కాలం విలువ

విశ్వం అనంతమైనది. కాలమూ అంతే! క్షణం క్షణం, కణం కణంఅని సూక్తి. మనిషి ప్రతి క్షణాన్నీ ఉపయోగించుకోవాలని, ప్రతి కణాన్నీ పోగుచేసుకోవాలని దీని భావం. కాలం గాలానికి ప్రతి ప్రాణీ తగలక తప్పదు. కాలం కలిసిరానప్పుడు, భీముడంతటి బలశాలీ కొన్నేళ్లు వంటవాడిగా ఉండాల్సి వచ్చింది. రాకుమారుడైన శ్రీరాముడు కారణాంతరాల వల్ల అడవులపాలు కావాల్సి వచ్చింది.

ఏదోవిధంగా కాలం గడపటం వివేకవంతులు చేయాల్సిన పని కాదు. అనేక సంపదలు లభించి ఉండవచ్చు. లేదా పేదరికం తాండవం చేస్తుండవచ్చు. వాటినే తలుస్తూ ఉండిపోవడం కంటే, తన పని తాను నిర్వర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారికి జీవితంలో ఎన్నడూ అసంతృప్తి ఉండదు. అదే- శ్రమజీవుల ఆనందం వెనక ఉన్న రహస్యం!

ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు. కాలం ఆనంద కారకం. విపరీతమైన కోరికలు మనిషి కాలాన్ని ఎక్కువగా హరిస్తుంటాయి. కేవలం ధనసంపాదన కోసమే ఆరాటపడేవారికి చివరికి అసంతృప్తే మిగులుతుంది.

కొందరిలో అనేక కోరికలు ఉంటాయి. మంచిపని చేయాలన్న కోరిక మనసులో ఉండగానే సరిపోదు. దాన్ని ఆచరణలో పెట్టాలి. రేపు చేద్దామనుకున్న మంచిపని ఈరోజే చెయ్యి. ఈరోజు చేద్దామనుకున్న మంచిపని ఇప్పుడే చెయ్యి. ఎందుకంటే, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదుఅనేవారు భక్త కబీర్‌దాస్‌.

కాలం అనే సంపద అందరిదీ! దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే తారతమ్యా లుంటాయి. కర్తవ్య నిర్వహణలో దక్షులైనవారికి ప్రతి క్షణమూ విలువైనదే. సోమరుల విశ్రాంతికి ఎంతకాలమైనా సరిపోదు!

ఎంత ధనవంతుడైనా, ఎంత సొమ్ము రాశి పోసినా ఒక్క క్షణకాలమైనా కొనలేడు. తన వెంట తెచ్చుకోలేడు. అలెగ్జాండర్‌ ప్రపంచ విజేత కావాలనుకున్నాడు. భారత్‌ వరకు రాగలిగాడు. తిరిగి తన దేశానికి ప్రయాణ మయ్యాడు. మార్గమధ్యంలో జబ్బుపడ్డాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని తగ్గించలేకపోయారు. అతడికి ఘడియలు దగ్గర పడ్డాయి. అంతటి విశ్వవిజేత’- వైద్యుల కాళ్లావేళ్లా పడి ప్రార్థించాడు. త్వరలోనే నా దేశానికి చేరుకుంటాను. అంతవరకు నా ప్రాణాలు నిలపండి. మా అమ్మను చూసిన తరవాత చనిపోతాను. కావాలంటే నా సంపద అంతా మీరే తీసుకోండి!అని ప్రాధేయపడ్డాడు. చివరికి, తన కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచాడు. ఎంత చక్రవర్తి అయినా, ఒక్క క్షణాన్ని సైతం నిలువరించలేడు. సంపద, సమయం- ఈ రెండింటిలో ఏది ఎక్కువ విలువైనదో దీన్నిబట్టి స్పష్టమవుతుంది.

ధనం పోగొట్టుకుని కూడా, మళ్లీ దాన్ని సంపాదించుకున్నవాళ్లు ఎందరో కనిపిస్తారు. గడచిన కాలాన్ని వెనక్కి తెచ్చినవాళ్లు ఒక్కరైనా కనిపించరు. ధీమంతులు కాలం విలువ తెలుసుకుని వ్యవహరిస్తారు.

మేధావులు రానున్న కాలమాన పరిస్థితుల్ని వూహించగలరు. చరిత్ర అంటే, గడచిన సంఘటనల్ని నెమరు వేసుకోవడం. గత అనుభవాల ఆధారంగానే, భవిష్యత్తులో ఎలా ఉండాలన్నది మనిషి నిర్ణయించుకోగలడు. రానున్న కాలం కంటే గత కాలమే మేలుఅని కొందరు భావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అదే నిజంఅనిపించవచ్చు. భవిష్యత్తుపై ఆశ లేనిదే ఏ మనిషీ ముందుకు సాగలేడు. కాలానికి ఉన్నవి కాళ్లు కావు- రెక్కలు! అందువల్ల కాలం నడవదు. అది ఎగిరిపోతుంటుంది. దాంతో సమానంగా ఎగిరే శక్తి ఎవరికీ ఉండదు. ఆధునిక మానవుడు రెక్కలు కట్టుకొని, కాలంతో పోటీపడి ఎగరాలని ప్రయత్నిస్తున్నాడు.

ప్రశాంత జీవనానికి దూరమవుతున్న మనిషి కాస్తంత ధ్యానానికి, మౌనానికి, మానసిక ఆనందానికి సైతం నోచుకోలేకపోతున్నాడు. అతడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే, చిత్తశాంతిని దూరం చేసుకోవడం కాదు... ఒక్క క్షణమైనా వృథా చేయకపోవడం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)