ఆశ

చారెడు నీళ్లు పోస్తే మొక్క సంతోషపడుతుంది. కాస్తంత పత్రి నెత్తిన ఉంచితే శివుడు తృప్తిపడతాడని పురాణగాథలు చెబుతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా అన్నింటికీ ఆశే ప్రాణాధారం. 

ఆశ మితిమీరితే అత్యాశగా మారుతుంది. 

మనిషి ఆశాజీవి. నిరాశ ఉంటే, జీవనయానం సాగదు. ఆశే అతడిని ముందుకు నడిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఆశ అధికంగా ఉండటం మంచిదే! విద్యాకాంక్ష ఎక్కువగా ఉండటం తప్పు కాదు. ఉన్నతోద్యోగం సంపాదించాలనుకోవడం దోషం కాదు. అలాంటి ఆశయాలు ఎప్పుడూ మంచివే. నిజాయతీపరుడిగా పేరు తెచ్చుకోవాలనుకోవడం, కళాకారుడిగా ప్రఖ్యాతి కోరుకోవడం- ఇవన్నీ కేవలం ఆశలు కావు. ఉన్నతమైన ఆశయాలు. అవి సదా స్వాగతించదగినవే! 

ఆశాజీవుల్లో మొదట చెప్పదగినవాడు- రైతు. సకాలంలో తగినంత వర్షం కురిసి, పంటలు బాగా పండాలని అతడు ఆశిస్తాడు. వర్షాభావం ఏర్పడితే, ఆ ఆశ నిరాశగా మారిపోతుంది. వేసిన విత్తులు సైతం చేతికి రావు. రెండో పంటకు ప్రయత్నిస్తాడు. ఏ కొంచెం పండినా తృప్తిపడతాడు. అంతేకాక, మరుసటి సంవత్సరంపైనా రైతు ఆశ పెట్టుకుంటాడు. ఒకవేళ తలకు మించిన అప్పులు చేస్తే, పరిస్థితి పూర్తిగా తలకిందులు కాక తప్పదు. 

ఆశకు, అత్యాశకు మధ్య ఉన్న అంతరం, వాటి అంతరార్థం తెలిసిన వారికి జీవితంలో చీకూ చింతా ఉండదు. ప్రపంచ విజేతలు కావాలని నానారకాలుగా ప్రయత్నించి వైఫల్యం చెందినవారు నైరాశ్యంతో మృతిచెందిన ఘట్టాలు చరిత్రలో ఉన్నాయి. అమిత భోజనంలా అత్యాశ కూడా మనిషికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. 

ఆశకు అంతం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం భాగవతంలో లభిస్తుంది. వామనావతారంలోని విష్ణుమూర్తి యాచన పేరుతో బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు. ఏం కావాలో కోరుకోఅని అడిగాడు బలి. మూడు అడుగుల నేల ఇవ్వుఅని కోరాడు వామనుడు. ఇంత చిన్న కోరికా? ఏదైనా పెద్దది కోరుకో, ఇస్తాఅన్నాడు బలి. నాకు ఆ మూడు అడుగులే చాలు. ఈ సమస్త భూమినీ ఇచ్చినా, ఆశపోతు తృప్తి చెందడు. ఎందుకంటే, ఆశకు అంతం లేదుఅని వామనుడు తేల్చిచెప్పాడు. భాగవతం చేస్తున్న హితబోధ అది! 

లోభితనం నుంచే అత్యాశఅనే దుర్గుణం పుడుతుంది. అది త్యాగం అనే సద్గుణాన్ని క్షీణింపజేస్తుంది. ఆశాపాశం అంతకంతకు పెరిగిపోతుంటుంది. అది ఎంత పెరిగితే, త్యాగగుణం అంత తరుగుతుంది. ఆశలు పుష్పాల్లా సుగంధాలు వెదజల్లుతాయి. దురాశలు దుర్గంధాల్లా మారి, చుట్టుపక్కలవారికీ ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. త్యాగగుణం ఎక్కడుంటే అక్కడ అందం, ఆనందం వెల్లివిరుస్తాయి. సొంత లాభం కొంత మానుకొని, పొరుగువారికి తోడుపడాలని కవికోకిలలు చేసే గానంలో ఉన్న భావం అదే! 

దురాశతో కరడుకట్టిన మనిషి ఇనుపముక్కలా ఉంటాడు. ఇనుము తుప్పు పడుతుంది. కొంతకాలానికి ఎందుకూ కొరగాకుండా పోతుంది. అదే అయస్కాంతంలా మారితే? లోపలికి ఓ శక్తి ప్రవేశిస్తుంది. ఆకర్షణ తెస్తుంది. అత్యాశ ఉన్న మనిషి ఇతరులకు ఉపయోగపడడు. చివరికి తనకు తానే కొరగాకుండాపోతాడు. పనికిరాని ఇనుపముక్కపై దుమ్ము చేరినట్లు, దురాశాపరుడి చుట్టూ వ్యర్థజీవులు చేరతారు. త్యాగబుద్ధి గలవారు అయస్కాంతంలా ఆకర్షిస్తారు. 

రాపిడితో ఇనుపముక్క సైతం అయస్కాంతంలా మారుతుంది. త్యాగశీలురైనవారి సాంగత్యంతో, అత్యాశాపరుల్లో మార్పు వస్తుంది. కరడుకట్టినవారూ దురాశను వీడి, చివరికి నిస్వార్థపరులుగా మారతారు. పరోపకార పరాయణులు అవుతారు. సమాజంలో ఎక్కడ ఉన్నా, వారి సదాశయాలు అందర్నీ సదా ఆకర్షిస్తూనే ఉంటాయి! 

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!