మాఘమాసం అంటేనే శుభాలమాసం‏

శుభాల మాసం మాఘం! 
మాఘం అంటేనే యజ్ఞం అని అర్థం. అందుకే ఈ మాసంలో పండగలూ, శుభకార్యాల సందడి ఎక్కువ. మాఘస్నానం మహా పుణ్యకారకం. ఆద్యంతం ఆనంద, ఆధ్యాత్మికానుభూతులను పంచే మాఘానిది నిత్య వైభోగమే!

పచ్చని పందిళ్లూ, పూల తోరణాలూ, బాజా భజంత్రీలే కాదు చన్నీళ్ల స్నానాలూ, శివరాత్రి జాగారాలూ, ప్రత్యక్ష భగవానుడి పూజలూ అన్నీ ఉంటాయి మాఘమాసంలో. సరస్వతీ దేవి జన్మించిందీ, భీష్ముడు పరమపదాన్ని చేరుకుందీ ఈ నెలలోనే. అంతేకాదు త్రేతాయుగంలో రామసేతు నిర్మాణం మొదలయిందీ, ద్వాపరయుగం ప్రారంభమయిందీ కూడా ఈ మాసంలోనేనని పురాణాలు చెబుతున్నాయి. సంస్కృతంలో మఘం అనే పదానికి యజ్ఞం అన్న అర్థం ఉంది. యజ్ఞయాగాలకు అధిపతి అయిన ఇంద్రుడిని మఘవుడు అంటారు. ఆయన ఆధిపత్యం వహించే మాసం కనుక దీన్ని మాఘమాసంగా పిలుస్తారు.
ఆరోగ్య స్నానం 
దుఃఖదారిద్య్ర నాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచ 
ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం 
మకరస్థే రవౌ మాఘే గోవిందార్చిత మాధవ 
స్నాననేనానే నమోదేవ యథోక్త ఫలదోభవ! 

సూర్యోదయానికి పూర్వం చేసే మాఘస్నానం ఎంతో ప్రశస్తమైంది. నదులూ, సరస్సులూ దగ్గరలో ఉన్నవాళ్లు మాఘమాసంలో సంకల్పోక్తంగా ఈ శ్లోకాన్ని పఠించి స్నానమాచరిస్తారు. జలాశయాల్లో స్నానం చేసే అవకాశం లేని వాళ్లు ఇంట్లోనే మంత్రోక్తంగా స్నానమాచరిస్తారు. మాఘ స్నానం దుఃఖాన్ని ఉపశమింపజేసి దారిద్య్రాన్ని పారదోలుతుందట. అందాన్నీ, ఐశ్వర్యాన్నీ, ఆరోగ్యాన్నీ కలిగిస్తుందట. అఘము అన్న పదానికి పాపం అన్న అర్థమూ ఉంది. అందుకే ఈ మాసంలో చేసే స్నానాలు పాపపరిహారానికి ఉద్దేశించినవంటారు. మాఘస్నాన ప్రశస్తి బ్రహ్మాండ, నారద పురాణాల్లో కనిపిస్తుంది. ఈ మాసంలో త్రివేణీ సంగమ స్థానంలో ఆచరించే స్నానం కోటి పుణ్యస్నానాలతో సమానమట. ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మహామాఘం అని పిలుస్తారు. నెలమొత్తం ఏ రోజు మాఘస్నానం చేయకపోయినా ఈ రోజు తప్పక చేయాలంటారు.
 
చదువులమ్మ పుట్టినరోజు 
బ్రహ్మదేవుడు సృష్టించిన జగత్తు ఒకప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉండేదట. దాన్ని చూసి చిరాకు చెందిన బ్రహ్మ తన కమండలంలోని నీళ్లను నేల మీదకు చిమ్మాడట. చిగురు కొమ్మల మీద పడ్డ ఆ నీటి బిందువుల నుంచి రెండు చేతులతో వీణను వాయిస్తూ ఒక మహాశక్తి ఉద్భవించిందట. మరో రెండు చేతులతో జపమాలా పుస్తకాలూ ధరించిన ఆ తల్లి జగత్తులోని స్తబ్దతను పారదోలిందట. అలా అమ్మవారు రూపుదాల్చింది మాఘశుద్ధ పంచమి రోజునేనంటారు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే విద్యలో తిరుగులేని వాళ్లవుతారంటారు. దీన్ని కొన్ని చోట్ల కామదహనోత్సవంగా జరుపుకుంటారు. ఆరోజు రతీ మన్మథులకు మల్లెపూలతో పూజ చేస్తారు. 
సూర్యాయనమః 
మాఘశుద్ధ సప్తమినే రథ సప్తమి అని కూడా పిలుస్తారు. సూర్యుడి రథ గమనం ఉత్తర దిక్కుకు మళ్లే ఈ రోజుకు హైందవ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ధనుర్మాసంలోని నెలరోజులూ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి వాటిమీద ఆరుబయట వండిన పాయసాన్ని చిక్కుడు ఆకులో సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారీరోజు. అంతేకాదు ఆ రోజు చేసే స్నానానికీ ప్రత్యేకత ఉంది. చిక్కుడు లేదా జిల్లేడు ఆకులూ, రేగుపండ్లను తలమీదా రెండు భుజాల మీదా ఉంచుకుని వాటిమీద నుంచి నీళ్లు పోసుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి. సూర్యుడి కిరణాలు రోగనాశకాలు. అందులోనూ సూర్యుని మొదటి ఏడు కిరణాలకు మరింత మహిమ ఉంటుందట. వాటి పేర్లు సుషుమ్నం, హరికేశు, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, ఆర్వాదము, స్వరాడ్వసు. స్నానానంతరం ఈ పేర్లను జపించి సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకోవడం ఆరోగ్యప్రదం అని అంటారు.
భీష్మ తర్పణం 
మాఘమాసంలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట. కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ ఏకాదశి రోజే పరమపదాన్ని పొందాడంటారు. మాఘశుద్ధ సప్తమి మొదలుకొని ఏకాదశి వరకూ ఒక్కో రోజూ ఒక్కో ప్రాణాన్ని విడిచిపెట్టాడు గనుక ఈ ఐదు రోజులనీ భీష్మపంచకాలుగా పిలుస్తారు. భీష్మాష్టమి నాడు ఈ కురుయోధుడికి శాస్త్రòక్తంగా ఆబ్దీకం నిర్వహించి తర్పణం ఇస్తే చక్కని సంతానం కలుగుతుందని పురాణోక్తి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజు మాఘస్నానం చేసి ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల ఉపవాస ఫలితం వస్తుందట. ఈ నెలలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. ఆనాడే రామసేతువు నిర్మాణం పూర్తయిందని పురాణాలు చెబుతున్నాయి.
జాగారాల పండగ 
శివభక్తుల పెద్దపండగా ఈ నెలలోనే వస్తుంది. మాఘబహుళ చతుర్థి... శివ పురాణం ప్రకారం పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన పవిత్రదినం. అందుకే ఆనాడు భక్తులంతా తెల్లవారు జామున చన్నీటి స్నానం చేసి, జాగారాలు ఉండి, నిరంతర శివనామ స్మరణతో మహాదేవుడ్ని అర్చిస్తారు. ఇక శివాలయాల్లో ఆ రోజు అర్చనాభిషేకాలు మొదలు శివకల్యాణం దాకా జరిగే తంతుకు ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది. ఈ రోజుకు ముందు వచ్చే త్రయోదశి ద్వాపరయుగానికి ప్రారంభం అనేది పెద్దల ఉవాచ. అందుకే, ఎన్నో పవిత్ర క్రతువులకు నాంది పలికే మాఘమాసమంటేనే శుభాలమాసంగా మనందరికీ గుర్తొస్తుంది!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)