ఉత్తమ సంస్కారానికి సాధనం భక్తి

సమాజంలో ఒకవైపు భక్తి విపరీతంగా పెరుగుతున్నా మరొకవైపు అశాంతి, అన్యాయం పెరుగుతున్నాయని చాలామంది బాధపడడం చూస్తుంటాం. దైవభక్తి కొంతవరకూ మనిషిని మంచిమార్గంలో పెడుతుందనీ, చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచుతుందనీ మన విశ్వాసం. అయినా పై విధమైన పరిస్థితికి కారణమేమిటి?

భాగవతం గొప్పదనాన్ని చెబుతూ ఒక కథ ఉంది. నారదుడు ఒకసారి భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక యౌవనంలో ఉన్న స్ర్తీ, ఆమెతో పాటే ఇద్దరు వృద్ధులు కనిపిస్తారు. ఆమె చాల దుఃఖిస్తూ ఉండగా అక్కడ గుమికూడి ఉన్నవారు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూంటారు. నారదుడు ఆమె దుఃఖానికి కారణమేమిటని అడిగాడట. ఆమె తన పేరు భక్తి అనీ, ఆ ఇద్దరు వృద్ధులూ తన పుత్రులనీ, వారి పేర్లు జ్ఞానము, వైరాగ్యమనీ చెబుతుంది. లోకంలో మనుషుల కోరికల కారణంగా భక్తికి ఎక్కువ ఆదరణ ఉంది కాని జ్ఞానాన్నీ, వైరాగ్యాన్నీ పట్టించుకునేవారు లేనందువల్ల భక్తి మాత్రం యౌవనంలో ఉంది. ఆమె కొడుకులిద్దరూ వృద్ధులయ్యారు. ఇది కలికాల ప్రభావం అని ఆమె చెబుతుంది. ఈ సమస్యకు పరిష్కారమేమిటి అని నారదుడు ఆలోచిస్తూ ఉండగా సనత్కుమారుడు ఆయనకు ఒక సూచన చేశాడట. భాగవతంలో వేదవ్యాసుడు భక్తినీ, జ్ఞానాన్నీ కొత్తశైలిలో అందించాడు. ఉపనిషత్తుల సారాన్నంతా అనేక భగవద్భక్తుల కథల రూపంలో అందించాడు. దాన్ని వింటే ఆ వృద్ధులకు మేలు కలుగుతుంది అన్నాడట. అది విని ఆ ముగ్గురూ భాగవతం ప్రవచనానికి వెళ్లారు. ఆ ప్రవచనం విన్న తర్వాత ఆ వృద్ధులు కూడా యౌవనాన్ని పొందారట.

ఈ కథలోని సందేశం సులభంగానే తెలుస్తోంది. దైవభక్తి మనిషికి వైరాగ్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత భగవంతుని స్వరూపమేమిటి అని విచారించే తెలివినీ, జ్ఞానాన్ని ఇస్తుంది. అందువల్లే భక్తిని తల్లి అన్నారు. మిగతా రెండింటినీ కొడుకులతో పోల్చారు. ఈ మూడింటికీ సమాన ఆదరణ ఉండాలి. మనిషికి కేవలం కోరికలపైనే ధ్యాస ఉన్నపుడు కోరికలు తీర్చే వ్యక్తిగా భగవంతుడ్ని వాడుకుంటాడే గానీ భగవంతుని స్వరూపమేమిటి అని విచారించే సంస్కారం ఉండదు.

నాలుగు రకాల వ్యక్తులు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మొదటిది కష్టాల్లో ఉన్నవాడు. రెండవది కష్టం లేకపోయినా కోరికలున్నవాడు. మూడవది జిజ్ఞాసువు, అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు. నాల్గవది జ్ఞాని. పురాణాల్లోని ఉదాహరణలు చూస్తే కుంతీదేవి, ద్రౌపది మొదటి రకానికి చెందినవారట. భాగవతంలో ధృవుడు రెండవ కోవకు చెందినవాడు. భగవంతుడి దర్శనమైన తర్వాత అతడు శాశ్వతమైన ఉన్నత స్థానాన్ని కోరుకుంటాడు. మూడవ కోవకు చెందిన వ్యక్తి భాగవతంలోని కృష్ణుడి మిత్రుడైన ఉద్ధవుడు మొదలైనవారు నిజమైన శ్రద్ధ ఉన్నవారు. జ్ఞాని భక్తుడికి ఉదాహరణ ప్రహ్లాదుడు.

ప్రస్తుత సమాజంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్లనే ఎక్కువగా చూస్తాం. దైవభక్తి ఇవ్వాల్సిన సంస్కారం మనకి కలగలేదన్నమాట. దేవుణ్ణి కేవలం మన లౌకిక లావాదేవీల్లో వాటాదారుడిగా పెట్టుకోవ డానికి ప్రయత్నిస్తాం. దేవుడికి ముడుపులు చెల్లించి మళ్ళీ కొత్తపాపాలు చేయవచ్చని భావిస్తాం కానీ దేవుడు ఇలాంటివాటిలో వాటాదారుడిగా ఉండడని భగవద్గీత (5-15) చెబుతుంది. దేవుడు మన పాపాన్ని గానీ పుణ్యాన్ని గానీ తీసుకునే వ్యకి్తర కాని చెప్పడానికి ఎంతో సాహసం అవసరం. వుతాలు మాుూలుగా మాూ దేవుడు పాపాలన్నీ తీసుకుంటాడని చెబుతాయి. అందుకు భిన్నంగా కృష్ణుడు ‘‘నా దత్తే కస్యచిత పాపం (5-15)’’ - దేవుడు ఎవరి పాపాలూ తీసుకోడు అంటాడు. ఒక వ్యక్తి తను చేసే ప్రతి పనికీ బాధ్యుడుగా ఉండాలని మన సిద్ధాంతం. మరి దేవుడెందుకు అంటే అతడు కేవలం మంచి బుద్ధిని కలిగిస్తాడు. ‘‘దదామి బుద్ధియోగం తం (10-10)’’ అంటే - అతనికి మంచి బుద్ధిని కలగజేస్తాను అంటాడు.

దీన్నే భగవద్గీతలో భక్తియోగం అనే పేరిట ఒక పూర్తి అధ్యాయంలో చెప్పారు. భక్తి అనేది ఒక యోగం. యోగం అంటే సాధనం. జ్ఞానానికి సాధనం. గీతలో ఒకానొక సందర్భంలో అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. కేవలం వేదాంతం తెలుసుకోవడం వల్ల మోక్షం కలుగుతుందా లేదా భక్తి వల్లనా అని. ఆ రెండూ సరైన మార్గాలే అని సమాధానం. ఒకరేమో చాలకష్టపడి మోక్షాన్ని పొందుతారు. మరొకర్ని నేనే స్వయంగా ఉద్ధరిస్తాను అంటాడు కృష్ణుడు. నిష్కామ కర్మ, ధ్యానం మొదలైనవాటితో మనస్సులోని కోరికలు, రాగద్వేషాలు తగ్గించుకున్న తర్వాత వేదాంతాన్ని తెలుసుకోవడమనేది మొదటి మార్గం. ఇది చాల శ్రమతో కూడినది. కోరికలు లేని దైవభక్తి రెండవ మార్గం. మన పూర్వీకులు ఈ రెండు మార్గాలకూ రెండు ఉపమానాలు చెప్పారు. మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో వచ్చేవాడి ధోరణి ఇది. రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో వచ్చేవాడి స్థితి ఇది.

మనం దేవుణ్ణి మన కోరికలు తీర్చుకునే సాధనంగా ఎందుకు భావిస్తున్నాం అంటే కొంతవరకూ మతపెద్దలు, ధర్మాన్ని బోధించేవాళ్లు కూడా కారణమని చెప్పవచ్చు. కేవలం వ్రతాలు, పూజలు, యజ్ఞాలు మాత్రమే చేస్తూ ఇతరులతో కూడా వాటినే చేయిస్తూ విషయాన్ని బోధించకపోవడం వల్ల మనకు ధర్మం యొక్క సమగ్ర స్వరూపం తెలిసే అవకాశం లేదు. ఈ సందర్భంలో వేదవ్యాసుడి ఉదాహరణే తీసుకోవచ్చు. వేదాల్ని విభజించి, యజ్ఞాలు మొదలైన వాటి వ్యవస్థ చేసిన తర్వాత కూడా ఆయనకు మనశ్శాంతి కలగలేదట. దానికి కారణమేమిటి అని విచారంలో ఉండగా భగవంతుడి తత్త్వాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందించకపోవడమే కారణమని నారదుడు చెప్పడం, అతడు భాగవతాన్ని వ్రాయడం జరిగింది.

భక్తి యొక్క సమగ్ర స్వరూపాన్ని విశ్లేషించిన పుస్తకాలు మనకు చాల ఉన్నాయి. ఇందులో నారదభక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు అనేవి ముఖ్యమైనవి. భక్తిని అనేక కోణాల నుంచి పరిశీలించిన ఈ గ్రంథాలు ప్రపంచ భక్తి సాహిత్యంలోనే సాటిలేనివి.
  
- డాక్టర్‌ కె. అరవిందరావు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)