విధేయతతోనే విజయం

విధేయత అమోఘమైన ఆయుధం. తలవంచి నడవడమే మన విజయానికి బాట వేస్తుంది. లౌకికంలో మనుషులు డాబుగా ఉండటం, భయపెట్టడం, హెచ్చరించడం వలన విజయం లభిస్తుందని భావిస్తారు. మన దగ్గర అలౌకిక శక్తి ఉంది. దైవీశక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉన్నాయి. మనమెవ్వరూ జయించలేని ఆయుధం విధేయత. దీని ముందు ఎంత పెద్దవారైన తలవంచాల్సిందే.

యోగ్యులైన మనకు విధేయత పెద్ద ఆయుధం. అందరూ దీనిని సిద్ధిని పొందే స్వరూపంగా భావిస్తారు. విధేయతలో ఎల్లప్పుడూ నేను విశ్వసేవకుడననే విషయం గుర్తుండాలి. సాధారణంగా మనం అందరితోపాటు సేవ చేస్తున్నప్పుడు ఒక్కోసారి నేను వీరికి నౌకరునా! వీళ్లు నాగురించి ఏమనుకుంటున్నారు? అని భావన రావచ్చు. కానీ మీరు ఈ ప్రపంచానికి నిజంగానే నౌకర్లు. భగవంతుడు సైతం మనందరికి విధేయత గల సేవకుడని భావిస్తాడు. అందుచేత మనం కూడా విశ్వసేవకులమే.

విధేయులుగా అయ్యేందుకు తమను తాము ఈ ప్రపంచంతో చనిపోయి పరమాత్ముడి ఒడిలో జీవించిన వారిగా భావించండి. లౌకికంలో మీరు పెద్ద ఆఫీసర్‌ కావచ్చు, ధనవంతులు కావచ్చు, కానీ ఇక్కడ మీరు భగవంతుని పిల్లలు. నేను ఫలానా అని భావించకండి. మీరు మీ పాత జన్మతో మరణించారు. మీ దగ్గర ఉన్న గౌరవం, ధనసంపదలు అన్నీ దేవుడికి అర్పించారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏమీ లేని వారుగా భావించండి. అప్పుడే విధేయత సాధ్యమవుతుంది.

ఫకీరు నుంచి రాజకుమారిగా మారండి. ఎంతగా మీరు లేనివారుగా అవుతారో అంతగా సంపదలో తులతూగుతారు. లేనివారంటే ఆర్థికంగా చితికిపోవడమని కాదు. లేనివాడంటే మనసులో నాదంటూ ఏమీ లేదనే భావన. ఉన్నదంతా భగవంతుడిదే అనే భావన. నేను ఫకీరునన్న సంగతి స్ఫురణలోకి వచ్చినప్పుడు విధేయత వస్తుంది. 

ప్రతి ఆత్మా విశేషమైనదే. ప్రతి ఒక్కరూ విశేషమైన వారే. మీలోని విశేషతను తెలుసుకోండి. ఇతరులలోని విశేషాలను గుర్తించండి. దానిని ఈశ్వరీయ సేవలో వినియోగించండి. అప్పుడు మీ భవిష్యత్తు కూడా ఉన్నతంగా మారుతుంది.


మీరు ఇతరులను ఎలా చూస్తారో అలా తయారవుతారనేది సత్యం. ఒకవేళ మీరు ఇతరులలో విశేషతలు చూస్తున్నచో మీలోని విశేషాలు వృద్ధిలోకి వస్తాయి. ఎంతసేపు ఎదుటివారిలో లోపాలు, బలహీనతలు ఎత్తి చూపుతుంటే మీలో కూడా అవే లక్షణాలు పెరుగుతాయి. చెడును చూసేవారు పురుషార్థ హీనులవుతారు. అందువలన ఈ కళ్లతో ఇతరులలో చెడును చూడకండి. ఎందుకంటే ఆ కళ్ల ద్వారానే ఆ అలవాట్లు మీకు సంక్రమిస్తాయి. విధేయతతో కూడిన మనసు సాధ్యమయితే ఇతరుల్లో మంచిని గ్రహించే శక్తి వస్తుంది. అదే మీ జీవితాన్ని విజయతీరాలకు చేరుస్తుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)