మట్టికుండ

మట్టికుండ

సనాతన ధర్మమే జాతీయత

by 2:40:00 AM 0 comments
రాజకీయాలను ఆధ్యాత్మికం చేసి, జాతీయవాదాన్ని మత సిద్ధాంతంగా మార్చిన ఆధ్యాత్మిక రాజకీయ పీఠాధిపతి శ్రీ అరవిందులు. స్వాతంత్య్రం సిద్ధించే శుభ సమయాన ఆలిండియా రేడియో తిరుచునాపల్లి కేంద్రం వారి కోరిక మేరకు వారిచ్చిన సందేశం 1947 ఆగష్టు 14న ప్రసారమైంది. అందులో ఒక పాతయుగం ముగిసింది. నూతన యుగం ఆరంభమైంది. మన జీవనవిధానం, మన కార్యాచరణ వల్ల మనను ఒక స్వతంత్ర జాతిగా నిలబడింది. భవిష్యత్తులో రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక ప్రపంచానికి నాంది పలికిన శుభదినంగా చరిత్రలో నిలిచిపోగలదని చెబుతూ భారతదేశం గురించి, మానవజాతి భవితవ్యం గురించి ఆయన మనసులోని మాటను వెల్లడించారు. 

‘‘మన దేశం స్వదేశీ స్వరాజ్యంగా మనగలగాలి. మనదైన దానికి తిరిగి రావటమే రాజకీయోద్యమ ముఖ్య లక్షణం. మన ప్రాచీన జాతీయ వ్యక్తిత్వాన్ని తిరిగి పొందటం కూడా దీనిలో భాగమే. భారతజాతి ఆధ్యాత్మిక సంపదతో వర్ధిల్లుతోంది. ఆధ్యాత్మిక ఐక్యత సాధించగలిగినపుడే మానవజాతి పరమోన్నత జీవనస్థాయిని చేరుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న ఏ జాతి అయినా ఏదో ఒక పార్శ్వానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆత్మపరంగా జ్ఞాన సంపదను తిరిగి పొందాలి. భారతీయస్ఫూర్తి వెలుగులో ఆధునిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మికతతో వెలిగే సమాజంలో మరింత సమన్వయం సాధించడానికి కృషి జరగాలి. 
భారతదేశంలోని ప్రతి ఒక్కరూ తనలోని దైవాన్ని మేల్కొలపగలిగితే మనజాతి సమస్తం సర్వశక్తివంతం కాగలదు. భారతదేశం తన భవితవ్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే భారతదేశం గానే మిగలాలి. తన నాగరికతను భారతావనిపై రుద్దటం వలన పాశ్చాత్య దేశాలు పొందే లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల నాగరికతలో ఉన్న అనర్థాలను నివారించగలిగే భారతదేశమే ఆ జాడ్యపు కోరల్లో చిక్కుకుపోతే, ఆ వ్యాధి నివారణ సాధ్యం కాదు.

భారతస్వాతంత్య్రం సమస్త మానవజాతికి దారి చూపే వెలుగురేఖ. భారతదేశం అభివృద్ధి చెందుతున్నదంటే సనాతన ధర్మం వృద్ధిలోకి వస్తుందని అర్థం. సనాతన ధర్మం అంటే జీవితమే. జాతీయత అంటే ఆచారం, మతం, విశ్వాసం కాదు. సనాతనధర్మమే మన జాతీయత. భారతావని పునరుజ్జీవమైన ప్రపంచంలో తనకు నిర్దేశించిన కార్యాన్ని సాధించాలంటే ఈ దేశంలోని యువత ప్రయోజనాత్మకంగా ఆలోచించటం నేర్చుకోవాలి. భారతీయ భావన, భారతీయ స్వభావం, భారతీయ దర్శనాలు, భారతీయ శక్తి, భారతీయ ఔన్నత్యం వీటిని తిరిగి సంపాదించి భారతీయతత్వం ప్రకారం, భారతీయ దృక్పథంతో ప్రపంచాన్ని కలవరపెట్టే సమస్యలను పరిష్కరించాలని’’ గురు అరవిందులు ఆకాంక్షించారు.

- శ్రీమతి సునీతశేఖర్‌

Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి