అందరికీ మోక్షం!‏

చ్చని వనాలు, పెద్దపెద్ద చెట్లు, వాటిపై వాలిన పక్షులు, ఇంకా పైన తిరిగే మేఘాలు, రాత్రివేళ తళతళ మెరిసే నక్షత్రాలు... చూస్తుంటే మనసు తెలియని ఆనందంతో నిండి పరవశించిపోతుంది. మొత్తం సృష్టి అంతా ఆనందం నిండి ఉంటుంది.

ఏ కారణం లేకుండానే చెట్లు సంతోషంగా కాలం గడుపుతాయి. అవి తపస్సు చెయ్యవు. మోక్షం అడగవు. పైగా పూలను, పండ్లను మానవాళికి, దైవానికి సమర్పించి తరించిపోతాయి. పక్షులు ఉన్నదాంతో తృప్తిచెంది, హాయిగా కిలకిలారావాలు చేస్తాయి. మనసును రంజింపజేస్తాయి. అవి మనిషినికాని, భగవంతుణ్నికాని తమకు ఏదో కావాలని ఎప్పుడూ అడగవు. ఎదురుచూడవు. భూకంపాలు, తుపానులు వస్తే మనుషులు భయంతో వణికిపోతారు. అన్నీ పోగొట్టుకొని దుఃఖిస్తారు. అదే పక్షులు, చెట్లు- కొద్దిరోజుల విరామం తరవాత, తిరిగి తమ త్యాగజీవనం ప్రారంభిస్తాయి.

మోక్షం కోసం తపస్సు చేసిన పలువురు భక్తుల కోరిక తీర్చాడు భగవంతుడు. ధర్మవర్తనకు నిలువెత్తు రూపుగా విలసిల్లిన శ్రీరాముడి కారుణ్యం అపారమైంది. అది అనిర్వచనీయం. ఆయన దండకారణ్యంలో సంచరించినప్పుడు- అక్కడ తపస్సు చేసుకొంటున్న రుషులకు, ఇతరులకు అడగకుండానే మోక్షప్రాప్తి కలిగించాడు. అంతేకాదు- ఏమీ కోరని వృక్షాలకు, మృగాలకు కూడా మోక్షమిచ్చాడు. దండకారణ్యంలోని రంగురంగుల పక్షులకూ ఆయన మోక్షం ప్రసాదించాడు. అవి కోరకున్నా, రాముడు వాటికి మోక్షదాతగా నిలిచాడు. ఆయన దయ అటువంటిది.

భగవంతుడి ప్రియభక్తులతో కలిసిమెలిసి ఉంటే, ఇతర ప్రాణులకూ మోక్షం లభిస్తుం దంటారు. ఒకసారి ఒక భక్తుడు రంగనాథుణ్ని అమిత భక్తితో ప్రార్థించాడు. అతడి ప్రార్థనలకు సంతుష్టుడైన రంగనాథుడు ఏం కావాలి నీకుఅని అడిగాడు. నాకు మోక్షం ప్రసాదించుఅని భక్తుడు వేడుకొన్నాడు. అతడు అడగకున్నా, రంగనాథుడు మరో వరమిచ్చాడు. ఆ భక్తుడు తన తోటలో చూసే అన్ని వృక్షాలు, కీటకాలు, ఇతర ప్రాణులకు మోక్షం లభించేలా స్వామి అనుగ్రహించాడు. అత్యంత అపూర్వమైన వరం అది. తోటలో ఏం చేస్తున్నాడో చూడటానికి భక్తుడి భార్య వెళ్లింది. నేను ఎవరిని చూస్తే వారికి మోక్షం వస్తుందని నా స్వామి నాకు వరమిచ్చాడు. అందువల్ల సాధ్యమైనంతవరకు ఈ తోటలోని అన్ని చెట్లు, కీటకాలు, జంతువులు, ఇతర ప్రాణుల్ని చూస్తున్నానుఅని ఆ భక్తుడు ఆమెకు వివరించాడు.

భగవంతుడే కాదు, ఆయన ప్రియభక్తులు కూడా అంతటి దయామయులే! 


భగవంతుడు నేరుగా ప్రసాదించలేని వరాలను భక్తులు అడిగితే ఏం జరుగుతుంది? అటువంటి ఒక వరాన్ని దండకారణ్యంలోని ఋషులు శ్రీరాముణ్ని అడిగారు. రామా! నువ్వు అతిలోక సౌందర్యమూర్తివి. స్త్రీలుగా మారి నిన్ను కౌగిలించుకోవాలని ఉందిఅని వారు కోరారు. ఏకపత్నీవ్రతుడైన ఆయన ఆ వరం ఇవ్వలేదు. రానున్న యుగంలో తాను కృష్ణుడిగా అవతరిస్తానని, మీరందరూ (రుషులు) గోపికలుగా వచ్చినప్పుడు కోరిక నెరవేరేలా చేస్తానని రాముడు వరం అనుగ్రహించాడు.


ఋషుల కోరిక కృష్ణావతార సమయంలో నెరవేరింది. ఆయన దివ్య రస సంయోగ అనుభూతితో వారు ప్రతిక్షణం మోక్షానందాన్ని అనుభవించారు!
- కె.యజ్ఞన్న

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)