మట్టికుండ

మట్టికుండ

తల్లిదండ్రులదే బాధ్యత

by 2:44:00 AM 0 comments
చదువు, సంస్కారం ఈ పదాలను మనం కలిపి వాడుతుంటాం. చదువు సంస్కారాన్ని ఇస్తుందని అర్థం. సంస్కారం అంటే మంచి నడవడిక అనే అర్థంలో వాడుతాం. నిజానికి సంస్కారం అనేది ఒక తటస్థ (neutra) పదం. సంస్కారం మంచిది కావచ్చు, చెడ్డదీ కావచ్చు. 

జీవితంలోని ప్రతి అనుభవం మనసులో ఒక్కో ముద్ర వేస్తుంది. పత్రికలో ఒక వ్యాసం చదివినపుడు, టీవీలో ఒక కార్యక్రమం చూసినపుడు లేదా ఒక వ్యక్తితో సంభాషించినపుడు ఆ విషయంపై లేదా ఆ వ్యక్తి గురించి ఒకానొక అభిప్రాయం మనసులో ముద్రపడుతుంది. మళ్లీ అలాంటిదే చదివినపుడు లేదా అలాంటి వ్యక్తితో మాట్లాడినపుడు దాని గురించి మరింత బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏ సంఘటన, అనుభవం అయినా మనసులో ఒక అభిప్రాయాన్ని మిగిలిస్తుంది. మనసులో ఏర్పడిన ఆ ముద్రనే సంస్కారం అంటారు.

రామాయణంలో అరణ్యకాండలో ఓ చిన్న ఘట్టం. రాముడు తండ్రి మాట పాటించడానికై అడవికి వచ్చాడు కదా.. మరి రాక్షసులతో అనవసరమైన తగాదా ఎందుకు, ఎప్పుడూ ఆయుధాలు పట్టుకుని తిరగడం ఎందుకు, అలా ఆయుధాలు ఉంచుకోవడం వల్ల చెడు సంస్కారాలు ఏర్పడతాయంటూ సీత.. రాముడికి ఒక కథ చెబుతుంది. ఒకానొక ముని తీవ్రంగా తపస్సు చేస్తుండగా ఇంద్రుడు అతడ్ని పరిక్షించేందుకు మరొక ముని రూపంలో వస్తాడు. ఒక అందమైన కత్తిని మునికిచ్చి మళ్లీ వచ్చి తీసుకుంటాననీ, అంతవరకూ ఉంచుకోమని చెప్పి వెళ్తాడు. కత్తిని జాగ్రత్త చేసిన ముని ఆసక్తి కొద్ది దానిని చిన్న చిన్న పనులకు వాడటం మొదలుపెట్టాడు. ఒకరోజు అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న జంతువును ఆ కత్తితో చాలా సులభంగా చంపాడు. అతనికి ముచ్చటేసింది. క్రమంగా అతడు ఓ వేటగాడిగా మారిపోయాడట. ఆయుధాన్ని దగ్గర ఉంచుకోవడం వల్ల అతని మనసు అంత క్రూరంగా మారిందని సీత చెబుతుంది. మిగతా కథను వదిలేసి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ముని చేసిన పనుల వల్లే అతని మనసులో క్రమక్రమంగా బలపడిన సంస్కారాలు.

మనిషి మనసు ఒక సంస్కారాల పుట్ట. చిన్నతనం నుంచి ఏర్పడిన లక్షలాది అనుభవాల చిహ్నాలు ఉంటాయి. ఈ సంస్కారాల వల్ల ఒక విషయంపై లేదా ఒక వ్యక్తిపై ఇష్టం (పాజిటివ్‌ అభిప్రాయం) లేదా ద్వేషం (నెగిటివ్‌ అభిప్రాయం) ఏర్పడుతుంది. ఇది మున్ముందు మన రాబోయే ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. మళ్లీ ఆ సంఘటన లేదా వ్యక్తి కనిపించినపుడు మన మనసులో ఇదివరకే ఉన్న సంస్కారాల వల్ల ముందు వెనుకలు ఆలోచించకుండా మనం ఇష్టాన్నో, ద్వేషాన్నో చూపుతాం. ఇలా సంస్కారం మన ప్రవర్తనను నియంత్రిస్తుంది.

వాల్మీకి మహిర్షి రాసిన మరొక గ్రంథం ‘‘యోగవాశిష్ఠం’’. రాముడికి వశిష్ఠుడు చేసిన వేదాంతబోధ ఈ పుస్తకంలోని విషయం. ఇదొక గొప్ప మనోవైజ్ఞానిక గ్రంథం. ఇందులో సంస్కారాలను గురించి చాలా విశ్లేషణ ఉంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్లు ఈ సంస్కారాలను పెద్ద అడ్డంకిగా భావిస్తారు. అన్ని భారతీయ సంప్రదాయాల్లోనూ (హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల్లో) ఈ సంస్కారాలపై పెద్ద చర్చ ఉంది. మన బుద్ధితో పరిశీలించి తోసివేయడం ద్వారా ఈ సంస్కారాలను తగ్గించుకోవచ్చు.

సంస్కారానికి వాసన అని మరొక పేరు. మనమనుకునే పువ్వు, సుంగంధ ద్రవ్యాల వాసన అనే అర్థంలో కాదు. వసఅంటే ఉండటం, వసించడం, నివసించడం అని అర్థం. సంస్కారం అనే ముద్ర మనసులో నివసిస్తుంది కావున దీన్ని వాసన అన్నారు. ప్రపంచ విషయాలకు సంబంధించిన వాసనలను తగ్గించుకోవడం, ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన వాటిని మాత్రమే పెంచుకోవడం సాధన యొక్క ముఖ్య లక్ష్యం. మనసు నిండా వాసనలు ఉన్నంత వరకు దేవుడు ప్రవేశించడానికి చోటుండదని అభిప్రాయం.

పధ్నాల్గవ శతాబ్దంలో హరిహరరాయలు, బుక్కరాయల ద్వారా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసిన విద్యారణ్యులు గొప్ప మంత్రియే గాక నాలుగు వేదాలకు భాష్యంతో పాటు వేదాంత శాస్త్రంలో అనేక గ్రంథాలు రాసిన మహర్షి. జీవన్ముక్తి వివేకంఅనే పుస్తకంలో సంస్కారాలను (వాసనలు) మూడు భాగాలుగా విశ్లేషించి చెప్పారు. మొదటిది శరీరానికి సంబంధించింది. శరీరాన్ని చక్కగా అలంకరించుకోవడం, అనేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం, ఆవిధంగా మనసును శరీరంతో నింపుకోవడం. దీన్ని దేహవాసన అంటారు. రెండోది లోకవాసన. అంటే ప్రజలందరూ తనను మెచ్చుకోవాలి అంటూ అనేక ప్రయత్నాలు చేయడం. ఆ ప్రయత్నాల్లో తన మనసును నింపుకోవడం. మూడోది శాస్త్రవాసన. అనేక గ్రంథాలను చదువుతుండటం, అనేక విషయాలను తెలుసుకుంటుండటం, వాటివల్ల వచ్చే విద్యామదం, ఆ మదం వల్ల వాదవివాదాలకు దిగడం మొదలైనవి. లేదా శాస్త్రంలో చెప్పిన ఆచారాలను, నియమాలను తీవ్రంగా ఆచరించడానికి ప్రయత్నించడం. ఇదొక విధమైన అనుష్ఠాన వ్యసనం అన్నారు విద్యారణ్యులు. ఇవి ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకులు.

మనిషి సంస్కారాలకు బానిస కానక్కర్లేదు. సంస్కారాలను మార్చుకోవడం ఎలా అన్నదానిపై భగవద్గీత, పతంజలి యోగసూత్రాలు మొదలైనవి అనేక మార్గాలను చెబుతాయి. గీతలోని ఆరవ అధ్యాయమంతా ఈ సంస్కారాలను మార్చుకోవడం గురించే. యోగసూత్రాల్లో ప్రతిపక్షభావనం అన్నాడు పతంజలి. చెడు సంస్కారాల మూలాల్ని గూర్చి ఆలోచించడం, కారణాలను విశ్లేషించడం, వాటికి ప్రతిపక్షమైన మంచి ఆలోచనను నింపుకోవడం ఇందులోని విషయం. దీన్ని ఈనాటి భాషలో positive thinking, mindfulness med itation అంటారు.

లౌకిక జీవనంలో మనపిల్లల మనసుల్లో సరైన సంస్కారాలు నిర్మించడం తల్లిదండ్రుల బాధ్యతే. రామాయణం, భారతం లాంటివి లేకపోగా, ఇటీవల కాలంలో నేతాజీ, వివేకానందుడు మొదలైన వారిని గూర్చిన పాఠాలు, దేశభక్తిని తెలిపే పాఠాలు కూడా పిల్లల సిలబస్‌లో ఉండటం లేదని సమాచార కమిషన్‌ విమర్శించింది. ప్రతి ఇంట్లో కనీసం వంద మంచి పుస్తకాలను, పాజిటివ్‌ థింకింగ్‌ ఇచ్చే పుస్తకాలను ఉంచుకోవడం పిల్లలపై మంచి ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు ప్రతిరోజూ ఐదు నిమిషాలు దేవుడికి దండం పెట్టుకుంటే ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది. అలాగే వారు పుస్తకాలను చదివితే పిల్లలు కూడా అనుకరిస్తారు. రాజకీయ పార్టీల బోధనల వల్ల విద్యార్థుల మనస్సులు ఎంత కలుషితం అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. సంస్కారాలు మార్చుకోవడం ద్వారా మనిషి తనలోని దైవత్వాన్ని తెలుసుకోవడం ఆధ్యాత్మిక సాధనం. కనీసం మంచి పౌరుడిగా ఉండటానికి సంస్కారాలను నిర్మించడం సమాజంలోని అందరి బాధ్యత.


Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి