. కౌమారంలో కాలుపెడుతున్న సంతానం మీద కన్నేసి ఉంచడానికి కంప్యూటర్‌ను పరిచయం చేసుకుంటుంది. వ్యాపార నాయకులకు ఉండాల్సిన లక్షణాలే ఇవన్నీ. కొత్త తరాన్ని అర్థం చేసుకోవడం, కొత్త మార్కెట్‌ను పసిగట్టడం, కొత్త ధోరణుల్ని విశ్లేషించడం ఏ వ్యాపారనేతకైనా తప్పనిసరి. అమ్మలో ఆవిష్కర్తా లేకపోలేదు. ఇంట్లో పిడికెడు బియ్యం, కాసిన్ని కందిపప్పూ ఉన్నప్పుడు కూడా...‘నా వల్ల కాదు’ అని చేతులెత్తేయదు. ఆ కొద్ది వనరులతోనే కమ్మని వంటకమేదో సృష్టిస్తుంది. ఆ సమయంలో ఆమె బుర్ర ఓ స్టార్టప్‌!

అమ్మేం ‘నాన్‌ పర్ఫార్మింగ్‌ కెప్టెన్‌’ కాదు. గట్టుమీద నిలబడి నీతులు చెప్పదు. మాతృమూర్తిది అచ్చమైన ఆచరణాత్మక నాయకత్వం. చేసేదే చెబుతుంది. చెప్పిందే ఆచరిస్తుంది. దేన్నీ వృథా చేయదు, ఎవర్నీ వృథా చేయనివ్వదు. తాను క్రమశిక్షణ తప్పదు, ఇంకొకర్ని తప్పనివ్వదు. ‘మెంటారింగ్‌’లో అమ్మ తర్వాతే ఎవరైనా. ఎవరి బాధ్యతలేమిటో...ఆమెకు తెలుసు. ఎవరెవరు తమ లక్ష్యాలకు ఎంత చేరువలో ఉన్నారో ఆమెకే ఎరుక. బిడ్డ పక్కదారి పట్టినట్టు అనిపించినా, దొడ్డిదార్లో నడుస్తున్నట్టు అనుమానం కలిగినా...ధర్మాగ్రహిస్తుంది. అంతిమ లక్ష్యానికి చేరుకునే దాకా...అన్నీ తానై ముందుకు నడిపిస్తుంది. అనుకోనిదేమైనా జరిగినా, అల్లకల్లోలమైపోదు. ప్లాన్‌-బితో సిద్ధం. మళ్లీ ఇంకో యుద్ధం!
‘వార్‌రూమ్‌’లో అమ్మ... 
హఠాత్తుగా ఓ సంస్థ సంక్షోభంలో పడింది. సిబ్బందిలో తెలియని అశాంతి. వ్యాపారంలో అనూహ్యమైన సమస్యలు. పెద్దపెద్ద నిపుణుల్ని సంప్రదించినా పరిష్కారం దొరకలేదు.

మిగిలింది, ఒకటే దారి - మెటర్నలిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ ... అమ్మ పాలన! అప్పుడెప్పుడో పురాణాల్లో...మహామహా రాక్షసుల నుంచి కాపాడమంటూ దేవతలంతా వెళ్లి ముగ్గురమ్మల మూలపుటమ్మను వేడుకుంటారు. అలానే, దిగ్గజాలంతా బయల్దేరి అమ్మ దగ్గరికెళ్లారు. మాతృమూర్తిని అధినేత్రిగా ఎన్నుకున్నారు. దానవిక్రయాది హక్కులతో సహా సర్వాధికారాలూ అప్పగించారు. ఇక, అమ్మ మేనేజ్‌మెంట్‌ మొదలైంది...
కంచిపట్టు చీరలో కళకళలాడుతున్న అమ్మలా...అద్దాల భవంతి. అమ్మ నుదుటి మీద పావలా బిళ్లంత కుంకుమ బొట్టులా - ‘జనని వెంచర్స్‌’ అన్న ఎర్రక్షరాలు. అమ్మ మనసంత విశాలంగా...ఖరీదైన కారు. అమ్మ కాలు కింద పెట్టింది. ఉద్యోగులంతా పసిపిల్లలైపోయారు. తల్లికోడి చుట్టూ చేరిన పిల్లల్లా చుట్టుముట్టేశారు. నమస్కారాలూ, ప్రతి నమస్కారాలూ. పలకరింపుగా చిరునవ్వులూ, జవాబుగా మళ్లీ చిరునవ్వులూ. కుశల ప్రశ్నలూ, పరామర్శలూ. అమ్మ లిఫ్టు ఎక్కబోతుంటే...అంతా పక్కకి తప్పుకున్నారు. ‘నిక్షేపంగా ఆరుగురు వెళ్లొచ్చు. నేను ఇద్దరు మనుషులతో సమానమనుకున్నా... ఇంకో నలుగురు పడతారు. రండి, పర్లేదు’ అంటూ తన మీద తాను జోకేసుకుంది.
ఐదో అంతస్తు రానేవచ్చింది. 
అమ్మ నేరుగా వార్‌రూమ్‌లోకి వెళ్లింది. 
గంభీరమైన వాతావరణం. 
తెరమీద వాణిజ్య ప్రకటన... 
రెండు సింహాలు కయ్యానికి కాలుదువ్వుతాయి. అట్నుంచి ఒకటి గర్జిస్తుంది. ఇట్నుంచి ఒకటి గర్జిస్తుంది. అడవిలోని జంతువులన్నీ హడలిపోతాయి. ఏం జరుగుతుందో అన్న భయం. అంతలోనే...ఒక దాని ముసుగు తొలగిపోతుంది. అది సింహం కాదు, గుంటనక్క. మార్కెట్లో మేమే సింహం. నక్క ఎవరో వూహించుకోండి - అంటూ క్యాప్షన్‌.

‘ఆ పోలిక మనల్ని ఉద్దేశించే మేడమ్‌! మన ఉత్పత్తులు నాసిరకమంటూ పరోక్ష ప్రకటనలు గుప్పిస్తోంది పోటీ సంస్థ. ఒక్క ఏడాదికే వంద కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. లాభం లేదు. మనమూ ఎదురుదాడి చేయాల్సిందే.నూటయాభై కోట్లయినా ఖర్చుపెట్టాల్సిందే. లేకపోతే మార్కెట్లో తలెత్తుకోలేం’ 
- వైస్‌ ప్రెసిడెంట్‌ (బ్రాండింగ్‌) ఫిర్యాదు.

ఆతర్వాతా, చాలా మంది మాట్లాడారు. అంతా, ప్రకటనల యుద్ధానికే మొగ్గుచూపారు. చివరగా, అమ్మ గొంతు సర్దుకుంది...
‘ఎవరో బురద చల్లుతున్నారని, మన చేతులకు మసి పూసుకుంటామా? అవతలివాళ్లు వంద కోట్లు ఖర్చుపెట్టారని, మనం నూటయాభై కోట్లు ఖర్చుపెడతాం. మనం నూటయాభై కోట్లు పెట్టామని, వాళ్లు రెండొందల కోట్లు కేటాయిస్తారు. ఎంతకాలమిలా...అర్థంలేని పరుగు. ఇదంతా చూస్తుంటే నాకో పోలిక గుర్తుకొస్తోంది. గంధపు చెట్లు చాలా ఏపుగా పెరుగుతాయి. ఆ ఎత్తు కారణంగానే కావచ్చు, ఈదురుగాలులకు ఇట్టే వాలిపోతాయి. ఓ అడవిలో...చాలా చెట్లుండేవి. మొదటి వరుసలోని ఓ పెద్ద చెట్టు పడిపోగానే, వెనకవైపు ఉన్న చిన్నాచితకా చెట్లన్నీ, ‘భలే శాస్తి జరిగింది పెద్దచెట్లకి’ అని మురిసిపోయేవి. కొన్నాళ్లకి, చిన్నచెట్ల వంతూ వచ్చింది. ఏదో ఓ రోజు అడవంతా నాశనమైపోయే పరిస్థితి. ఆ సమస్య నుంచి బయటపడటం ఎలా అన్న ఆలోచన మొదలైంది. ఇక లాభం లేదనుకుని, ‘నువ్వు బతకాలి....నేనూ బతకాలి, మనమంతా బతకాలి’ - అన్న తీర్మానానికి వచ్చాయి. రెండు చేతులూ కలిస్తే...పది చేతుల బలం. చెట్లకు చేతులుండవు. అయితేనేం, వేళ్లుంటాయి. భూమిలోపల.. ఒక చెట్టు వేళ్లతో మరోచెట్టు వేళ్లు పెనవేసుకోసాగాయి. దీంతో మూలాల్లో పట్టు పెరిగింది. కొత్త శక్తి వచ్చింది. ఆతర్వాత, పెనుగాలులు కూడా ఏమీ చేయలేకపోయాయి.
నువ్వెంత, నువ్వెంత - అని వేలెత్తి చూపితే చీమంత. 
నువ్వింత, నేనింత - అని చేతులు కలిపితే కొండంత. 
పోటీ మంచిదే. కానీ అనారోగ్యకరమైన పోటీ వద్దు. ఆ విషయం వాళ్లకూ చెబుదాం. వింటారనే నమ్మకం ఉంది. పోటీ సంస్థ బ్యాలెన్స్‌షీట్‌ తెప్పించుకుని చూశాను. ఐదేళ్ల నుంచీ నష్టాల్లో ఉంది. అయినా, ఆస్తుల్ని తాకట్టుపెట్టుకుని మనతో తలపడుతోంది. మనమూ ఆవేశపడితే...ఆ కంపెనీ మూతపడటం ఖాయం. దీనివల్ల వేల కుటుంబాలు వీధుల్లో పడతాయి. శత్రువుకైనా సరే, అలాంటి కష్టం రాకూడదు. ఏ అమ్మ అయినా నాలానే ఆలోచిస్తుంది’

అప్పటివరకూ ఆవేశంతో వూగిపోయినవాళ్లంతా, శాంతించారు. నింపాదిగా ఆలోచించారు. అందర్లోనూ ‘అమ్మే కరెక్ట్‌’ అన్న భావన.
అమ్మ సంతకం 
సిబ్బంది జీతాల ఫైలు అమ్మ ముందుకొచ్చింది. ఎదురుగా చేతులుకట్టుకుని హెచ్‌ఆర్‌ హెడ్డు. మేనేజరు, ఆపై స్థాయి సిబ్బందికి యాభైశాతం పెంచాలి. డిప్యూటీ మేనేజరు నుంచి గుమస్తా వరకూ పదిహేను శాతం పెంచాలి - అన్నది ప్రతిపాదన. అమ్మ కళ్లజోడు సవరించుకుని, కాగితాల్ని తిరగేసింది.

‘మేనేజర్ల జీతాలు పెంచితే, కంపెనీకి ఎంత ఖర్చవుతుంది?’ అని అడిగింది.
‘సుమారు యాభైకోట్లు’ 
‘మరి, కిందిస్థాయి సిబ్బందీ?’ 
‘అదో యాభైకోట్లు’ 
‘పైస్థాయిలో పాతిక శాతానికి పరిమితం చేద్దాం. కిందిస్థాయి సిబ్బందికి కూడా పాతికశాతం పెంచుదాం. దీనివల్ల తేడా ఏమైనా వస్తుందా?’ 
అమ్మ ప్రశ్న పూర్తయ్యేలోపు లెక్కలు సిద్ధం చేశాడు మేనేజరు - ‘నెలనెలా, అదనంగా మరో యాభైలక్షలు అవసరం కావచ్చు’ చెప్పాడు. 
‘ఓ ప్రశ్న అడుగుతాను. జవాబు చెప్పండి. పాండవుల్లో ఎవరంటే కుంతీదేవికి ఎక్కువ ప్రేమ?’ - అక్కడున్న ఎవరూ వూహించలేకపోయారు. 
‘ధర్మరాజే. ఎందుకంటే ధర్మానికి కట్టుబడ్డాడు కాబట్టి’, ‘నకులసహదేవులు కావచ్చు. చిన్నవాళ్లు పాపం!’, ‘అర్జునుడే. మహావీరుడు కదా’ ... ఇలా రకరకాల సమాధానాలు. 
‘ఎవరూ కాదు. భీముడు. వృకోదరుడికి ఆకలెక్కువ. ఏ తల్లి అయినా కడుపునిండిన పిల్లల గురించి పెద్దగా ఆలోచించదు. ఆకలితో ఉన్న బిడ్డల చుట్టే అమ్మ ఆలోచనలన్నీ తిరుగుతాయి. భీముడి విషయంలోనూ అంతే. నాలుగిళ్లూ యాచించి ఐదుగురు కొడుకుల కడుపు నింపాల్సి వచ్చినప్పుడు కూడా...ఐదు ముద్దల్లో రెండో ముద్దే పెద్దగా ఉండేదట. ఉద్యోగులంతా నా బిడ్డలే. అందర్నీ సమానంగా ప్రేమిస్తా. కానీ, కాస్తంత మొగ్గు కిందిస్థాయి సిబ్బంది వైపే. వాళ్ల జీతాలు తక్కువ. అవసరాలేమో ఎక్కువ. ధరలు చుక్కల్ని తాకుతున్న రోజుల్లో...పదిహేను శాతం ఏమూలకి సరిపోతుంది?’ - అమ్మ మాటలో నిజం ఉంది. అమ్మ ఆవేదనకు అర్థం ఉంది. కాబట్టే, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అమ్మ నిర్ణయం... 
రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వింగ్‌.. 
కొత్త ప్రాజెక్టుకు సంబంధించి మేధోమధనం మొదలైంది. 
‘మనం చిరుతిళ్ల మార్కెట్లో కాలుపెట్టబోతున్నాం. అమెరికాలోని ఓ పేరున్న సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. పేరు వాళ్లది. ఫార్ములా వాళ్లది. ఉత్పత్తి మనది. లాభంలో ఇరవైశాతం వాటా వాళ్లది. ఆ పనులూ పూర్తి కావచ్చాయి’



ప్రకృతే మహిళకు నాయకత్వ బాధ్యత ఇచ్చింది. అనేక జంతుజాతుల్లో మాతృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలుతోంది. ఏనుగుల గుంపునకు నాయకత్వం వహించేది కూడా మగ మదపుటేనుగు కాదు...అపార అనుభవం ఉన్న తల్లి ఏనుగే. ఎటువైపు వేటకు వెళ్లాలి, ఏ పులో దాడిచేసినప్పుడు ఏ దార్లో తప్పించుకోవాలి...ఇలా కీలక నిర్ణయాలన్నీ అమ్మ ఏనుగువే. ఎందుకంటే, అమ్మలో బతకాలన్న కోరిక కంటే బతికించాలన్న ఆరాటమే ఎక్కువ.



మ్మ అంటే ప్రేమ. సృష్టిలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తీకరణ ప్రేమే. ఆ ప్రేమశక్తిని మేనేజ్‌మెంట్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. ఒకానొక దశ దాకా...ఆడవాళ్లు కూడా మగరాయుళ్లలా ప్రవర్తించాలన్న వాదన వినిపించింది. అంటే, ఆమె కృతకంగా పురుషుడిగా మారిపోవాలన్నమాట! కాదు, కాదు...ఆ అవసరమే లేదంటున్నారు మేనేజ్‌మెంట్‌ గురువులు. పురుషుడే మహిళలా ఆలోచించాలన్నది నయా సిద్ధాంతం.

- ‘లీడింగ్‌ విత్‌ లవ్‌’ రచయిత్రి కత్లీన్‌ సాన్‌ఫోర్డ్‌


మెరికాలోని వైద్య సంస్థలు క్యాన్సర్‌ రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాల్ని నెలకొల్పాలని తీర్మానించాయి. వాటికో కొలమానం ఉండాలని భావించాయి. ఏ తల్లి అయినా బిడ్డకు అందించే సేవే అత్యున్నతమైంది. తమ స్థానంలో అమ్మ ఉంటే ఎలా స్పందిస్తుంది, ఎలాంటి సపర్యలు చేస్తుంది - అన్న కోణంలోంచి ఆలోచించడం మొదలుపెట్టాయి. అదే ప్రమాణమని భావించాయి. ఆ తూకంరాయి పేరు...‘మదర్స్‌ స్టాండర్డ్‌’


‘ఆ ఫుడ్‌ ఫార్ములా తెలుసుకోవచ్చా?’ - అమ్మ స్వరంలో ఆందోళన. 
‘తప్పకుండా మేడమ్‌! రిఫైన్డ్‌ మైదాపిండి, ఉప్పు, మసాలాలు, నూనె, మొక్కజొన్న పిండి... వగైరా వాడతాం’ 
‘రసాయనాల సంగతి?’ 
‘అదీ...అదీ! ఆ విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నాం మేడమ్‌. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ యాక్ట్‌ అనుమతించిన ప్రకారమే కాస్త...’ 
‘... కాస్త విషం కలుపుతారు. అంతేనా? అలాంటివాటి వల్ల భవిష్యత్తులో పిల్లల ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు, గుర్తుందా? నిజమే, అవన్నీ ప్రాథమికమైన అధ్యయనాలే కావచ్చు. నిజాలు తేలేసరికి ఓ పదేళ్లు పడుతుంది. ఆలోపు ఓ కోటిమంది పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది’ - అమ్మ కాళికాంబే అయ్యింది.

‘ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేద్దాం. మహా అయితే, ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు వృథా అయిపోతుంది. కానివ్వండి! రాగులూ, జొన్నలూ, సజ్జలూ... లాంటి ధాన్యాలతో రుచికరమైన చిరుతిళ్లు తయారు చేద్దాం. అన్నీ వంటింటి దినుసులే వాడాలి. రసాయనాల జాడే ఉండకూడదు. వీలైతే సేంద్రియ పద్ధతుల్లో పండించిన ధాన్యాన్నే కొందాం. దొరక్కపోతే, రైతుల్ని ప్రోత్సహిద్దాం. పెట్టుబడి డబ్బు కూడా మనమే ఇద్దాం. దీనివల్ల రైతూ బాగుపడతాడు. ఎన్నోకొన్ని ఆత్మహత్యలు తగ్గుతాయి. పిల్లలకు మనం మంచి ఆహారపు అలవాట్లు నేర్పించాలి. అమ్మగా నా పిల్లలకు ఏం వండిపెడతానో, వ్యాపారవేత్తగా నా కస్టమర్లకూ అదే వడ్డిస్తాను’ - అమ్మ మాటకు ఎవరూ ఎదురుచెప్పలేకపోయారు. ఎందుకంటే, ఆ వాదనలో నిజం ఉంది, నిజాయతీ ఉంది.
అమ్మ నియామకాలు.. 
ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 
మూడు దశల వడపోత తర్వాత ఇద్దరు మాత్రమే మిగిలారు. 
ఒక యువకుడు. 
ఒక గృహిణి. 
ఆ యువకుడి వైపే మొగ్గుచూపుతున్నారు నియామక నిపుణులు. చివరికి ఫైలు అమ్మ దగ్గరికి వెళ్లింది. 
‘మీ అభిప్రాయం ఏమిటి?’ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ను అడిగింది అమ్మ. 
‘నాకైతే ఆ అబ్బాయే సరైనవాడని అనిపిస్తోంది. ఇద్దరి అనుభవమూ దాదాపుగా సమానమే అయినా, తనకు అదనంగా రెండు డిగ్రీలున్నాయి - చెప్పాడు ఉన్నతాధికారి. 
‘పట్టాలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన, ఎక్కువ ప్రతిభ ఉంటుందని ఎలా చెప్పగలం? ఆ కుర్రాడి ప్రవర్తనలో తేడా ఉంది. తనకు అన్నం పెడుతున్న కంపెనీ గురించి చాలా నీచంగా వ్యాఖ్యానించాడు. ఈ అమ్మాయితోనూ మాట్లాడాను. గుచ్చిగుచ్చి అడిగినా, తాను పనిచేసున్న సంస్థ గురించి ఒక్క మాటా చెప్పలేదు. అంతర్గత విషయాలు మాట్లాడ్డం భావ్యం కాదేమో...అని సున్నితంగా తప్పించుకుంది. నేను కోరుకున్నదీ అలాంటి సమాధానాన్నే. నిజమే, తను తాజా నైపుణ్యాల విషయంలో కాస్త వెనకే ఉంది. అందుకు కారణం, పిల్లల పెంపకం కోసం కొన్నేళ్ల పాటూ ఉద్యోగానికి దూరంగా ఉండటం. ఆ నైపుణ్యమేదో మనమే ఇప్పిద్దాం. ఓ ఆరునెలలు అమెరికా పంపుదాం. అయినా, నైపుణ్యం ఎక్కడైనా దొరుకుతుంది. విలువలు ఉన్నవాళ్లే చాలా అరుదు’ - నియామక పత్రం మీద సంతకం పెడుతూ తన నిర్ణయాన్ని చెప్పింది అమ్మ. అప్పుడే, కార్పొరేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ నుంచి మెయిల్‌ అందింది. అమ్మ చెప్పిందే నివేదికలోనూ ఉంది. ఆ యువకుడి మీద ఒకట్రెండు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టూ వెల్లడైంది. అమ్మ కళ్లు స్కానర్లు. ఎదుటి మనిషిని ఇట్టే అంచనా వేస్తాయి.

అమ్మ తీర్పు.. 
ఓ సీనియర్‌ ఉద్యోగి, కిందిస్థాయి సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు అమ్మ దృష్టికి వచ్చింది. తను తెలివైనవాడు. పనిమంతుడు. అతన్లోని ఒకే ఒక లోపం...తనకే అన్నీ తెలుసునన్న అహంకారం. దీంతో ఎదుటి మనిషిని గౌరవించడం మానేశాడు. తోటి ఉద్యోగుల్ని చీమల్లా చూడటం మొదలుపెట్టాడు. ఒకట్రెండుసార్లు అమ్మ దగ్గరా మాట తూలాడు. ఉద్యోగంలోంచి తీసేద్దామని చాలామంది సలహా ఇచ్చారు. అయినా అమ్మ విన్లేదు. ‘బాల్యం నుంచీ కృష్ణార్జునులు స్నేహితులే. కానీ కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందే గీత ఎందుకు బోధించాడంటారూ? దేనికైనా సమయం, సందర్భం రావాలి’ అని సర్దిచెప్పింది. అంతలోనే ఈ ఫిర్యాదు. మరుసటి రోజే అమ్మ అతడిని పిలిపించింది. ఆ ఉద్యోగి కళ్లలో నిర్లక్ష్యం. మాటల్లో బేజవాబుదారీతనం.

అమ్మే సంభాషణ మొదలుపెట్టింది? 
‘నేనే మీ అమ్మనై ఉంటే...నువ్వు చేసిన పనికి చెంప పగలగొట్టేదాన్ని. నాకా అధికారం లేదు. అమ్మలాంటి దాన్ని కాబట్టి, ఓ మాట చెప్పగలను. మాటే మంత్రమని అంటారు. అదే నిజమైతే నిన్ను తప్పకుండా మారుస్తుంది. పూర్వం బాలదాహి అనే ముని ఉండేవాడు. అతడికి ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ముని బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ‘స్వామీ! మరణం లేని కొడుకును ప్రసాదించు’ అని కోరాడు. ‘అలా సాధ్యం కాదు మునీశ్వరా. ఎంతకాలం బతకాలన్నది నువ్వే నిర్ణయించుకుని చెప్పు’ అని మినహాయింపు ఇచ్చాడు బ్రహ్మ. ‘అయితే, అదిగో ఆ కొండ ఉన్నంత కాలం నా బిడ్డ బతికుండాలి’ అని విన్నవించాడు. ‘తథాస్తు’ అన్నాడు సృష్టికర్త. ఆ బిడ్డకు ‘మేధావి’ అని నామకరణం చేశారు ముని దంపతులు. దురదృష్టవశాత్తూ, మేధావుల్లోని ఒక్క లక్షణమూ రాలేదు. నిలువెల్లా గర్వమే. దీంతో అందర్నీ హింసించేవాడు. అకారణంగా ఓ వృద్ధుడికి పుత్రశోకం కలిగించాడు. దీంతో ఆ వయోధికుడు..గడ్డపార తీసుకుని వెళ్లి కొండను తవ్వడం మొదలుపెట్టాడు. సంకల్పంతో సాధ్యం కానిదేం ఉంది? కొండ కరిగిపోయింది. మేధావి కూలిపోయాడు. ‘ఈ కథలోని మేధావిలా కాకుండా...నిజమైన మేధావిలా ప్రవర్తించు. నువ్వు ప్రతిభావంతుడివే. తిరుగులేదు. కానీ, ఆ ప్రతిభకు వినయం తోడు కావాలి’ - తగలాల్సిన చోట తగిలింది. అహం మంచులా కరిగింది. కన్నీళ్లయి పారింది. పశ్చాత్తాపంతో మనసుకు పట్టిన మురికి వదిలిపోయింది. అ...మ్మా.. క్షమించు - అంటూ కాళ్లమీద పడ్డాడు.

అమ్మ ప్రకటన... 
ఫోర్బ్స్‌ అత్యంత శక్తిమంతుల జాబితా వెలువడింది. అందులో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు. ఆ విజయాన్ని పండగలా జరుపుకుందా సంస్థ. సింహద్వారం దగ్గర అమ్మ నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఆరోజే అమ్మ చేతుల మీదుగా ఆవిష్కరణ. అమ్మ వచ్చింది. పటాన్ని ఆవిష్కరించింది. అందరూ భావించినట్టు, అది అమ్మ బొమ్మ కాదు. ఒడిలో పసిబిడ్డతో ఓ మాతృమూర్తి చిత్రం. పరీక్షించి చూస్తే...అంతర్లీనంగా వందలకొద్దీ సంతకాలు. అవన్నీ ఉద్యోగులవి.

‘ఇందులో, ఏ ఒక్క గీత లేకపోయినా చిత్రం అసంపూర్ణమే. అలానే మీలో ఎవరు లేకపోయినా, ఈ విజయం లేదు. ఇదంతా మీ శ్రమ ఫలితమే. ఆ ఫలాన్ని మళ్లీ మీకే తిరిగి ఇస్తున్నా’ - సంస్థలో ఉద్యోగులకూ వాటా ఇస్తూ అమ్మ తీసుకున్న నిర్ణయం...కార్పొరేట్‌ ప్రపంచంలో ఓ సంచలనం. ఇక నుంచీ అటెండరు మొదలు అత్యున్నత స్థాయి వ్యక్తుల దాకా అంతా యజమానులే.
‘మీకు తెలుసా?ఈ నిర్ణయం వల్ల ప్రపంచ కుబేరుల జాబితాలో మీ స్థానం పడిపోయింది...’ ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. 
అమ్మ సమాధానం.. 
‘కొన్ని అంతే. సంపాదిస్తున్నప్పటి కంటే, కోల్పోతున్నప్పుడే ఆనందంగా ఉంటుంది. వంద ఒత్తుల్ని వెలిగించాక, దీపానికి కాస్తంత వెలుగు తగ్గితే అది...కొండెక్కినట్టు కాదు, శిఖరాన్ని అధిరోహించినట్టు’

కెమెరాలు తళుక్కుమన్నాయి. చప్పట్లు మోగాయి. ప్రశంసలు వెల్లువెత్తాయి. కాసేపటికే వేడుకలు వూపందుకున్నాయి.
ఆ సమయానికి అమ్మ...నష్టాల్లో కూరుకుపోయిన మరో సంస్థ గురించి ఆలోచిస్తోంది. దాన్నెలా గట్టెక్కించాలా అని మధనపడుతోంది. మమకారానికి ముగింపు ఉండదు. అమ్మకు విశ్రాంతి లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)