రెండు స్థాయిల్లో దేవుడు

ప్రపంచంలోని అనేక మతాలకూ, భారతీయ మతాలకూ ఒక ముఖ్య భేదం ఉంది. దీన్ని వివరిస్తూ మ్యాక్స్‌ ముల్లర్‌ ఇలా అన్నాడు.what distinguises the vedanta philosophy from all other philosophies is that it is at the same time a religion and a philosophy. ఇతర మతాల్లో ముఖ్యంగా ఒకే మతగ్రంథం ఉంటుంది. దాని ఆధారంగా మిగతా గ్రంథాలు వస్తాయి. ముఖ్యమైన మతగ్రంథం ఒకానొక వ్యక్తి, ఒకానొక చారిత్రకసమయంలో దేవుడి సాక్షాత్కారాన్ని పొంది దేవుడి ఆజ్ఞగా తన ప్రజలకు చెప్పిన విషయాలకు సంబంధించినది. ఇవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు. శాస్త్రీయంగా సమర్థించలేనివి. ఒక మతం వారు మా విశ్వాసం సరైనది అంటే మరొక మతం మా విశ్వాసం సరైనది అనవచ్చు. భారతీయ (హిందూ, బౌద్ధ, జైన) మతాల్లో తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, మత సంబంధమైన పుస్తకాలు సమన్వయం చేయబడి ఉంటాయి. ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు తత్త్వశాస్త్రంలోనూ భాగమే, మతగ్రంథాల్లోనూ భాగమే. అందుకే హింద మతగ్రంథాలు రెండు స్థాయిల్లో విషయాన్ని బోధిస్తాయని మునుపటి ఒక వ్యాసంలో ప్రస్తావించాను. తత్త్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్న వాడికి ఆ స్థాయిలోనూ, ఆ శక్తి లేనివాడికి పురాణాలు మొదలైన స్థాయిలోనే విషయాన్ని చెబుతాయి. 

పరమాత్మ అంటే విశ్వమంతా వ్యాపించిన శుద్ధచైతన్యం అనీ, సృష్టి అనేది ఆ చైతన్యం నుండి వచ్చిందే అనీ, ఆ చైతన్యంలోని క్రియాశక్తి వల్ల ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, చెట్లు చేమలు, చిట్ట చివరిగా ప్రాణులు వచ్చాయనీ, పంచభూతాల మరో రూపంగానే ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి అని విశ్లేషించి చెప్పడం శాసీ్త్రయమైన విచారం. ఇది తత్త్వశాస్త్రం అనే కోవకు వస్తుంది. ఉపనిషత్తులు, వాటిపై వచ్చిన వ్యాఖ్యానాలు పై విషయాల్ని అనేక కోణాల్లో వివరించి చెబుతాయి. వీటిని తెలుసుకోవడానికి కొంత శ్రద్ధ, కొంత విషయజ్ఞానం ఉండాలి. పురాణాలలో త్రిమూర్తులు, సృష్టి, స్వర్గం, నరకం మొదలైన విషయాలు, విశ్వాసానికి చెందినవి, ఎవరూ నిరూపించలేనివి ఉంటాయి. వీటిని కూడా మన సంప్రదాయం అంగీకరించింది.

పై రెంటిలో ఏది నిజం? ఆకాశంలో చేతిలో కర్రపట్టుకుని ఒకానొక దేవుడు ఉన్నాడు అనేది ఏ శాస్త్రజ్ఞుడు ఒప్పుకోడు. అందువల్ల శాస్త్రీయంగా ఆలోచించేవాడికి మొదట చెప్పింది నిజం. కానీ మన చుట్టూ సమాజంలో అనేక సంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని తోసివేయాలంటే బలాత్కారంతో, రక్తపాతంతో ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో అలా జరిగింది కానీ మనదేశంలో అలా జరగలేదు. ఒక బాలుడు బొమ్మ ట్రైన్‌ను నడుపుతూ తాను నిజంగా ట్రైన్‌ నడుపుతున్నానని భావిస్తాడు. తండ్రి దాన్ని నవ్వుతూ అంగీకరిస్తాడు. పెద్దవాడయ్యాక ఎట్లూ ఆ బొమ్మతో ఆడుకోడని అతనికి తెలుసు. అలాగే ఆలోచనాశక్తి పెరగనంత వరకూ ఏదో ఒక స్థాయిలో మనిషి క్రమశిక్షణతో ఉండడం మంచిది కనుక ఆ సంప్రదాయాల్ని కూడా సరే నిజమే అన్నారు. పై స్థాయిలో చెప్పినదాన్ని పారమార్థిక సత్యం అన్నారు. కేవలం విశ్వాసంపై ఆధారపడి వ్యవహారాల్లో ఉన్నదాన్ని వ్యావహారిక సత్యం అన్నారు.

అలాగే రెండింటినీ ఒప్పుకోవడం వల్ల ఒకానొక కాలంలో లాభంపడి ఉండవచ్చు కాని మతాల మధ్య ప్రస్తుత పోటీ వాతావరణంలో కొత్త సమస్యలొస్తున్నాయి. ఒకప్పుడు శాస్త్రీయ చర్చలు చేస్తూ పండితులు ఒకవైపు, రామాయణం, భాగవతం కథలు వింటూ నిరక్ష్యరాస్యులు మరొకవైపు ఒకే విషయాన్ని రెండు స్థాయిల్లో తెలుసుకుంటూ వచ్చారు. ఒకవైపు సత్యం ఏమిటి అంటూ నిష్పక్షపాతంగా, శాసీ్త్రయంగా కొనసాగించే ఆలోచన. మరొకవైపు సమాజంలో ఇదివరకే ఉన్న సంప్రదాయాల్ని(విష్ణువు, శివుడు మొదలైనవి) అంగీకరించడం మొదటి స్థాయిలో విశ్లేషణ శాస్త్రీయమైనది కావున ఎలాంటి వివాదం ఉండదు. రెండవ స్థాయిలోని విషయాలు విశ్వాసానికి సంబంధించినవి. ఒకవైపు వైష్ణవ సంప్రదాయం, మరోవైపు శైవం, ఇంకొకచోట శక్తిపూజ మొదలైనవి. వీటి మధ్య పరస్పర వాదాలు తలెత్తకుండా శ్రీ శంకరాచార్యులు వీటన్నింటినీ ఉపనిషత్తులు అనే గొడుగు కిందకు తెచ్చారని గమనించాం. ఇలాంటి సంప్రదాయాలు అనేకం కావున అనేక దేవుళ్ళను అంగీకరించారు. ఏ సంప్రదాయం ప్రకారం పూజించినా ఒకే పరమాత్మను పూజిస్తున్నారని ఈయన సమన్వయం చేశారు. వేదాంత స్థాయిలో చెప్పిన బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు. దానికి ప్రపంచ సృష్టి, దుష్టశిక్షణ, శిష్టరక్షణలాంటి డ్యూటీలు లేవు. సంప్రదాయం, లేదా మతంలో చెప్పిన దేవుడికి ఇలాంటి డ్యూటీలున్నాయి. డ్యూటీని ఉపాధి అంటారని మనకు తెలుసు. ఈ ఉపాధి అన్న దేవుణ్ణి సోపాధిక బ్రహ్మ అన్నారు. ఇది కింది స్థాయికి చెందింది. ఉపాధిలేని సత్యము, చైతన్యం అనే దాన్ని నిరుపాధికం అన్నారు. అందువల్లే మొదటి స్థాయిలో మాట్లాడేవారు ఎప్పటికప్పుడు కింది తరగతి వారిని హెచ్చరిస్తూ మీరు సత్యం అనుకుంటున్నది పాక్షిక సత్యం మాత్రమే, ఆ స్థాయి నుంచి మీరు పైకి ఎదగాలి అంటూ చెబుతూ వచ్చారు. ఇలాంటి హెచ్చరికలు ఉపనిషత్తుల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు కేనోపనిషత్తులో ‘‘నేదం యదిదముపాసతే’’-‘‘ప్రజలు ఇది దేవుడు అని పూజిస్తున్నది సంపూర్ణసత్యం కాదు’’ అంటూ నాలుగు మంత్రాలున్నాయి. ఇదం అంటే ఇది అని నిర్ధారించి చెప్పిన విషయం. కొందరు మతపెద్దలు కూడి ఇది దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞుడు, ఇతన్నే పూజించాలి అని చెబితే అది ఇదంఅనే దాని పరిధిలోకి వస్తుంది. సృష్టి మొదలైన డ్యూటీలు ఉన్న దేవుణ్ణి ఏ మతం చెప్పినా అది ఇదంఅనే స్థాయికే వస్తుంది. దీనివల్ల ప్రయోజనాలుండవచ్చు. ఇది పూజాపునస్కారాలకు పనికివస్తుంది. మనిషిని సన్మార్గంలో పెట్టడానికి దానం, ధర్మం, అహింస మొదలైన గుణాల్ని ఇవ్వడానికి పనికివస్తుంది. అయితే ఇది వ్యవహార దశలో సత్యమే కానీ పరమార్థ దశలో కాదు. అందువల్లే వేదాంతం మాటిమాటికీ మనిషిని హెచ్చరిస్తూ నీవు మతం స్థాయిలో దేన్ని ఆరాధించినా తప్పులేదు కానీ అదే పరమసత్యం కాదు అని చెప్పింది. అసలైన శుద్ధ చైతన్యాన్ని ఇది అంటూ నిర్దేశించలేం. ఒక టార్చిలైటు వెలుగులో చీకటి గదిలోని వస్తువుల్ని చూడవచ్చు కానీ సూర్యుడువైపు టార్చిలైటు వేసి ఎవరూ చూపరు. చైతన్యం కారణంగా మనం వస్తువుల్ని చూడగలుగుతున్నామే కానీ ఆ చైతన్యాన్నే మనం చూడలేం. Consciousness cannot be objectified అని ఇవాళ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్నే చెబుతున్నారు. కావున నీవు పూజిస్తున్నది పరమసత్యంకాదు అని ఉపనిషత్తులు చెబితే ఒక నమ్మకాన్ని వదిలి మరొక నమ్మకాన్ని అంగీకరించమనీ, ఒక మతాన్ని వదిలి మరొకదాన్ని తీసుకోమని కాదు. ఏ నమ్మకమైనా ఒకే స్థాయిలోనిదే, ఉపాధి ఉన్న దేవుడే. ఇది దాటి అసలైన సత్యాన్ని, తెలుసుకోమని వాటి ఉద్దేశం. 

దీన్ని వక్రీకరించి కొందరు మీ ఉపనిషత్తుల్లోనే మీరు పూజిస్తున్నది దేవుడు కాదని చెప్పారు కదా, మా మతంలోకి రండి అనడం, ఆధునిక సాధనాలైన వాట్సప్ లాంటి ద్వారా ప్రచారం చేయడం అజ్ఞానంతో కూడిన పని. దీనివల్ల అమాయకుల్ని మతమార్పిడి చేయవచ్చు. కానీ సత్యానికి మరింత దూరంగా వెళ్లడమే అవుతుంది. మరికొందరు మీ ఉపనిషత్తుల్లో మా దేవుడి గురించే చెప్పారు అనడం మరొక మానసిక బలహీనత. సంస్కృత పండితులు నోరు మెదపకున్నంత కాలం ఇలాంటి వాదనలు ఇంకా అనేకం వస్తాయి.

ఇదంఅని చెప్పబడింది పూర్తిగా వ్యర్థంకాదు. డిగ్రీకి వెళ్ళడానికి హైస్కూలు ఎలా అవసరమో ఇదీ అలా అవసరం. అసలైన దాన్ని తెలుసుకోవడానికి అదొక గొప్ప సాధనం.

మన సంప్రదాయంలో చెప్పిన ఉసాసనలన్నీ ఇలాంటివే. అంతేగాని ఇదంలో ఉన్న ఒకటి సరైనది, మరొకటి తప్పు అనడం దురుద్దేశంతో కూడిన వాదం.

- డాక్టర్‌ కె. అరవిందరావు

రిటైర్డు డీజీపీ
(రచయిత ప్రసంగాల్ని www.advaita-academy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)