భగవద్గీత రాజవిద్య
విద్య మనిషిని పూర్ణుడిగా మారుస్తుంది. విద్య అనే పదంలో
సిద్ధాంత పరమైనది, ప్రయోగాత్మకమైనది
అనే రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రయోగాత్మకం కానట్టి విద్య వల్ల ఎలాంటి లాభమూ
ఉండదు. మానవులతో పోలిస్తే జంతువుల సంఖ్య అనేక రెట్లు అధికం. అయినా అవన్నీ తమ
నిత్యావసరాలను కేవలం ప్రకృతి మీద ఆధారపడి పొందుతున్నాయి. కాని వాటిలో సంస్కృతి అనే
పదం ఉండదు. దానికి కారణం వాటికి విద్య లేకపోవడమే. నిజానికి విద్య వాటి జీవితాలలో
సాధ్యమే కాదు. అందుకే విద్య లేనివాడిని వింత పశువుగా అభివర్ణించారు.
విద్యను నేర్పించడానికి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ మానవ నాగరికతను
పురోగమింపజేయడానికి ఏర్పర్చినవే. కాని, ఈ విద్యాసంస్థలు బోధించే వాటిలో ఏ విద్య
ఉత్తమమైనదో ఎవరు చెప్పగలరు..? భగవద్గీతలో
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో మాట్లాడుతూ తాను చెబుతున్న విద్య రాజవిద్య అని
ప్రకటించాడు. దేశంలో ఒక వ్యక్తిని రాజు అని పిలిస్తే మిగిలిన జనులందరినీ ప్రజలు
అని ఎందుకు పిలుస్తారు? రాజు
తన ప్రజల దైహిక, మానసిక,
సాంఘిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక అవసరాలన్నింటినీ తీరుస్తాడు.
వారందరినీ కంటికి రెప్పలా కాపాడుతాడు. ఏదైనా కష్టం వస్తే ప్రజలంతా రాజునే శరణు
వేడుతారు. అందుకే రాజును ప్రజలు తమ తండ్రిగా భావిస్తారు. అంతేకాదు, శాస్త్రాలలో కూడా రాజును భగవంతుడి ప్రతినిధిగా
అభివర్ణించారు. అంటే దేశప్రజల అవసరాలను తీర్చడానికి రాజు అసాధారణమైన గుణాలను,
శక్తిని కలిగి ఉంటాడని అర్థం. అదేవిధంగా భగవద్గీత
ఎలాంటి విద్య అంటే.. అది మనిషి శారీరక, మానసిక, బుద్ధిపరమైన, ఆత్మపరమైన అవసరాలన్నింటినీ తీరుస్తుంది.
సాధారణంగా ఏ విద్యయైునా ఒకానొక జ్ఞానాన్ని అందించడానికి ఉద్దేశించినదై ఉంటుంది.
దానిని బుద్ధి గ్రహిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనిషి తనను తాను పోషించుకోగలుగుతాడు,
రక్షించుకోగలుగుతాడు. ఆ విధంగా ఏ విద్యయైునా
మనిషికి సంబంధించిన ఒకట్రెండు అవసరాలను తీరుస్తుంది. కాని గీత (రాజవిద్య) మనిషి
సకల అవసరాలను నెరవేరుస్తుంది. రాజవిద్య అయిన గీతను తాను సిద్ధాంత పరంగా, ప్రయోగాత్మకంగా కూడా చెబుతున్నట్టు అర్జునుడికి
వెల్లడించాడు కృష్ణుడు. రాజవిద్య అయిన గీతను అసూయారహితులు మాత్రమే అర్థం
చేసుకోగలరు. రాజాశ్రయం సంపూర్ణ రక్షణను కూర్చినట్లుగానే, భగవద్గీత ఆశ్రయం కూడా భౌతిక జగత్తులోని సకల చెడు
ప్రభావాల నుంచి మనిషిని రక్షిస్తుంది.
ప్రతి మనిషికీ ఇంకొకరి రహస్యాలు తెలుసుకోవాలనే
ఉత్సాహం ఉంటుంది. ప్రకృతి రహస్యాలను తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయత్నాలు
చేస్తూనే ఉన్నారు. కొన్ని నిష్ఫలంగా, మరికొన్ని అసంపూర్తిగా ఉండిపోతాయి. ఇక భగవంతుని
అస్తిత్వానికి సంబంధించి నాస్తికులకు ఆ విషయం ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుంది.
గీతను రాజరహస్యంగా కూడా అభివర్ణించాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాలం, కర్మ. ఈ ఐదింటికి సంబంధించిన సమస్త రహస్యాలు
భగవద్గీతలో వెల్లడవుతాయి.
జీవుడు, ప్రకృతికి సంబంధించి అనంతకాలంగా ఉన్న రహస్యాలు
గీతను శ్రద్ధగా అధ్యయనం చేస్తే తేటతెల్లం అవుతాయి. జీవుడు, ప్రకృతి మధ్య సంబంధం కూడా గీతలో కనిపిస్తుంది.
జీవుడు, ప్రకృతి
సంబంధం ఎరుకకు రాగానే అది భగవంతుని అస్తిత్వానికి సంబంధించిన విచారణను
కలిగిస్తుంది. కృష్ణునికి సంబంధించిన రహస్యం చాలా గంభీరమైనదని భగవద్గీత
చెబుతున్నది. దానిలో మూడు అంచెలున్నాయి. అన్ని అంచెల రహస్యాలు అందరికీ తెలియవు.
భగవంతుని సర్వవ్యాపక రూపం రహస్య జ్ఞానముగా చెప్పబడింది. హృదయంలో ఉండే పరమాత్మ రూపం
రహస్యతరమైన జ్ఞానంగా చెప్పబడింది. ఇక వేణువును ఊదుతూ బృందావనంలో విహరించే
కృష్ణరూపం రహస్యతమజ్ఞానంగా, అంటే
పరమ రహస్య జ్ఞానంగా చెప్పబడింది. గీతలో స్పష్టంగా వివరించిన ఈ విషయం అందరి
హృదయాలలో చేరితే లోకమంతా పరమ ఆనందమయంగా మారిపోతుంది. ఇది కేవలం భక్తులకే అర్థం
అవుతుంది. మొదటి రహస్యం జ్ఞానులకు, రెండో
రహస్యం యోగులకు అర్థమవుతాయి. ఎవరైతే శ్యామసుందరుడైన శ్రీకృష్ణుని తత్త్వతః
తెలుసుకొన్నారో వారికి పరమ రహస్య జ్ఞానం అర్థమైందని తెలుసుకోవాలి.
సాధారణంగా జనులు నిరాకార భావన ఉన్నతమైనదని,
రూపరహితుతుడైన భగవంతుడని పూజించడం అల్పమైన
రహస్యమని భావిస్తారు. కాని భగవద్గీత చెప్పే విషయం వీరి భావనకు పూర్తిగా భిన్నం.
సర్వవ్యాపక నిరాకార తత్త్వం రహస్యమని, ద్విభుజ శ్యామసుందర రూపం పరమ రహస్యమని భగవద్గీత
నిర్ద్వంద్వంగా చెప్పేసింది. అందుకే గీత రాజరహస్యంగా అయింది. కాబట్టి రాజవిద్య,
రాజరహస్యమైనట్టి భగవద్గీత ద్వారా మనిషి సకల
విద్యలను నేర్చుకొన్నవాడు, సకల
రహస్యాలను తెలుసుకున్నవాడుగా మారి జీవితంలోని అన్ని రంగాల్లో విజేత అవుతాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి