మనుషులకు అదొక మౌన సందేశం!
ప్రవహించే నదిలా కాలం మన కళ్లముందు కదిలిపోతుంటుంది. ఏ నదైనా సముద్రంలో కలిసేదే. ఆలోగా అది దారిలోని వృక్షాలకు , పంట పొలాలకు ప్రాణప్రదమైన జలాల్ని ఉదారంగా ఇస్తూ వెళుతుంది. ప్రవహించినంత కాలమూ నది- లోకానికి ఉపకారం చేస్తుంది. మనుషులకు అదొక మౌన సందేశం! కాలంతో మనిషి జీవితం ముడివడి ఉంది. రోజులు గడుస్తున్నకొద్దీ అతడు శారీరకంగా ఎదుగుతుంటాడు. అతడితో పాటు మొక్కలూ ఎదిగి చెట్లుగా మారుతుంటాయి. అవి తమ ఫలాల్ని ఉదారంగా అందిస్తుంటాయి. తమకు ఉన్న అన్నింటినీ సమభావంతో పక్షులకు , ఇతర ప్రాణులకు సమర్పిస్తుంటాయి. మొక్కలు సైతం తాజా పుష్పాల్ని నిస్వార్థంగా దైవపూజ కోసం సిద్ధం చేస్తుంటాయి. వాయువుదీ ఉదార స్వభావమే. అది ఉదయ , సాయంసంధ్యా సమయాల్లో ఉల్లాసంగా వీస్తుంటుంది. ఆ పవనాల్లో భగవంతుడి పట్ల ఆరాధ్యభావం కనిపిస్తుంటుంది. వీటన్నింటినీ చాలామంది పెద్దగా పట్టించుకోరు! మనిషి పుడుతూనే ఆర్తి (దుఃఖం) వ్యక్తపరుస్తాడు. ఆకలి తీర్చాలని రోదిస్తూ జీవనయానం ప్రారంభిస్తాడు. ఆ క్షణం నుంచీ అతడికి అన్నీ కోరికలే! వాటిని ఎలా తీర్చుకోవాలా అని ఎప్పుడూ దారులు వెతుకుతుంటాడు. ఆ ఆశలు తీరేందుకు , కోరికలు నెరవేర్...