దేవుళ్ల సహస్రనామాలు

ఒక గంభీరమైన విషయాన్ని లేక చదవడానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడని విషయాన్ని అందరూ ఇష్టపడేలా చెప్పడం కష్టం. జీవుడు, బ్రహ్మ మొదలైన విషయాలు ఉపనిషత్తుల్ని చదివితే తప్ప తెలియవు.

కానీ వాటిని చదవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. వాటిలో ఉన్న విషయాల్నే ఏదో ఒక దేవుడి లీలగా భావించుకుని స్తోత్రం రూపంలో రాసి, పారాయణం చేయడం వల్ల కోటిజన్మల పాపం పోతుంది అని అంటే మనం చదవడానికి సిద్ధమవుతాం. అలా చదవగా చదవగా ఒకానొక దశలో మనకు ఆ స్తోత్రంలోని శబ్దాలపై మనస్సు వెళ్లి ఏమిటి దీని అర్థం అని ఒక ఆలోచన మొదలవుతుందని మన ఋషుల ఆశ. ఇలా వచ్చిన పుస్తకాలే దేవుళ్ల సహస్రనామాలు(వేయిపేర్లు).

మహాభారతంలో భీష్ముడు అంపశయ్య(బాణాల పరుపు)పై పడి ఉండటం మనకు తెలుసు. ఆ సమయంలో ధర్మరాజు అతని నుంచి రాజనీతి గురించి, పారమార్థిక విషయాల గురించి తెలుసుకుంటాడు. భీష్ముడు రెండు సందర్భాల్లో విష్ణు సహస్రనామావళి, శివ సహస్రనామావళిని ధర్మరాజుకు బోధిస్తాడు. వ్యాసుడికి శివుడు, విష్ణువు అని తేడా లేకపోయినా మనకున్నది కాబట్టి ఆయన అలా చెప్పాడు. అనేక దేవతా సంప్రదాయాల్ని సమన్వయం చేస్తూ ఒకే తత్వానికి చెందినట్టు చెప్పడం మన రుషుల ప్రత్యేకత అని ఇదివరలో తెలుసుకున్నాం. లలితాదేవికి సంబంధించిన స్తోత్రం బ్రహ్మాండపురాణం అనే పుస్తకంలోనిది. అలాగే మిగతాదేవుళ్ల సహస్రనామాలు అనేక పురాణాల్లోనివి.

పరమాత్మ ఒకటే. అదే శాశ్వతంగా ఉండేది. అన్నింటికీ కారణమైనది అయిన తత్వం. అదే సృష్టి, స్థితి, లయ అనే వాటికి కారణం. సృష్టిలో ఉన్న వైచిత్రికి, మంచి, చెడు అన్నింటికి అదే కారణం. దేవుడి పేర్లు రాయాలని మనమే పూనుకున్నామనకుందాం. సృష్టికర్త అని ఒకపేరు, పోషకుడు అని ఒకపేరు, లయకారకుడు అని మరొకపేరు, దుష్టుల్ని శిక్షించేవాడు అని మరొకపేరు ఈ విధంగా మనమే చాలాపేర్లు పెట్టగలం. రుషులు మన సౌలభ్యం కోసం ఉపనిషత్తుల్లో చెప్పిన పరమాత్మతత్వాన్ని అంతటినీ ఇలాంటి పేర్ల ద్వారానే మనకు అందించారు. మనం అనేక రూపాల్లో పరమాత్మను ఆరాధిస్తూ ఉంటాం. అందువల్ల ఈ సహస్రనామాలు అనేక దేవుళ్ల పేరిట ఉన్నా వాటిలో ఉన్న అసలు విషయం ఒకటే.

చిన్న పిల్లలు మొదలుగా ముసలివాళ్ల వరకు ఆడ, మగ బేధం లేకుండా విష్ణుసహస్రనామాలు, లలితా సహస్రనామాలు అలాగే శివుడు, వెంకటేశ్వరుడు, దుర్గ, గణేశుడు మొదలైన దేవతల సహస్రనామాల్ని పారాయణం చేయడం చూస్తుంటాం. సామూహికంగా వందసార్లు, వేయిసార్లు చదవడం చూస్తుంటాం. పారాయణం అనే పదంలో పరం అంటే శ్రేష్ఠమైనది అని అర్థం. ఆయనం అంటే మార్గం లేక గమ్యం. ఇదే అన్నింటికన్నా శ్రేష్ఠమైన గమ్యము, తెలుసుకోదగినది అనే భావన. దానిపై తత్పరత(తపన)తో ఉండటం పారాయణం. విష్ణువును పూజించే సంప్రదాయంలోనే వారికి వేదాంతం తెలియకపోవచ్చు. కానీ విష్ణువుకు చెప్పిన వేయి పేర్లలో పరమాత్మ తత్వాన్ని చిన్న చిన్న ఫార్ములాల రూపంలో పారాయణం చేస్తారు. సరిగ్గా అదే తత్వాన్ని అదే భాషలో శివుని సహస్రనామాల్లోనూ లేదా లలితసహస్రనామాల్లోనూ మనం గమనించగలం. వందలాది పేర్లు స్ర్తీలింగ, పులింగ భేదాలతో అన్నింటిలో సమానంగా ఉంటాయి.

ఈ పేర్లను స్థూలంగా రెండు తరగతులుగా చూడవచ్చు. మొదటిది పరమాత్మ తత్వానికి సంబంధించినది. రెండవది ఆయా దేవుడు లేదా దేవికి సంబంధించిన పురాణగాథ. ఆ దేవుడి లేక దేవి మహిమలు, లీలలు, రాక్షసుల్ని సంహరించడాలు లాంటి వాటికి సంబంధించినవి. ఏ దేవుణ్ణి పూజించినా అదే పరమాత్మ అనే విధంగా చెప్పారు. కావున మొదటి తరగతిలోని పేర్లన్ని సహస్రనామాల్లోనూ ఒకటిగానే ఉంటాయి. పరమాత్మను మన ఇంద్రియాలతో తెలుసుకోలేము అనే విషయాన్ని అప్రమేయుడు అంటూ పురుష దేవతల విషయంలోనూ, అప్రమేయా అంటూ సీ్త్రవాచకాన్ని ఉపయోగించి సీ్త్ర దేవతల విషయంలోనూ చెబుతారు. అట్లాగే పాపాల్ని హరించడం అనే విషయాన్ని హరించేవాడు హరుడు (శివుడు), హరించేవాడు హరి(విష్ణువు) అన్నారు. నశించనది అనే అర్థం చెప్పడానికి అక్షరః అనే పదం అందరి దేవుళ్లకూ వాడబడింది. అట్లానే అనంత, అవ్యక్త, ఈశ్వర, ప్రజాపతి, మూడు గుణాలకూ అతీతంగా ఉండటం మొదలైనవన్నీ పరమాత్మను వర్ణించే పదాలే.

విష్ణుసహస్రనామాల్లో మామూలుగా శివుడికి చెప్పే రుద్ర, శివ, స్థాణు, ఈశాన, ఈశ్వర మొదలైన పేర్లు వందలాది కనిపిస్తాయి. సృష్టి, స్థితి, లయ అనేవి అన్నింటిలోనూ సాధారణమే. రెండవ తరగతి చెందిన పేర్లు పురాణాల్లోని కథలకు సంబంధించినవి. విష్ణువు మధువు అనే రాక్షసుణ్ణి చంపాడు. అందువల్ల మధుసూదన అనే పేరుంది. సూదనమంటే చంపడం. ఇది విష్ణువుకు మాత్రమే ఉన్న పేరు. అలానే భండాసురుడు, శుంభుడు, నిశుంభుడు మొదలైన రాక్షసుల్ని చంపినది లలిత. అందువల్ల ఆమె పేర్లలోనే ఆ రాక్షసుల ప్రస్తావన వస్తుంది. శివుడు త్రిపురములను(వేదాంతంలో చెప్పే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేవి) నశింపజేసే వాడు అనే అర్థంలో త్రిపురాసురుణ్ణి చంపినవాడు అన్నారు. అలాగే శ్మశానంలో ఉండడం అతని ప్రత్యేకత. ఈ పదానికి శరీరంపై ఉన్న మమకారాన్ని ఛేందించేవాడు(శ్మ అంటే శరీరం, శానం అంటే బలహీనపర్చడం) అని అర్థం.

నిజానికి ఈ రెండో తరగతి పేర్లు కూడా ఒకే విషయాన్ని చెబుతాయి. దేవతలందరూ ఎలాగ ఒకే తత్వమో అట్లానే అసురులు కూడా ఒకే తమోగుణంలోని అనేక రూపాలు. లలితాదేవి చంపిన శుంభుడు, నిశుంభుడు అనే వాళ్లు కామక్రోధాలకు ప్రతీక. మరొక పురాణంలో వీటికే పేర్లు వేరుగా ఉండవచ్చు. వారిని విష్ణువు సంహరించాడని ఉండవచ్చు. తామస గుణాలకు వేర్వేరు పురాణాల్లో వేర్వేరు పేర్లు. ఆ గుణాల్ని నిర్మూలించే దేవతలకు కూడా వేర్వేరు పురాణాల్లో వేర్వేరు పేర్లు. దేవుడికి వేయి పేర్లే అని ఎలా చెప్పగలం? ఎన్నైనా చెప్పవచ్చు. కానీ మనకు సులభంగా ఉండటం కోసం వేయి చెప్పారని అనుకోవచ్చు. అట్లానే నూట ఎనిమిది పేర్లు (అష్టోత్తర శతనామాలు)కూడా. మామూలు కవులు చేసే స్తోత్రాల్లో వర్ణనలుంటాయి. గోపీకుచద్వంద్వంపైని కుంకుమతో ఎర్రబడ్డ వక్షస్థలం గలవాడు మొదలైన వర్ణనలు సహస్రనామాల్లో కనిపించవు. భగవంతుని గురించి మనకు సరైన అవగాహన కలిగించడానికి సాధనాలు ఈ సహస్రనామాలు.


(రచయిత ప్రసంగాలను యూట్యూబ్‌లో “advaita academy talks by aravinda rao” అనే శీర్షికలో చూడవచ్చు.) 
డాక్టర్‌ కె. అరవిందరావు 
రిటైర్డు డీజీపీ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)