మట్టికుండ

మట్టికుండ

జీవితంలో విజయానికి భగవద్గీత

by 11:12:00 PM 0 comments
గవద్గీత జ్ఞానం సర్వసమస్యలను నివారిస్తుంది, సకల శుభాలను కలిగిస్తుంది. మానవులందరి సమస్త దుఃఖాలను తరిమివేయడానికి, వారికి సమస్త విజయాన్ని చేకూర్చడానికే భగవద్గీత జ్ఞానం ధరణిపై అవతరించింది. దాదాపు పన్నెండు కోట్ల సంవత్సరాల కిందటే శ్రీకృష్ణుని ద్వారా సూర్యదేవుడైన వివస్వానునికి చెప్పిన ఈ గీతాజ్ఞానము 20 లక్షల సంవత్సరాలుగా మానవ సమాజంలో విలసిల్లుతున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాలక్రమంలో దాని ఉనికి తగ్గినట్లు కనిపించడం వల్ల శ్రీకృష్ణుడు తిరిగి దానిని ఐదువేల సంవత్సరాల కిందట అర్జునునికి చెప్పాడు.

మానవుల సకల శ్రేయస్సు కొరకు చెప్పబడిన భగవద్గీత మీద జనులకు ఎందుకు విశ్వాసం కలగడం లేదు? ఇది వినేవాళ్లలో లోపమా, లేకపోతే చెప్పే వాళ్లలో లోపమా? సమస్త దుఃఖాలలో కూరుకొనిపోయి ఉన్నప్పటికిని జనులు ఎందుకు సకల సమస్యా నివారిణియైున భగవద్గీతను ఆశ్రయించలేకపోతున్నారు? నిజంగా భగవద్గీతలో సర్వసమస్యలను నివారించగలిగేటంత శక్తి ఉన్నదా? నిజ జీవితంలో భగవద్గీతను ఏ విధంగా అమలు చేయవచ్చును? ఐదువేల ఏళ్లనాడు చెప్పిన భగవద్గీత నేటి 21వ శతాబ్దం పరిస్థితిలో సంగతమే అవుతుందా? ఇటువంటి ఎన్నో ప్రశ్నల కారణంగా మనిషి ఈ దివ్య గీతాజ్ఞానానికి దూరమవుతున్నాడా?

దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని దివ్యసందేశమైనట్టి భగవద్గీత అత్యంత పురాతన కాలం నుంచి గంగానదిలాగా మానవసంఘంలో ప్రవహిస్తోంది. తత్కారణంగా అనంతకాలం నుండి అసంఖ్యాకమైన పుణ్యాత్ములు అమృతమయమైన గీతాజ్ఞానాన్ని స్వీకరించి కృతార్థులై తరించారు. కొంతమంది మహనీయులు కేవలం తామే గీతామృతం ద్వారా అమరులు కావడంతో సంతృప్తి చెందక, దానిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆ విధంగా వారు ప్రపంచమానవాళినందరినీ ఉద్ధరించారు. అన్ని రకాల జీవులలో కనిపించే కార్యాలను నాల్గింటిగా మనం విభజించవచ్చు.

ఆహారం తినడం, నిద్రపోవడం, మైథునసుఖం అనుభవించడం, స్వీయరక్షణ చేసుకోవడం. అయితే అతి దుర్లభంగా లభించే మానవజన్మలో ఈ కార్యాలతో పాటు ఆత్మోద్ధారానికి సంబంధించిన పనులను కూడా ప్రవేశపెట్టాలి. ఇంకా సూటిగా, స్పష్టంగా చెప్పాలంటే పైన తెలిపిన నాలుగు కార్యాలను ఆత్మోద్ధారముతో ముడిపెట్టి జీవించి పరమానందాన్ని పొందాలి. ఈ విధంగా చేయకపోతే మానవసమాజం కేవలం జంతుసమాజమే అవుతుంది. ఆత్మదర్శనానికై ఉవ్విళ్లూరే శ్రద్ధాళువు హృదయంలో మహోన్నతమైన మార్పును తీసుకొనిరావడంలో భగవద్గీత ఒక గొప్ప పాత్రను పోషిస్తుంది.

భగవదవతారమైన వ్యాసదేవుడే సకల శాస్త్రాలను రచించారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ఆయన రచించారు. అయితే భగవద్గీత అనేది స్వయంగా భగవంతుడు పలికిన జ్ఞానం. సకల మానవాళి శ్రేయస్సు కొరకే శ్రీకృష్ణుడు దానిని పలికాడు. ఆ దేవదేవుడు తొలుత గీతాజ్ఞానాన్ని సూర్యునికి చెబితే, సూర్యుడు తన పుత్రుడు మనువుకు చెప్పాడని, మనువు దానిని ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడని భగవద్గీతలో ఉంది. ఈ రకంగా గీతాజ్ఞానామృతం మానవసమాజంలో లభించడం మొదలైంది.

నిజానికి జ్ఞానమే బలం. కండబలం నిజమైన బలం కానేకాదు. ఇది అక్షర సత్యం. జీవికను సంపాదించుకోవడానికి మనిషి ఏదో ఒక, ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. కానీ నిత్యజీవనాన్ని, నిత్యానందాన్ని ప్రసాదించే జ్ఞానం అన్ని జ్ఞానాలలో శ్రేష్టమైనది. అది సామాన్య జ్ఞానానికి పూర్తిగా భిన్నమైనట్టిది. దానికి కేవలం ప్రామాణిక శాసా్త్రల ద్వారా, సాధువురుషుల ద్వారా, ప్రామాణిక గురువు ద్వారా మాత్రమే మనిషి పొందగలుగుతాడు. శ్రీకృష్ణుడు అటువంటి దివ్యమైన జ్ఞానాన్ని జనులందరికీ ఇచ్చాడు కనుకనే జగత్తులో జగద్గురువుగా ప్రసిద్ధి చెందాడు.

అటువంటి జగద్గురువు కోరిన రీతిగా గీతాజ్ఞానాన్ని పంచే శుద్ధ భక్తులు నిశ్చయంగా భగవత్కృపకు పాత్రులౌతారు. ఆ విధంగా కృష్ణకృపకు పాత్రులయ్యే భక్తులు జీవితంలో కృతకృత్యులై రాబోయే తరాలవారికి ఆదర్శనీయులౌతారు. తనను అనుసరించే వారి జీవితాలను జయప్రదం చేయడంలో భగవద్గీత మహిమ ఎంతో ఘనమైనది. అందుకే గీతాజ్ఞానం మానవసంఘంలో తెంపు లేకుండా ప్రవహిస్తూ ఉంది.

- డాక్టర్‌ వైష్ణవాంఘ్రి సేవక దాసు, పిహెచ్‌డి, అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము (ఇస్కాన్‌)


Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి