యయాతి కథ మనకేం చెబుతోంది?
యయాతి
పాండవులకు పూర్వీకుడు. రాక్షస గురువు శుక్రచారువు శాపం వల్ల అతనికి యుక్త
వయస్సులోనే ముసలితనం వచ్చేస్తుంది. కానీ జీవితంలో ఎటువంటి కోర్కెలు తీరని యయాతి తన
కొడుకును యవ్వనం ఇవ్వమని ఒక వింత కోరిక కోరుతాడు.
అతను తన యవ్వనాన్ని యయాతికి
ధారబోస్తాడు. యయాతి రెట్టించిన యవ్వనాంధకారంతో కొన్ని వేల ఏళ్లు భోగలాలసుడై
కోర్కెలు తీర్చుకుంటాడు. ఒక కోరిక తర్వాత మరొకటి.. దాని తర్వాత ఇంకొకటి ఇలా
కోర్కెల జాబితా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత అతనికి తాను
చేస్తున్న తప్పు అర్థమవుతుంది. తానెంత కాలం ప్రయత్నించినా కోర్కెలు తీరవని ఒక దాని
తర్వాత మరొకటి వస్తూనే ఉంటుందని గ్రహిస్తాడు. తనకు సంప్రాప్తించిన వార్థక్యాన్ని
అనుభవించి ఉంటే తనకు మానసిక ఆనందం లభించి ఉండేదని తెలుసుకుంటాడు. దీంతో యవ్వనాన్ని
తిరిగి తన కుమారుడికి ఇచ్చేస్తాడు. భాగవత పురాణంలోని ఈ కథను మన ఆధునిక జీవితాలలో
అన్వయించుకుంటే అనేక సామ్యాలతో పాటుగా మనకు ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కార
మార్గాలు లభిస్తాయి.
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక
సమయంలో కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఏ పని చేసినా అడ్డం తిరుగుతూ ఉంటుంది. కొన్ని
పరాజయాలైతే చాలా ఇబ్బంది పెడతాయి. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఆశ చచ్చిపోయి
జీవితం తీవ్రమైన నిరాశలోకి జారుకుంటుంది. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఒడిదుడుకులు సామాన్యమైన విషయాలేనని నమ్మి జీవితాన్ని
పునఃప్రారంభించాలా? లేక వెనక్కి తగ్గి నిరాశతో బతకాలా? ఇక్కడ మనకు యయాతి కథ పనికొస్తుంది. యయాతి తన శాపాన్ని అనుభవించి
ఉంటే జీవితంలో అన్ని బాధలు పడేవాడు కాదు, ఇతరులను పెట్టేవాడు కాదు. అతని ఈగో
అతనికి ప్రధానమైన శత్రువుగా మారింది. తనకు ఎదురయిన పరిస్థితిని ఏదో ఒక విధంగా
అధిగమించాలనే లక్ష్యమే అతనికి ప్రధానంగా మారింది. ఇతర విషయాలన్నీ అప్రధానమైనవిగా
తోచాయి.
ఒకో కోరిక తీర్చుకుంటున్నప్పుడు
కలిగిన ఆనందం శాశ్వతమనే భ్రమలో మునిగిపోయాడు. ఎప్పటికైనా ఆ ఆనందపు మత్తు వెంట వస్తుందనుకున్నాడు.
కానీ ఆనందం ఒక శిఖరమైతే దాని పక్కనే ఒక లోయ ఉంటుందని.. అది అంతులేని విషాదాన్ని
మిగిలిస్తుందనే విషయాన్ని గమనించలేకపోయాడు. చాలా సార్లు మనలో చాలా మంది ఈ విధంగానే
ప్రవర్తిస్తారు. ఏదైనా నష్టం జరిగినప్పుడు ఈగో దెబ్బతింటుంది. దానికి వెన్న పూసి మసాజ్
చేసే ప్రయత్నంలో ఏదో ఒక విషయంలో విజయం సాధించాలనుకుంటారు. తమకు జరిగిన నష్టానికి..
తాము సాధించాలనుకుంటున్న విజయానికి మధ్య సాపేక్ష సంబంధం లేదనే విషయాన్ని గమనించరు.
విజయం సాధించటం ద్వారా వచ్చే క్షణభంగురమైన ఆనందం అతి విశ్వాసాన్ని కలగజేస్తుంది.
అయితే ఈ విజయపరంపర ఎక్కువ కాలం కొనసాగదు. ఇది ఆగిపోతే మళ్లీ తీవ్ర నిరాశలో
కూరుకుపోతారు. తమకు జరిగిన నష్టానికి రకరకాల కారణాలున్నాయని.. వాటన్నింటిపైన తమకు
పూర్తి అధికారం లేదనే విషయాన్ని గ్రహించగలిగితే ఇబ్బంది ఉండదు. తమకు జరిగిన నష్టం
జీవితంలో గుణపాఠం నేర్పు ఒక పాఠంగా భావించాలి. ఆ గుణపాఠం మనను మంచి మార్గంలో
ప్రయాణించేలా చేస్తుందని నమ్మాలి. ఈ విశ్వాసం వ్యక్తులపైనే ఉండాల్సిన అవసరం లేదు.
విలువలపై కూడా ఉండవచ్చు. సాపేక్షమైన కాలం, అభివృద్ధి మార్గంలో ప్రయాణించే
సమాజం వల్ల భౌతిక ప్రపంచంలో విలువలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అందువల్ల
ఎప్పటికీ శాశ్వతమైన ఆధ్యాత్మిక విలువలను నమ్మటం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది.
అందరికీ మేలు చేయటం, మానవ సేవే మాధవ సేవ, అన్ని పరిస్థితుల్లోను సానుకూల
దృక్పథంతో మెలగటం వంటి ఆధ్యాత్మిక విలువలను అన్ని మతాలు చెబుతూనే వస్తున్నాయి.
వీటిని పాటించినప్పుడు మన సమస్యలన్నింటికీ మార్గం లభిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి