మట్టికుండ

మట్టికుండ

యజ్ఞం అంటే ? తపస్సు అంటే ?

by 12:14:00 AM 0 comments
శ్రీకృష్ణుడు భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలో యజ్ఞం అనే పదానికి చాలా విస్తృతమైన అర్థాన్ని చెప్పాడు. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయయజ్ఞం, జ్ఞానయజ్ఞం అంటూ విభజన చేశాడు. పై చెప్పిన విధంగా అనేక సాధన సామగ్రిని సమకూర్చుకుని చేసే యజ్ఞం ద్రవ్యయజ్ఞం. అంతేకాక పుణ్యతీర్థాలలో దానాలు చేయడం, పూజనీయులైన వ్యక్తులకు లేదా కార్యాలకు ధనమివ్వడం, ప్రజల కోసం బావులు, చెరువులు తవ్వించడం మొదలైనవి కూడా ద్రవ్యయజ్ఞాలు.

తపస్సు అంటే సత్యాన్ని గూర్చి ధ్యానించడం, ఆలోచించడం అని అర్థం. ఇలాంటి ధ్యానానికి తపస్సు అని పేరు. దానిలో నిమగ్నమై ఉండడం తపోయజ్ఞం. కఠినమైన శారీరక నియమాలున్న చాంద్రాయణం మొదలైనవి తపోయజ్ఞాల్లో మరొకరకం. చాంద్రాయణం అంటే చంద్రుని అయనం(చంద్రుడు పెరగడం, క్షీణించడం)ను అనుసరిస్తూ పాడ్యమి రోజు ఒక ముద్ద భోజనంతో మొదలుపెట్టి పదిహేనవ రోజు పదిహేను ముద్దలు, మళ్లీ పదిహేను రోజులు రోజుకొక ముద్దను తగ్గిస్తూ అమావాస్య రోజు ఒకే ముద్దతో ముగించడం అనే వ్రతం. యోగయజ్ఞాలు అనేక రకాలు. పతంజలి యోగసూత్రాల్లో చెప్పిన ప్రాణాయామ పద్ధతులు, అనగా గాలిని పీల్చుకోవడం, వదలడం ద్వారా మనస్సును నిగ్రహించుకోవడం కూడా ఒక విధమైన అహుతియే. అలాగే ఇంద్రియాలను నిగ్రహించడం అన్నది సంయమనం అనే అగ్నిలో హోమం చేయడంలాంటిది. విషయాల్ని ఇంద్రియాలలో అహుతి చేయడం మరొక యజ్ఞం. ఇంద్రియాలు లాగినట్టల్లా వెళ్లకుండా శాస్త్రం అనుమతించిన వాటినే గ్రహించడం, శాస్త్రం అనుమతించని వాటిని వదిలేయడం దీనర్థం. లక్షల ఖర్చుతో ద్రవ్యయజ్ఞం చేయడం కంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం కష్టం కావున దాన్ని యజ్ఞమన్నారు. అలాగే సమయం వృథా చేయకుండా శాస్త్రవిషయాల్ని(గీత, ఉపనిషత్తులు వాటిని) తెలుసుకోవడం స్వాధ్యాయ యజ్ఞం.

మిగతా అన్ని యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం గొప్పది అంటాడు శ్రీకృష్ణుడు. జ్ఞానమంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం. దేవుడు అంటే కేవలం చైతన్యమే అని, అదే ప్రపంచరూపంలో కనిపిస్తుందనీ, జీవుడు కూడా చైతన్యమే అని ఉపనిషత సిద్ధాంతం. యజ్ఞంలో ఆహుతుల్ని అగ్నిలో సమర్పిస్తాం. ఆ ఆహుతులన్నీ భస్మమైపోతాయి. పైచెప్పిన ద్రవ్యయజ్ఞంలో ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడమనేది ఆహుతిలాంటిది. యోగయజ్ఞంలో ఇంద్రియాల్ని నిగ్రహించడం అనేది ఆహుతిలాంటిదే. అలాగే బ్రహ్మ అనే అగ్నిలో నేనును ఆహుతి చేయడం జ్ఞానయజ్ఞం. అనగా నేను’, ‘అహంఅనే భావనను విలీనం చేయడం. దేహము, ఇంద్రియాలు కలిసిన ముద్దయే నేను అనే భావనను నేను చూస్తున్నదంతా బ్రహ్మయే అనే భావనలో ఆహుతి చేయడం.
నేనుఅంటే సమాజంలో నా స్థానం, అంతస్తు, మతం, కులం, జాతీయత, విద్యార్హతలు, నాకున్న ఇష్టాలు, అయిష్టాలు, ప్రేమ, ద్వేషం, కోరికలు మొదలైన వాటన్నింటి సమాహారం(కలయిక). జ్ఞానమనే అగ్నిలో నేనును ఆహుతి చేయడమంటే పై అన్నింటినీ తోసిపుచ్చడం. ఇవన్నీ కేవలం సాపేక్షికమైనవే అని వాటన్నింటినీ విశ్లేషించి వివేకమనే అగ్నిలో కాల్చి బూడిద చేయడం. జాతీయత, కులం, మతం మొదలైన అన్నింటికీ అతీతంగా ఉండడం. దీన్ని జ్ఞానాగ్ని అంటాడు కృష్ణుడు. ఈ జ్ఞానాగ్నిలో మన కర్మలు(చేసే పనులు) అన్నీ నశిస్తాయి అంటాడు. ఇట్లాంటి వివేకమున్న వ్యక్తి ఏ పనిచేసినా అది సమాజం శ్రేయస్సుకే ఉంటుందని అతని సొంతానికి ఫలితమేమీ ఉండదనీ దీని అర్థం.


భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన పై యజ్ఞాలన్నీ జ్ఞానానికి తోడ్పడేవి. కేవలం యజ్ఞాలు, కర్మకాండ ముఖ్యమనుకునే ఆ రోజుల్లో వేదవ్యాసుడు శ్రీకృష్ణుడి పాత్రద్వారా సమాజంలో అన్ని స్థాయిల్లో ఉన్న వ్యక్తులకూ ఆధ్యాత్మిక మార్గం చూపించాడు. వ్యక్తిగత జీవితంలో శరీరేంద్రియాల్ని అదుపులో పెట్టుకోవడం కూడా యజ్ఞమే అని చెప్పడం, సమాజ శ్రేయస్సుకై చేసే ఎలాంటి పనైనా యజ్ఞంలాంటిదే అని చెప్పడం బహుశా ఆ కాలానికి విప్లవాత్మకమైనవిగా అనిపించి ఉండవచ్చు.
-డాక్టర్‌ కె. అరవిందరావు

Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి