తల్లిదండ్రులదే బాధ్యత
చదువు , సంస్కారం ఈ పదాలను మనం కలిపి వాడుతుంటాం. చదువు సంస్కారాన్ని ఇస్తుందని అర్థం. సంస్కారం అంటే మంచి నడవడిక అనే అర్థంలో వాడుతాం. నిజానికి సంస్కారం అనేది ఒక తటస్థ ( neutra) పదం. సంస్కారం మంచిది కావచ్చు , చెడ్డదీ కావచ్చు. జీవితంలోని ప్రతి అనుభవం మనసులో ఒక్కో ముద్ర వేస్తుంది. పత్రికలో ఒక వ్యాసం చదివినపుడు , టీవీలో ఒక కార్యక్రమం చూసినపుడు లేదా ఒక వ్యక్తితో సంభాషించినపుడు ఆ విషయంపై లేదా ఆ వ్యక్తి గురించి ఒకానొక అభిప్రాయం మనసులో ముద్రపడుతుంది. మళ్లీ అలాంటిదే చదివినపుడు లేదా అలాంటి వ్యక్తితో మాట్లాడినపుడు దాని గురించి మరింత బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏ సంఘటన , అనుభవం అయినా మనసులో ఒక అభిప్రాయాన్ని మిగిలిస్తుంది. మనసులో ఏర్పడిన ఆ ముద్రనే సంస్కారం అంటారు. రామాయణంలో అరణ్యకాండలో ఓ చిన్న ఘట్టం. రాముడు తండ్రి మాట పాటించడానికై అడవికి వచ్చాడు కదా.. మరి రాక్షసులతో అనవసరమైన తగాదా ఎందుకు , ఎప్పుడూ ఆయుధాలు పట్టుకుని తిరగడం ఎందుకు , అలా ఆయుధాలు ఉంచుకోవడం వల్ల చెడు సంస్కారాలు ఏర్పడతాయంటూ సీత.. రాముడికి ఒక కథ చెబుతుంది. ఒకానొక ముని తీవ్రంగా తపస్సు చేస్తుండగా ఇంద్రుడు అతడ్ని పరిక్షించేంద...