వీర హనుమాన్‌

రామాయణంలో రాముడి తరవాత, స్థాయిలో ఉత్తమ స్థానాన్ని హనుమ అందుకున్నాడు. ‘అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుడు- సీతాదేవి శోకాన్ని నివారించాడు. వానర వీరులకు నాయకుడైన పవన సుతుడు అక్షకుమారుణ్ని వధించి, సమస్త లంకానగరాన్నీ భయభ్రాంతులకు గురిచేశాడుఅని హనుమంతుణ్ని గొప్ప కర్మయోగిగా, కార్యసాధకుడిగా, మహావీరుడిగా, అవక్ర పరాక్రమవంతుడిగా వాల్మీకి మన ముంగిట ఆవిష్కరించాడు.

రామాయణంలో మొదట గోచరమయ్యే హనుమ, సుందరకాండలో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. యుద్ధకాండ ముగిసేవరకు కీలక భూమిక పోషించాడు. సుందరకాండకు సౌందర్యం ఆయన వల్లనే సిద్ధించింది. కపీశుడు ఉదాత్తగుణ సంవిధానంతో, ఉత్తమ లక్షణ సమన్వయంతో సుందరకాండను సుసంపన్నం చేశాడు. అప్రమేయ శక్తియుక్తులతో తన పరిపూర్ణ ఆదర్శనీయ వ్యక్తిత్వాన్ని చాటిచెప్పాడు. మంత్రశాస్త్ర రీత్యా, హనుమ నామంసుందరుడు’. అందర్నీ ఆకర్షిస్తూ, అందరి ఆదరాభిమానాలూ పొందే సుగుణ సుందరధాముడు హనుమంతుడు.

విశ్వవ్యాపకమైన భగవత్తత్వాన్ని ఆవిష్కరింపజేసే అంశాన్నిఅంజనగా వ్యవహరిస్తారు. పుంజిక స్థల అనే దేవకాంత శాపవశాత్తు అంజన పేరిట వానర వనితగా రూపుదాల్చింది. ఆమెకు పుత్రుడిగా జన్మించి, దైవత్వాన్ని అన్వేషించి, దైవాన్ని దర్శించి, సాధకుడిగా దైవోపాసన చేసిన దివ్య రూపుడే వాయునందనుడు. త్రిపురాసుర సంహారంలో పరమేశ్వరుడికి విష్ణువు సహాయం చేశాడని, అందుకు కృతజ్ఞతగా శ్రీరాముడి కోసం రుద్రుడే రామదూతగా అవతరించాడని, రాక్షస వధలో పాలుపంచుకున్నాడనిపరాశర సంహితవిశదీకరిస్తోంది.

హనుమ అంటే- మూర్తీభవించిన అనన్యసామాన్య దాస్యభక్తి, అనిర్వచనీయ శక్తి, కార్యసాఫల్య యుక్తి. హనుమత్అనే పదానికి సుషుమ్నతో కూడిన యోగీశ్వరుడు అని అర్థం. శ్రీచక్ర నివాసిని, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అయిన సీతామహాసాధ్విని లంక అనే శ్రీపురంలో దర్శించిన హనుమ పూర్వయోగసిద్ధిని అందుకున్నాడు. ‘హనుఅంటే అతులితమైన జ్ఞానం. శ్రీపీఠ సంచారిణిని దర్శించుకుని జ్ఞానయోగాన్ని పొందడం ద్వారా ఆంజనేయుడుహనుమాన్అయ్యాడు.

అష్ట విభూతుల శిష్ట జన రక్షకుడు హనుమ అనినారద పురాణంఆంజనేయ గుణ సంకీర్తన చేసింది. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమ- ఎనిమిది గుణాల కలబోత కపివరేణ్యుడు. రజోగుణంతో భాసిల్లుతూ సత్వగుణంతో శోభిల్లే హనుమ సదా ఆదర్శనీయుడు.

ఆలోచన, ఆచరణ, విశ్లేషణ, వివేచన, పరిశీలన వంటి దశల్ని పనిలోనైనా సమగ్రంగా అమలు చేయడం ద్వారా విజయాన్ని అందుకోవచ్చని పవన కుమారుడు రుజువు చేశాడు. శ్రేయోసంధాతగా ఆయన పరుల హితాన్ని సదా ఆకాంక్షించాడు. సీత జాడను రాముడికి తెలిపి, లక్ష్మణుడి ప్రాణాల్ని నిలిపి, సీతారాముల్ని కలిపి అభయానంద ఆంజనేయుడిగా కీర్తి గడించాడు.

హనుమంతుడు దైవశ్రేష్ఠుడనివానర గీతవెల్లడించింది. ఆయనను ఆరాధించడం వల్ల సకల దేవతల ఉపాసన ఫలితం సిద్ధిస్తుందని ఈశ్వరుడు వివరించినట్లుశతరుద్ర సంహితచెబుతోంది. హనుమజ్జయంతినాడు భక్తులు ఆచరించాల్సిన విధివిధానాల్నిశౌనక సంహితవివరించింది. పంచామృతాలతో స్వామి విగ్రహాన్ని అభిషేకించి, నువ్వుల నూనె కలిపిన సిందూరాన్ని ఆకృతికి పులిమి, తమలపాకులతో అష్టోత్తర సహితంగా ఆరాధించాలి. పానకం, వడపప్పు, అప్పాలు, అరటిపండ్లు వంటి పదార్థాల్ని హనుమకు నైవేద్యంగా సమర్పించాలి.

ఐశ్వర్య లబ్ధికి మంగళవారం, ఆరోగ్యసిద్ధికి శనివారం కేసరి నందనుణ్ని నియమబద్ధంగా పూజించాలని చెబుతారు. మహాశక్తిసంపన్న హనుమ ఆరాధన- సకల వ్యాధి వినాశకం, సమస్త యోగదాయకం, సర్వభోగ కారకం!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!