మట్టికుండ

మట్టికుండ

పురుషోత్తముడు.. శ్రీరాముడు..

by 10:41:00 PM 0 comments


 శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా దాల్చిన అవతారం శ్రీరామ అవతారం. మానవ రూపంలో భూమిపై అడుగుపెట్టిన ఆ దివ్యమూర్తి పురుషోత్తముడిగా ఎలా వుండాలో ఆచరణలో చూపించాడు. చైత్ర మాసం నవమినాడు జన్మించిన శ్రీరాముడు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా రామరాజ్యాన్ని నెలకొల్పాడు. ఈ నెల 15న శ్రీరామనవమి పర్వదినం. ఈ సందర్భంగా యావత్‌ భారతదేశంతో పాటు తెలుగురాష్ట్రాల్లో నవమి వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ప్రతి ఇల్లు, వీధి, వాడ, పట్టణం, నగరం... శ్రీరామ నామ స్మరణతో ప్రతిధ్వనిస్తాయి. తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట ఆలయాల్లో జరిగే శ్రీరాముని బ్రహ్మోత్సవాల విశిష్టతను, ఆలయ చరిత్రను తెలుసుకుందాం.

కరుణాపయోనిధి.. భద్రగిరి రామయ్య
పవిత్ర గోదావరి నదితీరంలోని భద్రాద్రిలో వెలసిన శ్రీసీతారామస్వామి ఆలయం దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. వనవాసకాలంలో స్వామివారు సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడే నివాసమున్న పవిత్రనేల ఇది. పర్ణశాల నుంచే అమ్మవారిని రావణాసురుడు అపహరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

భద్రగిరి 
మేరు, మేనకల పుత్రుడైన భద్రుడు మునిపుంగవుడు. స్వామివారు పర్ణశాలలో నివాసమున్న విషయం తెలుసుకొని దర్శించుకుంటారు. అనంతరం రాముల వారు సీత అన్వేషణకు బయలుదేరుతారు. రావణవధ అనంతరం అక్కడకు విచ్చేస్తానని భద్రునికి వరమిస్తాడు. కొంత కాలానికి రావణ వధ జరగడం, శ్రీరామ పట్టాభిషేకం వెంట వెంటనే జరిగిపోతాయి. భద్ర మహర్షి శ్రీరామ దర్శనం కోసం తపస్సు చేస్తాడు. భక్తుని తపస్సును గమనించిన వైకంఠరాముడు యావత్‌ వైకుంఠమే కదిలివచ్చిన రీతిలో భద్రుడికి ప్రత్యక్షయ్యాడు. తాను కొండగా వుంటానని తనపై స్వామివారు అధిష్టించాలని భద్రుడు కోరుకుంటాడు. భక్తుని కోరిక ప్రకారమే భద్రగిరిపై సీతాసమేతంగా స్వామి వెలిశారు.

భక్త రామదాసు 
గోల్కోండ రాజ్యంలో పాల్వంచ పరగణాకు కంచెర్ల గోపన్న తహశీల్దారుగా నియమితులయ్యారు. పరమ రామభక్తుడైన గోపన్న భద్రగిరిపై వున్న శ్రీరామచంద్రప్రభువుకు ఆలయ నిర్మాణం చేయాలని తలుస్తాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఆలయనిర్మాణానికి వినియోగిస్తాడు. సమాచారం అందుకున్న గోల్కోండ పాలకుడు తానీషా అతన్ని బందీఖానాలో బందిస్తాడు. తానీషాకు రామ, లక్ష్మణులే మారువేషాల్లో వచ్చి స్వయంగా గోపన్న చెల్లించాల్సిన ధనం చెల్లించి అతన్ని విడిపించినట్టు కథనాలు వెల్లడిస్తున్నాయి. చెరసాలనుంచి విడుదలైన గోపన్న తన జీవితాన్ని శ్రీరాముని సన్నిధిలోనే గడిపి భక్త రామదాసుగా చరిత్రలో నిలిచిపోయారు. శ్రీరాముడిపై ఆయన అనేక కీర్తనలను రాశారు.

వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు 
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీరామ కల్యాణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు భద్రాద్రికి చేరుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను రాములవారికి సమర్పిస్తారు. అంగరంగవైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు రెండు కన్నులు చాలవంటే అతిశయోక్తికాదు.

ఎలా చేరుకోవాలి 
* హైదరాబాద్‌ నుంచి రైలులో భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడ నుంచి భద్రాచలానికి చేరుకోవచ్చు. 
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలనుంచి భద్రాచలానికి బస్సు సౌకర్యముంది. 
* సమీప విమానాశ్రయం 117 కి.మీ.దూరంలోని రాజమండ్రి విమానాశ్రయం. 
* హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 325 కి.మీ.దూరంలో వుంది.


 
శ్రీకోదండరామాలయం- ఒంటిమిట్ట
   శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం.త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీకోదండరామస్వామిగా తన భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీరామునికి అనుంగు భక్తుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.

జాంబవత స్థాపితం 
వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయవిగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయప్రాంగణంలో చూడవచ్చు.

అద్భుతమైన ఆలయనిర్మాణం 
ఆలయ నిర్మాణం విజయనగరవాస్తుశైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో వుండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్‌ యాత్రీకుడు టావెర్నియర్‌ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని తెలుస్తోంది. ఆంధ్రవాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం.

పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం 
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు 
రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు.

ఎలా చేరుకోవచ్చు 
* కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. 
* రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది. 
* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది. 
* తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి