అతిథి

తిథి, వార, నక్షత్రాలతో ప్రమేయం లేకుండా గృహస్థుల ఇంటికి వచ్చే వ్యక్తిని అతిథి అంటారు. ఆ అతిథి దైవంతో సమానమని తైత్తిరీయ ఉపనిషత్తుచెబుతోంది. ఇంటికి వచ్చిన వ్యక్తి కులం, విద్య, ఉద్యోగం వంటి ఇతర విషయాలపై దృష్టి సారించరాదని; విష్ణుమూర్తి అవతారంగా భావించి సంతోషంతో సేవచేయాలని మారన రాసిన మార్కండేయ పురాణంవిశదీకరించింది.

అతిథికి గృహస్థులు చేయాల్సిన సత్కారం గురించి కఠోపనిషత్తుచెబుతోంది. ఒకరోజు యమధర్మరాజు మందిరానికి నచికేతుడు అనే బ్రహ్మచారి వెళ్లాడు. అప్పుడు అక్కడ యముడు లేడు. ఆయన కోసం నచికేతుడు మూడు రోజులపాటు ఆహారం లేకుండా వేచిచూశాడు. ఆ తరవాత వచ్చిన యముడు అతడి వివరాలు తెలుసుకొని అతిథి సత్కారం చేశాడు. స్వామీ! మీరు మా అతిథి. నేను గృహంలో లేకపోవడం వల్ల, అతిథి సత్కారాలు చేయలేకపోయాను. మీరు ఇక్కడే మూడురోజులు ఉండిపోవాల్సి వచ్చింది. దోష నివారణగా మీకు మూడు వరాలిస్తాను. రోజుకు ఒకటి వంతున కోరుకోండిఅంటాడు వినయంగా.

అంతేకాదు- అతిథిగా వచ్చిన వ్యక్తి ఎవరి ఇంటి వద్ద వేచి చూస్తుంటాడో, భోజనమైనా చేయకుండా అక్కడే ఉండిపోతాడో ఆ ఇంట అనర్థాలు తప్పవంటాడు యమధర్మరాజు.

మనుషులు దానగుణం కలిగి ఉండాలని బృహదారణ్యకోపనిషత్‌బోధిస్తోంది. అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనది. అన్ని జీవులూ అన్నం వల్లనే మనగలుగుతున్నాయి. అందువల్ల, అన్నదాతే ప్రాణదాత.

దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న కుచేలుడు- తన భార్య సూచన ప్రకారం శ్రీకృష్ణుడి ఇంటికి వెళతాడు. ఆ బాల్యమిత్రుణ్ని ఆయన ఆదరంగా ఆహ్వానిస్తాడు. ఆసనంపై కూర్చోబెట్టి, కుశల ప్రశ్నలు వేసి, కుచేలుడు తన కోసం తెచ్చిన అటుకుల్ని అభిమానపూర్వకంగా స్వీకరిస్తాడు. మిత్రుడు ఏదీ కోరకుండానే, అతడి కష్టాలన్నింటినీ తీరుస్తాడు కృష్ణుడు. ఆయన ఔదార్యం, అతిథి సేవాగుణం ఆతిథ్యమిచ్చేవారందరికీ ఆదర్శప్రాయాలు.

మహాభారతంలో- పాండవుల తరఫున రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు అక్కడ దుర్యోధనుణ్ని కాదని, తన హితుడైన విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ తరవాత దుర్యోధనుడితో కృష్ణుడు భోజన విషయమే అడుగుతున్నావు తప్ప, విదురుడి ఆదరణ గురించి ఎందుకు అడగవు దుర్యోధనాఅని ప్రశ్నిస్తాడు. భోజనం- జీర్ణమైన అనంతరం కనిపించదు. పొందిన ఆదరణే శాశ్వతంగా గుర్తుంటుందని అతడికి హితబోధ చేస్తాడు.

ఆత్మీయమైన చిరునవ్వు, ప్రేమతో నిండిన స్పర్శ, సాటివారి పట్ల దయ- ఇవన్నీ భగవంతుడి రూపాలే! అతిథులుగా వెళ్లేవారికి, వారిని ఆహ్వానించేవారికి ఇవి అన్నివేళలా ఆచరణీయాలు. శబరి ఆతిథ్యంలో శ్రీరాముడు తాదాత్మ్యం పొందడానికి ఆమె భక్తితత్పరతే కారణం.

గాంధీజీ ఆశయాలకు ప్రభావితుడైన మార్టిన్‌ లూథర్‌కింగ్‌, భారత్‌కు వచ్చినప్పుడు పలు అనుభవాలు పొందారు. ఇతర దేశాలకు నేను యాత్రికుడిగానే వెళ్లాను కానీ, భారత్‌లో మాత్రం- అత్యంత సన్నిహితమైన అతిథినిఅనే భావం కలిగింది. బాపూజీకి జన్మనిచ్చిన దేశం ఇది. నాకు పరాయి దేశంగా అనిపించలేదు. ఆ జీవన విధానంలో, ఆతిథ్యం పొందడంలో ఏదో తెలియని సంతృప్తి కలిగిందిఅన్నారాయన.

నీ వద్దకు ఎవరు వచ్చినా, వారు ఎంతటి తక్కువ స్థితిలో ఉన్నా ఆదరించు. ఉన్నత స్థితిలోనివారితో ఎంత మర్యాదగా ఉంటావో, పేదవారితోనూ అలాగే వ్యవహరించు. ఏ దేవతలు ఎప్పుడు ఏ రూపాల్లో నీ వద్దకు వస్తారో నీకేం తెలుసుఅంటుంది బైబిల్‌. అందుకే అతిథిని దైవభావంతో సేవించాలి. బాగా ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టాలే తప్ప, ‘అన్నసూక్తంపారాయణ చేస్తే లాభం ఉండదు. అతిథి అవసరాన్ని గుర్తించి సత్కారం చేస్తే, ఆ అంతర్యామి ఆనందిస్తాడు.
- విశ్వనాథ రమ


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)