రాముడి తర్వాత హనుమంతుడే

ఒక జాతిని కలిపి ఉంచడానికి రాజ్యాంగాలు, చట్టాలు ఎంత ముఖ్యమో సంస్కృతి కూడా అంత ముఖ్యం. సంస్కృతి వ్యక్తిలో సంస్కారాన్ని నింపి క్రమశిక్షణ కలవాడిగా తయారుచేస్తుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. భరతఖండం సంస్కృతి చరిత్రకందనిది.

భారతీయ సంస్కృతిని పోషించిన గ్రంథాలు రామాయణం, భారతంలాంటివి. సంస్కృతిని బలహీనపరిస్తే జాతిని బలహీనపరచగలం అన్నది యూరోపియన్ఆక్రమణదారుల కాలం నుంచి అమలుపరుస్తున్న సూత్రం. రాజకీయ స్వాతంత్య్రం 70 సంవత్సరాల క్రితం వచ్చినా, సంస్కృతిపై మేధోపరమైన దాడులు చేస్తూ సమాజాన్ని విడగొట్టడానికి అనేక కోణాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇటీవల అమెరికా దేశంలో స్కూలు విద్యార్థులకై తయారుచేసిన రామాయణం వర్క్బుక్ఒక తాజా ఉదాహరణ. రామాయణం దళితుల్నీ, వెనుకబడిన వారినీ అణిచి వేయడానికి రాయబడిన గ్రంథమని ఇందులోని పాఠం. పాఠం చివర ఒకానొక వామపక్ష రచయిత రాసిన గేయాన్ని జోడించారు. ‘‘ రామా! ఆర్యజాతివాడివి నీవు, మా పూర్వీకుడైన హనుమంతుణ్ణి కోతి అన్నావు. లంకను నాశనం చేయడానికై మమ్మల్ని కోతిసైన్యంగా వాడావు. రామా! నేడు కూడా మా కోతి సైన్యం మీ మెజారిటీకి అక్కరకు వచ్చింది. ఇకమీదట మేము కోతులుగా ఉండం.’’ ఇది గేయ సారాంశం (ఆంగ్లపాఠాన్ని The Battle for sanskrit అనే పుస్తకంలో ప్రచురించారు పే.సం 339). రామాయణాన్ని, పై గేయాన్ని రెంటిని కలిపి చదివి రాముడు ఎంతటి నియంత అన్న విషయంపై విద్యార్థులందరూ తమ అభిప్రాయాల్ని ప్రకటించడంపై వర్క్బుక్లోని కార్యక్రమం.
మనదేశంలో వర్గంవారూ ఎప్పుడూ ఊహించని వింత వ్యాఖ్యానమిది. హనుమంతుణ్ణి మనమెప్పుడూ దళితుడని భావించలేదు.

దళితులు, అగ్రవర్ణాలు అందరూ పూజిస్తున్న వ్యక్తి హనుమంతుడు. మరి పాశ్చాత్య మేధావులు ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు? ప్రజల్ని వర్గాలుగా విభజించడం అన్న ఉద్దేశం సరే. అంతేకాక తమ పూర్వీకులు చరిత్రలో అనేక జాతుల్ని నిర్మూలించడం, ఆఫ్రికా ఖండం నుంచి కోట్లాదిమందిని బానిసలుగా తీసుకెళ్లడంలాంటి ఘోరాలెన్నో చేశారనే ఆవేదన వాళ్ల మనసుల్లో ఉండడం వల్ల అలాంటి ఘోర చరిత్రను మనకు కూడా ఆపాదించి కొంత సంతృప్తి చెందుతున్నారని భావించాలి. అయినా పై పాఠాల్ని చదివిన విద్యార్థులకు భారతీయ సంస్కృతి పట్ల ఏహ్యభావం తప్పక కలుగుతుంది. కోట్లాది ప్రజల మతవిశ్వాసాల్ని అపహాస్యం చేయడం మేధావుల వికృత సంస్కారానికి నిదర్శనం.

రాముడు ఎప్పటి వాడు అంటే త్రేతాయుగం వాడని ఠక్కున చెప్పేస్తాం. చరిత్ర కేవలం నాలుగైదు వేల సంవత్సరాల వెనక్కు మాత్రమే వెళుతుంది. అనాదిగా ఉన్న సాహిత్యాన్ని, పరంపరలో వస్తున్న ఆచారాల్నీ గమనించదు. త్రేతాయుగం సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితందని మన సంప్రదాయం. చరిత్రకారులు దీన్ని నమ్మకపోయినా అతి ప్రాచీనమైన చరిత్ర అని అంగీకరించాలి. వ్యాసుడు రాసిన మహాభారతంలో రామాయణ కథ ఉంది. పద్మపురాణంలాంటి వివిధ పురాణాల్లో రాముని ప్రసక్తి, స్తోత్రాలు ఉన్నాయి. రామరహస్యోపనిషత్తు, రామతాపనీయోపనిషత్తు అంటూ అథర్వణవేదంలో రెండు ఉపనిషత్తులున్నాయి. రాముని పేరే మహామంత్రంగా అనాదిగా వ్యవహరింపబడుతోంది. రామరహస్యోపనిషత్తులో హనుమంతుడు వక్త, రుషులు శ్రోతలు. యోగులు రమించే తత్వం రాముడు, అదే పరమాత్మతత్వం అని ఉపనిషత్తు చెబుతుంది. ఈవిధంగా రాముణ్ణి ఆదర్శపురుషుడిగా చూడడమే కాక పరబ్రహ్మ స్వరూపంగా యోగులు ఉపాసించారు.

వాల్మీకి మాత్రం చాలా వాస్తవిక దృష్టితో రాముణ్ణి వర్ణిస్తాడు. భగవంతుని అవతారం అని బాలకాండలో చెప్పినా మిగతా గ్రంథమంతా రాముణ్ణి సాధారణ మానవుడిగానే చిత్రించింది. సీతావిరహంలో ఇతర వ్యక్తుల్లాగానే అతడు విలపిస్తాడు. రాముని విలాపాన్ని వాల్మీకి చాలా అందమైన శ్లోకాల్లో వర్ణించాడు. వాల్మీకి చెప్పిన రాముడు మహిమల్ని చేయడు. సాధారణ మానవుడిలాగానే సుగ్రీవుని సహాయాన్ని కోరతాడు. కిష్కిందకాండలో రాముని కన్నా సుగ్రీవుడే ముఖ్యుడిగా కనిపిస్తాడు.
హనుమంతుణ్ణి మొట్టమొదటగా కిష్కిందకాండలో చూస్తాం. దూతగా వెళ్లిన హనుమంతుడు రామలక్ష్మణులతో ఎలా స్నేహం చేసుకోవాలని ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాడట. స్వచ్ఛమైన సంస్కృతంలో మాట్లాడాడనీ, వేదాల్ని పూర్తిగా చదివినవాడు తప్ప మరొకడు అలా మాట్లాడలేడనీ రాముడు అతడిని ప్రశంసిస్తాడు. రామాయణంలో మనం చూసే వానరులు ఒకానొక విద్యావంతుల జాతి వారని తెలుస్తుంది.
సుందరకాండ ప్రారంభం నుంచి చివరి వరకూ హనుమంతుడు కూడా రామునితో సమఉజ్జీగా కథానాయకుడు. ‘సుందరే సుందరం కిం’- సుందరకాండలో సుందరం కానిదేది అన్నారు విమర్శకులు. వ్యక్తిత్వ నిర్మాణానికి చదవాల్సింది హనుమంతుని చరిత్ర. ‘‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం హనూమత స్మరణాత భవేత’’ అని హనుమంతుని గూర్చిన మంత్రం. బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం, వాక్చాతుర్యం మొదలైనవన్నీ హనుమంతుని పేరు స్మరించడంతోనే లభిస్తాయని దీని అర్థం. కేవలం స్మరించడం వల్ల కాదు, అతని చరిత్ర చదవాలని అర్థం.
సుందరకాండలోని ప్రతిసర్గలో హనుమంతుడు గుణాల్ని ప్రదర్శించడం చూస్తాం.

దూతగా కేవలం తనకు చెప్పిన పని మాత్రమే కాక మరింత కార్యసాధన ఎలా చేయాలి అని ఆలోచించడం, సీత దొరకదేమో అని పూర్తిగా నిరాశ కలిగినపుడు దాన్ని తొలగించుకుని ధైర్యాన్ని నింపుకోవడం, ప్రతి సందర్భంలోనూ ఆలోచించి కార్యనిర్ణయం చేయడం మొదలైనవి ఇక్కడ చూస్తాం. వివిధ సందర్భాల్లో ఆంజనేయుని మనస్సులో మెదిలిన ఆలోచనలు మనస్తత్వ విశ్లేషణ వలే ఉంటాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి సూత్రాల్లాంటి శ్లోకాలు ఇందులో కనిపిస్తాయి. సీతకు భయం కలిగించకుండా ఎలా మాట్లాడాలి, రావణుడికి భయం కలిగేట్లు ఎలా మాట్లాడాలి, సామ, దాన, భేద, దండోపాయాల్లో ఉపాయం పనికివస్తుంది అనే వాటిని బాగా వితర్కించుకుని ముందుకు వెళ్లే మనస్తత్వాన్ని గమనిస్తాం. బహుశా శ్రీరాముని తరువాత అంతగా ఆరాధించదగిన వ్యక్తి హనుమంతుడే. రాముని గుడులతో పాటు దేశం నలుమూలలా ఆంజనేయుని గుడులు కూడా ఉన్నాయి. భక్తి సంప్రదాయంలో ఆంజనేయుణ్ణి గురువుగా ఉపాసిస్తారు. పై చెప్పిన ఉపనిషత్తుల్లో కూడా దీన్నే గమనిస్తాం. విమర్శకులు మన బుద్ధికి పదునుపెట్టే అవకాశమివ్వడం మంచిదే. మూలంగానైనా విమర్శకులూ, సమర్థకులూ ఇద్దరూ రామాయణాన్ని చదవగలరు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)