సదవగాహన
వనంలోకి వసంతం ప్రవేశించింది. అంతా పచ్చగా మారింది.
అప్పుడే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది. నిన్నటి విత్తనం నేడు
మొలకగా మారి, ఆ తరవాత ఆకులతో విచ్చుకుంది. ఆ గాలి తాకుతూ, శ్వాస నిరంతరం సాగుతూ, మనిషి ప్రాణం నిలబెడుతోంది. ‘ఇదంతా ఎవరు చేస్తున్నారు’ అని ప్రశ్నించే ముందు, ప్రకృతి పనిచేసే తీరును మనిషి తెలుసుకోవాలి. అంతకన్నా
ముందు, ఆ ప్రకృతి- విశ్వశక్తి అధీనంలో ఉందని గ్రహించాలి. మనసు, బుద్ధి, అహంకారం, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి
అని ఎనిమిది విధాలుగా ప్రకృతి ఉంటుంది. అది ‘అష్టావిధ ప్రకృతి’ అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ స్పష్టీకరించాడు. అదంతా తన
అధీనంలోనే ఉందని వెల్లడించాడు. మట్టిముద్ద
గురించి తెలిస్తే, ఆ
నేల సారమంతా అవగతమవుతుంది. అదేవిధంగా సత్యం అనేది మరెక్కడో కాదు- మనిషిలోనే ఉంది.
ఇవన్నీ అతడు స్పష్టంగా గ్రహించాలి. అందువల్ల జీవనయానం సుఖవంతంగా మారుతుందని
శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. అనేకులు
అనేక రకాలుగా చెబుతారు. పలు విధాలుగా వాదించేవారూ ఉంటారు. వివిధ రూపాల్లో చర్చలు
సాగుతూనే ఉంటాయి. ఏవి ఎలా ఉన్నా, ఏనాటికీ
సత్యం మారదు. దాని రూపాన్ని అసలే మార్చుకోదు. సత్యం తెలుసుకోవడం వల్ల, మనిషి చేసే పనిలో నిపుణత పెరుగుతుంది. చక్కగా పనిచేయడం
సాధ్యపడుతుంది. బుద్ధి కుశలత (సరైన ఆలోచన కలిగి ఉండటం) అలవాటుగా మారుతుంది.
ఆధ్యాత్మికత కారణంగా ఆత్మవికాసం లభిస్తుందని కర్మయోగం ఇదివరకే నిరూపించింది.
అన్వేషణలో భాగంగా శాస్త్రజ్ఞులు చేసే పనుల్ని కొందరు పట్టించుకొనకపోవచ్చు.
అంతమాత్రాన విజ్ఞానం ఆగిపోదు. పరిశోధనలు నిలిచిపోవు. దైవాన్ని, ఆ కారణంగా జరిగే పనుల్ని కొంతమంది అవగాహన
చేసుకోలేకపోవచ్చు. పైగా విమర్శించనూ వచ్చు. అంటే, దైవ ప్రణాళిక వాళ్లకు అర్థం కాలేదన్న మాట. ప్రపంచంలో పలువురు సవ్యంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ‘భగవంతుడు’. ఆయనను
ప్రేమించాలి. భక్తిగా అర్చించాలి. అప్పుడే మనిషి లోలోపల దైవం ప్రవేశిస్తాడని
పురాణాలు చెబుతున్నాయి. కురుసభలో అవమానభారంతో ఉన్న ద్రౌపది ‘ద్వారకవాసా!’ అని శ్రీకృష్ణుణ్ని ప్రార్థించింది. ఆయన
ప్రతిస్పందించలేదు. ఆ వెంటనే ఆమె ‘నా
హృదయ నివాసా!’ అని
పిలిచింది. కళ్లు మూసి, చేతులు
జోడించి, ప్రార్థించింది. తక్షణం ఆయన రక్షించాడని పురాణ గాథ
చెబుతోంది. దైవాన్ని
తెలుసుకోవడానికి, మనిషి
తన హృదయపు తలుపును తానే తెరవాలి. అందుకు ముందుగా నిరంతర అన్వేషణ సాగించాలి.
అంతులేని విశ్వాసంతో ముందుకు అడుగేస్తే, ఈశ్వరానుగ్రహం లభిస్తుందని పెద్దలంటారు. ‘అమ్మ నాకు ఇంకా దర్శనమివ్వలేదు. సాయంసంధ్య ముగుస్తోంది.
ఎలా...’ అని రామకృష్ణ పరమహంస తల్లడిల్లేవారు. ఆమె కటాక్షం కోసం
నిశ్శబ్దంగా రోదించేవారు. ఆ భక్తుడు ఒక అడుగు ముందుకు వేస్తే, జగజ్జనని పది అడుగులు ముందుకొచ్చింది. దివ్యశక్తితో
కారుణ్యభావంతో ఆయనను అనుగ్రహించిందని చరిత్ర చెబుతోంది. పక్వానికి వచ్చిన ఫలం
నోటికి అందినంత సులువుగా, మనిషికి
భక్తిని అందిస్తాడు భగవంతుడు. ఆయన చెట్టు రూపంలో ఉంటాడు. ప్రకృతి రూపంలో
కనిపిస్తుంటాడు. బిడ్డను అర్థం చేసుకుని ఆదరించే తల్లిలా అనుగ్రహిస్తాడు.
దైవకర్మను గ్రహించి భక్తుడు వ్యవహరిస్తాడు. పని జరుగుతుంటుంది. విశ్వం నడుస్తూనే ఉంటుంది. ఏది ఎవరు
ఎందుకు చేస్తున్నారో మనిషి తెలుసుకోవాలి. పనులు జరిగిపోతున్నాయని అనుకుని
వూరుకుంటే కుదరదని సత్యాన్వేషులు చెబుతుంటారు. దైవం గురించిన అవగాహన అంటే అదే!
- ఆనందసాయి స్వామి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి