అక్షింతల పరమార్థం ఏమిటి?
వివాహ శుభకార్యంలో జీలకర్ర , బెల్లం పెట్టె వేళ , మాంగల్యధారణ వేళ , వధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం . వివాహ శుభకార్యాల్లోనే కాదు , ప్రతీ శుభకార్యం లోనూ పెద్దలు , పిన్నలను అక్షింతలు వేసి “ దీర్ఘాయుష్మాన్ భవ , చిరంజీవి భవ , సంతాన ప్రాప్తిరస్తు , ఆరోగ్య ప్రాప్తిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు ” అంటూ ఆశీర్వదిస్తారు . ఇక దైవసన్నిధిలో సరే సరి . పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు . ‘ అక్షతలు ’ అనే మాట నుంచి వచ్చిందే ‘ అక్షింతలు ’. క్షతం కానివి అక్షతలు . అంటే రోకటిపోటుకు విరగని , శ్రేష్టమైన బియ్యం అన్నమాట . అటువంటి బియ్యాని పసుపు లేక కుంకుమతో నేతితో కలిపి అక్షింతలు తయారు చేస్తారు . నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు . ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం . జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు . ...