జీవన ఆదర్శం
గు ణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం... ఇలా అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు. ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు. ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి. అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు. పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది. అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు; పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు... ఇవన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం వల్...